NRI-NRT

ఛార్లెట్‌లో ఎమ్మెల్యే సురేష్‌ కాకర్ల అభినందన సభ

ఛార్లెట్‌లో ఎమ్మెల్యే సురేష్‌ కాకర్ల అభినందన సభ

నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్నారై సురేష్‌ కాకర్ల అభినందన సభను ఛార్లెట్‌లో మంగళవారం నాడు నిర్వహించారు. ఎన్నారై టీడిపి, బిజెపి, జనసేన అభిమానులతో పాటు తానా నాయకులు, ఇతర ప్రముఖులు ఈ అభినందన సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సురేష్‌ అందరివాడని, సామాన్యవ్యక్తిగా ఉంటూ తన గుణంతో సేవతో నేడు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం హర్షణీయమన్నారు. తానా టీమ్‌ స్క్వేర్‌ చైర్మన్‌గా ఉన్నప్పడూ ఎంతోమందికి సహాయాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు.

సురేష్‌ మాట్లాడుతూ తన గెలుపుకోసం ఎంతోమంది ఎన్నారైలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయాన్ని అందించారని ధన్యవాదాలు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గము వెనుకబడిన ప్రాంతమని ఇక్కడ సమస్యలు కూడా పెద్దగానే ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు కొరత ఉంది. నైపుణ్యంతో కూడిన 50 వేల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నారైలు ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించుటకు అనువుగా ఉంటుందని, ప్రభుత్వ భూములు కూడా అధికంగా ఉన్నాయని, వెనుకబడిన ఈ ప్రాంతములో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయసహకారాలను అందిస్తోందని చెప్పారు. ఎన్నారైలు ఉదయగిరి నియోజక వర్గమును సందర్శించి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రమేష్ ముకుళ్ళ, బాలాజి తాతినేని, సురేష్ జాగర్లమూడి, సతీష్ నాగభైరవ, ఛార్లెట్ ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయపరచారు. ఈ కార్యక్రమంలో జనసేన తరుపున నగేష్, వీర తోట, కృష్ణ, ఎన్నారై జనసేన కార్యవర్గ సభ్యులు, బీజేపీ నుంచి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z