Business

తగ్గిన బంగారం ధర-BusinessNews-Aug 16 2024

తగ్గిన బంగారం ధర-BusinessNews-Aug 16 2024

* హైదరాబాద్‌లో 25 గృహ నిర్మాణ (హౌసింగ్‌) ప్రాజెక్టుల (6,169 ఫ్లాట్లు/ఇళ్లు) పనులు మధ్యలో నిలిచిపోయాయని డేటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. దేశంలోని 42 నగరాల్లో ఇలాంటివి 1,981 గృహ ప్రాజెక్టులు (5.08 లక్షల ఇళ్లు/ఫ్లాట్లు) ఇలానే ఆగిపోయాయని వెల్లడించింది. డెవలపర్ల ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం, ప్రాజెక్టుల అమలు సామర్థ్యాలు వారికి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. ఆగిపోయిన వాటిలో 1,636 ప్రాజెక్టులు (4,31,946 ఇళ్లు/ఫ్లాట్లు) 14 ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయని తెలిపింది. మిగిలిన 345 ప్రాజెక్టులు (76,256 యూనిట్లు) 28 ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయని వెల్లడించింది. 2018లో 4,65,555 ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోగా, తాజాగా ఈ సంఖ్య 5,08,202కు పెరిగినట్లు వివరించింది. ‘డెవలపర్ల ప్రాజెక్టుల అమలు సామర్థ్యాల లేమి, నగదు నిర్వహణ సరిగా లేకపోవడం, కొనుగోలుదార్ల వద్ద తీసుకున్న డబ్బులను కొత్త భూములు (ల్యాండ్‌ బ్యాంక్‌) కొనుగోలు చేసేందుకు దారి మళ్లించడం, తమకున్న ఇతర రుణాలు చెల్లించడం వంటి కారణాలతో చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి. గృహ కొనుగోలుదార్లు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, డెవలపర్ల సామర్థ్యాలను అంచనా వేసి, సరైన నిర్ణయం తీసుకునేందుకు స్వతంత్ర థర్డ్‌ పార్టీ ఆడిట్‌ సేవలు అందించాల్సిన అవసరం ఉంద’ని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకులు, సీఈఓ సమీర్‌ జసుజా వెల్లడించారు. నిలిచిపోయిన ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించేందుకు 2019 నవంబరులో ప్రభుత్వం స్వామిహ్‌ (స్పెషల్‌ విండో ఫర్‌ అఫర్డబుల్‌ అండ్‌ మిడ్‌-ఇన్‌కమ్‌ హౌసింగ్‌) నిధిని ప్రారంభించింది. గత 5 ఏళ్లలో దీని కింద 32,000 ఇళ్లు/ఫ్లాట్లు పూర్తయ్యాయి. వచ్చే మూడేళ్లలో ప్రతి ఏడాది 20,000 గృహాలను పూర్తి చేయాలనేది లక్ష్యం.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పరుగులు పెట్టాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు మాంద్యం భయాలను పారదోలింది. ఇది ప్రపంచ మార్కెట్లలో పాజిటివ్‌ సంకేతానికి కారణమైంది. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ దాదాపు 1400 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 24,500 ఎగువన స్థిరపడింది. ఒక్క సెషన్‌లో మదుపర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.444.3 లక్షల కోట్ల నుంచి రూ.451 లక్షల కోట్లకు చేరింది.

* భారత్‌ ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఫస్ట్‌ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌ (Gita Gopinath) అభిప్రాయపడ్డారు. ఆమె తాజాగా ఆంగ్లపత్రిక ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వృద్ధి వేగానికి వేర్వేరు కారణాలున్నాయన్నారు. 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆమె అంచనా వేశారు.

* దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.400 తగ్గి రూ.72,750 వద్ద ముగిసింది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ గణాంకాల ప్రకారం బుధవారం తులం బంగారం ధర రూ.73,150 వద్ద స్థిర పడింది. స్వాతంత్య్ర దినోత్సవం దినోత్సవం సందర్భంగా గురువారం కమొడిటీ మార్కెట్లకు సెలవు. ఇక కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.84 వేలకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.83,200 పలికింది.

* భారత్ విదేశీ మారక ద్రవ్యం (Forex Reserve) నిధులు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.8 బిలియన్ డాలర్లు తగ్గి 670.119 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు రెండో తేదీతో ముగిసిన వారంలో 7.533 బిలియన్ డాలర్లు పెరిగి 674.919 బిలియన్ డాలర్ల జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు పెరిగిన సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z