* గంగూలీ (Sourav Ganguly).. హత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపాడు. ‘‘గతవారం నేను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మరికొందరు వక్రీకరించారు. ఏదేమైనా జరిగిన ఘటన దారుణమైనది. దీనిపై సీబీఐ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నేరస్థుడెవరో తెలిపోతుందని ఆశిస్తున్నా. అతడికి విధించే శిక్ష అత్యంత కఠినంగా ఉండాలి. అదెలా ఉండాలంటే.. భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడే సాహసం చేయకూడదు. శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి’’ అని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
* జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వేళ అత్యాచారాలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా వైరల్‌గా మారాయి. అమ్మాయిలు, అబ్బాయిలు యథేచ్ఛగా మాట్లాడుకోవడం వల్లే రేప్ కేసులు పెరుగుతున్నాయంటూ నాడు ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2012లో కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో ఓ యువతి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి గురైంది. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై నాడు దీదీ స్పందిస్తూ.. ‘‘ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం పెరుగుతోంది. గతంలో అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చేయి పట్టుకుని కన్పిస్తే వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించేవారు. తల్లిదండ్రులు వారిని మందలించి సరిదిద్దేవారు. కానీ ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ మార్కెట్ మాదిరిగా యువతకు అవకాశాలు ఉంటున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
* దేశ పౌరుల వలసలు నియంత్రించాలని చాలా దేశాలు ప్రయత్నిస్తాయి. కానీ, స్వీడన్ మాత్రం వేరే దేశాల్లో పుట్టి ప్రస్తుతం స్వీడన్‌లో నివాసం ఉంటున్న పౌరులకు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇతర దేశాల్లో జన్మించి అనంతరం స్వీడన్లో స్థిరపడిన పౌరులు దేశం వీడితే కొంత సొమ్మును బహుమతిగా ఇవ్వనుంది. అంతేకాకుండా వారి ప్రయాణ ఖర్చులు సైతం ప్రభుత్వమే భరిస్తుంది. ఆ దేశ ఇమిగ్రేషన్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనార్గర్డ్ ఈ మేరకు వెల్లడించారు. స్వీడన్‌లో నివసిస్తున్న వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడితే 10వేల స్వీడన్ క్రౌన్స్.. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలు ఇస్తారు. ఇక, చిన్నారులకు అందులో సగం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. వీటితో పాటు వారి ప్రయాణానికి కావలసిన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకాన్ని కేవలం వలసదారులకే వర్తింపజేసింది. ఇప్పటి నుంచి వేరే దేశాల్లో పుట్టిన స్వీడన్ పౌరులు(స్వీడన్ పాస్‌పోర్టు కలిగినవారు) దీన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇందుకు ఇచ్చే గ్రాంట్‌ని సైతం పెంచుతున్నట్లు పేర్కొనింది.
* భారత రెజ్లింగ్ సంఘంపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) భర్త సోమ్‌వీర్ రాథీ తీవ్ర ఆరోపణలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) ఫైనల్‌లో అనర్హత వేటుకు గురైన వినేశ్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ మద్దతుగా నిలవలేదని విమర్శించారు. వినేశ్ రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటుందా? అనే ప్రశ్నకు సోమ్‌వీర్ సమాధానం ఇవ్వలేదు. పారిస్ నుంచి వినేశ్ ఫొగాట్ స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అభిమానుల నుంచి వచ్చిన అపూర్వ ప్రేమకు సోమ్‌వీర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘దేశం మొత్తం వినేశ్‌పై అభిమానం కురిపిస్తోంది. ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. వినేశ్ సహచర రెజ్లర్లూ పెద్ద ఎత్తున అండగా నిలిచారు. మేం భారత్‌లోకి అడుగు పెట్టేవరకూ ఇలాంటి సంబరాలు అస్సలు ఊహించలేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. పతకం కాస్తలో చేజారింది. మేమంతా క్లిష్టసమయంలో ఉన్నాం. కాస్‌లో తీర్పు మనకు అనుకూలంగా రాలేదు. ఇలాంటప్పుడు ఫెడరేషన్ మాకు మద్దతుగా లేదు. అథ్లెట్లకు మద్దతుగా లేకపోతే నిర్భయంగా ఎలా ప్రదర్శన చేయగలరు?’’ అని సోమ్‌వీర్ వ్యాఖ్యానించారు.
* పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పోటీల నుంచి తిరిగొచ్చిన అథ్లెట్ల బృందం స్వాతంత్ర్య వేడుకల అనంతరం ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమన్, మోదీల మధ్య సరదా సంభాషణ జరిగింది. పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగొచ్చాక మీ ఇష్టమైన ఆహారం తీసుకున్నారా? అని మోదీ అమన్‌ను ప్రశ్నించారు. దానికి అమన్ ‘నేను ఇంకా ఇంటికి వెళ్లలేదు సార్’ అని సమాధనమిచ్చారు. మీకు ఇష్టమైనది చెప్తే ఇక్కడే ఏర్పాటు చేయించేవాళ్లం అని మోదీ అన్నారు. ఇంటికి వెళ్లాక చుర్మా (హరియాణా, రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందిన వంటకం) తింటానని అమన్ బదులిచ్చాడు. మోదీ నవ్వుతూ ‘ చుర్మా ఇంకా నాకు అందలేదు’ అనడంతో చుట్టూ నవ్వులు పూశాయి.
* తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతమైంది. సాంకేతిక నిపుణుల బృందం విరిగిపోయిన గేటు వద్ద మొత్తం 5 ఎలిమెంట్‌లను అమర్చారు. దీంతో 19వ గేటు నుంచి నీటి వృథాకు అడ్డుకట్ట పడింది. శనివారం సాయంత్రానికి స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు విజయవంతం కావడంతో అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది సంబురాలు చేసుకున్నారు. డ్యామ్ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో గేటు ఏర్పాటు పనులు జరిగాయి.
* ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఆయా నిధుల మంజూరుపై ప్రధానితో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నిధుల విడుదలపైనా చంద్రబాబు వాకబు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థికసాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది.
* సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయొద్దని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. బంగ్లాతో సిరీస్ తర్వాత టీమ్‌ఇండియా మరిన్ని టెస్టులు మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్(Mayank Yadav)ను ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షాని అడగ్గా.. మయాంక్ యాదవ్ జట్టులో ఉంటాడో లేదో గ్యారంటీ లేదని సమాధానమిచ్చాడు. ‘‘మయాంక్ యాదవ్ జట్టులో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి ఎలాంటి సమాధానం చెప్పలేను. కానీ, అతను మంచి ఫాస్ట్ బౌలర్. మేము మయాంక్‌ను పర్యవేక్షిస్తున్నాం. అతను ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్నాడు’’ అని జై షా వివరించారు.
* పోలవరం ప్రాజెక్టు విషయంలో వైకాపా విష ప్రచారం చేస్తోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. డ్రయాఫ్రం వాల్‌పై నివేదిక రాకముందే లేనిపోని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి దిల్లీ వెళ్లిన నిమ్మల.. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇకనైనా జగన్ వైఖరి మారకుంటే.. సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతారని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
* ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇమాన్వీ ఎస్మాయిల్ కథానాయిక. శనివారం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైన ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అంతేకాదు క్లాప్ బోర్డుపై మూడు ఆసక్తికర విషయాలను ఉంచారు. కోల్‌కతా హవ్‌డా బ్రిడ్జ్, సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ పతాకం, హైదరాబాద్ చార్మినార్‌ను అందులో చూపించారు. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. చిత్ర బృందం కూడా ఇదే విషయాన్ని తెలిపింది. 1940 దశకంలో జరిగే కథ అని కాన్సెప్ట్ పోస్టర్‌లో వివరించింది. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా మూవీ సాగుతుంది. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి హను రాఘవపూడి ఈ కథను సిద్ధం చేశారు.
* భారత వైమానిక, సైనిక దళాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన పోర్టబుల్ హాస్పిటల్‌ను విజయవంతంగా పారాడ్రాప్ చేశారు. ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌గా పేర్కొనే ఈ హాస్పిటల్‌ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైందని పేర్కొంటూ రక్షణ శాఖ ఓ వీడియోను విడుదల చేసింది. ప్రపంచంలోని మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఇదే. విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు సకాలంలో అత్యవసర సేవలు అందించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినట్లు రక్షణ శాఖ వివరించింది. భారత సైన్యం ఈ ప్రాజెక్టు విజయానికి ఎంతగానో కృషి చేసిందన్నారు. అత్యంత మారుమూల, పర్వత ప్రాంతాల్లో ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అత్యాధునిక పోర్టబుల్ ఆసుపత్రిని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలోనూ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
* వైఎస్సార్‌సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక, టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, మాజీ మంత్రి అంబటి శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. దివంగత మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని ప్రారంభించారు. ఎంతో కృషి చేసి అనుమతులు తీసుకువచ్చారు. వైఎస్సార్ మరణం తర్వాత కేంద్రామే పోలవరం ప్రాజెక్ట్‌ను తీసుకుంది. లేదు.. మేమే పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రాజెక్ట్‌ను తీసుకున్నారు. ఇక, వైఎస్సార్‌సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమైంది. దీనిపై చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారు. బాబు నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది. తిరిగి మాపైనే ఎల్లో మీడియాతో బుదరజల్లే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలోనే ప్రొటోకాల్ లేకుండా నిర్మాణాలు జరిగాయి. ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా చెప్పింది.
* తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీపై తీవ్ర చర్చ నడుస్తోంది. రుణమాఫీ చేసినట్టు హస్తం పార్టీ నేతలు చెబుతుండగా.. అర్హులకు మాఫీ కాలేదని, అసలు డబ్బులే ఇవ్వలేదని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్‌ఎస్ నేతలకు కూడా రుణాలు మాఫీ కావడం ఆసక్తికరంగా మారింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారిలో కొందరు బీఆర్‌ఎస్ నేతలు కూడా ఉన్నారు. వారిలో మాజీ మంత్రి జోగు రామన్న, గంప గోవర్ధన్, బొడిగే గాలేయ్య, బిగాల గణేష్, పాయల్ శంకర్, దుర్గం అశోక్, హర్ష్ పటేల్ గుప్తా వంటి నేతలు ఉన్నారు. వీరిలో లక్షల్లో రుణాలు మాఫీ జరిగినట్టు సమాచారం. వీరి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z