DailyDose

నంద్యాల ఇంటర్‌ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు-CrimeNews-Aug 17 2024

నంద్యాల ఇంటర్‌ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు-CrimeNews-Aug 17 2024

* మాదాపూర్‌లోని మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్పసొసైటీలో ఫ్రైడే అప్‌ కన్సెల్టెన్సీ కంపెనీ దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.50లక్షల చొప్పున వసూలు చేసి.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్‌ ఇప్పించినట్టు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. కార్యాలయానికి ఉన్న పళంగా తాళం వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీకి బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఉన్నట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మాదాపూర్‌ పోలీసులు తెలిపారు.

* హబ్సిగూడలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సాత్విక(15) అనే విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా.. నాచారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఆటో డ్రైవర్‌ ఎల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటోను తొలగించారు. సాత్విక హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

* కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోనున్నారు. ఇందుకు రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

* పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల సైతం చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది.తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ కామాంధుడి దాహానికి బాలిక బలైపోయింది. 14 ఏళ్ల మైనర్‌పై ఓ కీచక టీచర్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే బాధితురాలు 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచింది. రాష్ట్రంలోని సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు విశాంబర్‌ ఇంకా పరారీలో ఉండటం గమనార్హం.బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు బాలికను పిలిచాడు. అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక భయపడి ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.ఆమెను ఛత్తీస్‌గఢ్‌లోని బంధువుల వద్దకు పంపగా.. అక్కడ ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో బాధితురాలు మౌనం వీడి తనకు జరిగిన విషయాన్ని అత్తకు చెప్పడంతో ఆమె ఆస్పత్రిలో చేర్చింది. అనంతరం కుటుంబ సభ్యులు నిందితుడిని నిలదీయగా.. అతడు వారికి రూ. 30 వేలు ఇచ్చి ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు.దీంతో కుటుంబ సభ్యులు భయపడి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదు. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జూలై 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన విశాంబర్‌పై కేసు నమోదు చేశారు. బాలికను వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించింది.

* ఆత్మకూరు ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం కేసు.. విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు విస్తుపోయే వివరాల్ని మీడియాకు వెల్లడించారు. స్నేహితులే అతన్ని ఎత్తుకెళ్లడం, ఆపై అమానవీయంగా ప్రవర్తించడంతో అతను బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు.ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్‌ బాషా ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు.ఈలోపు మూడు రోజులు గడిచాయి. అయినా వహీద్‌ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబంలో ఆందోళన పెరిగిపోయింది. ఈలోపు.. ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్‌ శవమై కనిపించాడు. దీంతో.. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. చివరకు.. స్నేహితుల వల్లే వహీద్‌ చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు.అర్బన్ సీఐ లక్ష్మినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. వహిద్‌కు స్నేహితులతో ఏవో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కిడ్నాప్‌ చేసిన తీవ్రంగా కొట్టిన యువకులు.. అతన్ని దుస్తులు విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. దాడి గురించి బయట ఎవరికైనా చెబితే ఆ ఫొటోల్ని నెట్‌లో పెడతామని బెదిరించారు. దీనిని అవమానభారంగా భావించిన వాహిద్‌ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు కారకులైన నలుగురు యువకుల్ని అరెస్ట్‌ చేశాం అని తెలిపారయన.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z