చాలామందికి చీమ చిటుక్కుమన్నా మెలకువ వచ్చేస్తుంది. దీనికి తోడు భాగస్వామి గానీ లేదా ఇంట్లో పెద్దవాళ్లుగానీ అదేపనిగా గురక పెడుతుంటే… నిద్ర సంగతి దేవుడెరుగు… ఆ శబ్దం చిర్రెత్తిస్తుంది. అందుకేనేమో ఈమధ్య గురకని తగ్గించేందుకు మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు చాలానే వస్తున్నాయి. వాటిల్లో ఒకటి హూతీ యాక్టివ్ పిల్లో. ఇది గురక రావడాన్ని ముందే గుర్తించి, నిద్రలోంచి లేవకుండానే తల పొజిషన్‌ను మార్చి శ్వాస సరిగ్గా అందేలా చేయడం ద్వారా గురకని నియంత్రిస్తుందట. అదెలా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది ఏఐ పిల్లో. ‘ద నెక్ట్స్ జనరేషన్ యాంటీ స్నోర్-పిల్లో’ అనీ అంటున్నారు. చూడ్డానికి అచ్చం మెమరీ ఫోమ్ దిండులానే ఉంటుంది. ఈ దిండులోని సెన్సర్లు… బోన్ కండక్షన్ టెక్నాలజీ సాయంతో గురక రాకని గుర్తించి… బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్‌ను అలర్ట్ చేస్తాయి. అది కాస్తా గురక తీవ్రతనీ శ్వాస, గుండె వేగాల్నీ లెక్కించి… ఆ వ్యక్తికి మెలకువ రాకుండానే దిండులో వైబ్రేషన్స్ వచ్చేలా చేసి తలను కదిలించేలా చేస్తుంది. తద్వారా గురకను అరికడుతుందట. మరో రెండు నెలల్లో మార్కెట్‌లోకి రానున్న ఇది గురక బాధితులకి గొప్ప వరమే మరి!
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z