ScienceAndTech

Indian Air Force: విజయవంతంగా “భీష్మా” మొబైల్ ఆసుపత్రి పారాడ్రాప్

Indian Air Force: విజయవంతంగా “భీష్మా” మొబైల్ ఆసుపత్రి పారాడ్రాప్

భారత వైమానిక, సైనిక దళాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన పోర్టబుల్‌ హాస్పిటల్‌ను విజయవంతంగా పారాడ్రాప్‌ చేశారు. ఆరోగ్య మైత్రీ హెల్త్‌ క్యూబ్‌గా పేర్కొనే ఈ హాస్పిటల్‌ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైందని పేర్కొంటూ రక్షణ శాఖ ఓ వీడియోను విడుదల చేసింది. ప్రపంచంలోని మొట్టమొదటి పోర్టబుల్‌ హాస్పిటల్‌ ఇదే.

విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు సకాలంలో అత్యవసర సేవలు అందించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినట్లు రక్షణ శాఖ వివరించింది. భారత సైన్యం ఈ ప్రాజెక్టు విజయానికి ఎంతగానో కృషి చేసిందన్నారు. అత్యంత మారుమూల, పర్వత ప్రాంతాల్లో ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అత్యాధునిక పోర్టబుల్‌ ఆసుపత్రిని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలోనూ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

భీష్మా (భారత హెల్త్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ సహయోగ్‌ హితా అండ్‌ మైత్రి) అనే ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరోగ్య మైత్రీ హెల్త్‌ క్యూబ్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 72 క్యూబులు ఉంటాయి. దీన్ని ఉపయోగించి 200 మందికి ఆరోగ్య సేవలందించొచ్చు. భారత వైమానిక దళానికి సంబంధించిన అత్యాధునిక విమానం సీ-130జీని సాయంతో నిర్దేశించిన ప్రాంతానికి చేరవేస్తుంది. ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ తరహా పోర్టబుల్‌ హాస్పిటల్స్‌ ఉపయోగపడతాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z