Fashion

నేడు రాఖీ పౌర్ణమి

నేడు రాఖీ పౌర్ణమి

అన్నా చెల్లెలి అనుబంధం… జన్మజన్మలా సంబంధం… జాబిలమ్మకిది జన్మదినం… కోటి తారకల కోలాహలం…’ అంటూ ఎన్నో పాటలు అన్నాచెల్లిలి అనుబంధం గురించి వివరిస్తున్నాయి. అన్నయ్య లేదా తమ్ముడు తనకు ఎలాంటి కష్టం వచ్చినా తోడుగా నిలుస్తాడని చెల్లిలి నమ్మకం. తన అన్నకు ఎలాంటి నష్టం రాకూడదని, సమస్యల చిక్కుముడి నుంచి విడుదల కలగాలని, జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చెల్లెలు రాఖీని కడుతుంది. తన సంతోషాన్ని కోరుకొని రాఖీ కట్టిన చెల్లిలికి అన్నయ్య ఏదో ఒక కానుకను బహుకరించి చెల్లెలి ముఖంలో సంతోషాన్ని చూస్తాడు… నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడమ్మ… నన్ను గుర్తు చేసుకో… నీకు ఒక ధైర్యంగా ఉంటాను అంటూ అన్నయ్య తన చెల్లెలికి ధైర్యం చెప్తాడు… సొంత తోబుట్టువులు లేకపోతే కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరినైనా అన్నా అని పిలిచి రాఖీ కడితే వారి మధ్య అన్నాచెల్లిలి బంధం ఏర్పడుతుంది. అది రాఖీకి ఉన్న గొప్పతనం…

మానవీయ సంబంధాలను పటిష్టం చేసేందుకు పరస్పర సోదర భావాన్ని, స్నేహా సౌరభాలను విరజిమ్ముతూ శాంతి సౌభ్రాతృత్వాలను పరిమళింపజేసే అపురూప వేడుక రక్షాబంధనం. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగను రాఖీ పౌర్ణమిగా కూడా పిలుస్తారు. తోబుట్టువుల మధ్య కల్మషం లేని బంధానికి గుర్తుగా, ఆత్మీయత అనురాగాల నడుమ అట్టహాసంగా జరుగుతోంది. సహోదర ప్రేమకు ప్రతిరూపంగా, ఆత్మీయ బంధాలకు సంకేతాత్మకంగా రక్షాబంధనం నిలుస్తోంది. నిద్రావస్థలో ఉన్న మానవీయ విలువలను తిరిగి సాక్షాత్కరింపజేస్తుంది. సభ్య సమాజానికి సంస్కారాన్ని అందిస్తుంది. మానవత్వపు విలువలు కనుమరుగవుతున్న తరుణంలో రాఖీ సాటి మనుషులను ఓదర మానులుగా చూడాలన్న ఆకాంక్షను బలపరుస్తుంది. సంప్రదాయాలు ఉట్టిపడేలా దేశ‌వ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకోనున్నారు.

దేవ దానవులకు ఉధృత స్థాయిలో యుద్దం జరుగుతోంది. త్రిలోకాధిపత్యమే లక్ష్యంగా సాగుతున్న రణరంగంలో రాక్షసుల ధాటికి దేవతలే తల్లడిల్లుతున్న సమయం. అమరావతికి అధిపతి దేవేంద్రుడు సైతం నిస్సహాయస్థితికి లోనై తరుణమది. అసహాయ స్థితిలో తన పరివారంతో సహా అమరావతిలో తలదాచుకున్న దేవేంద్రుడి నిశ్చేష్టతను గమనించిన ఆయన సతీమణి శచీదేవికి ఓ ఉపాయం తడుతుంది. రాక్షస రాజుతో తలపడేందుకు భర్తను సమాయత్తపర్చాలని తలుస్తుంది. లయకారుడైన పరమేశ్వ‌రుడిని, లక్ష్మీనారాయణున్ని ఆరాధిస్తుంది. అనంతరం భర్త దేవేంద్రుని చేతికి రక్షా కంకణం కడుతుంది. ఆ ఉత్తేజంతో రాక్షసులతో యుద్ధం చేసి త్రిలోకాధిపత్యం సాధిస్తాడు దేవేంద్రుడు. అలా శచీదేవితో ప్రారంభమైన రక్షాబంధనం కాలక్రమంలో పరిణామం చెందుతూ ప్రస్తుత దశకు చేరుకుంది. బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీమహావిష్ణువు అతనితో పాటే పాతాళ లోకవాసానికి అంగీకరిస్తాడు. భర్త సాహచర్యం కోసం శ్రీమహాలక్ష్మీ రక్షను రూపొందించి బలిచక్రవర్తి చేతికి కట్టి సోదర భావంతో అభ్యర్థించి భర్తను వైకుంఠానికి తీసుకెళ్తుంది. ఈ కారణంగా రక్షాబంధనానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే రక్షాబంధనం చేసే సమయంలో ‘యేనబద్దో బలీ రాజా దానవేంద్రో మహాబూబలః తేన త్వా మభీబడ్నామి రక్షే మ చలమా చల’ అనే శ్లోక పథనం చేస్తారు.

మరణమే లేకుండా వరం అనుగ్రహించేలా తపస్సు చేసిన ఓ రాక్షసుడిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. హయగ్రీవ ముఖాకృతి (గుర్రం రూపంలో ఉన్న తల) రూపంలో ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే మరణం సంభవించేలా ఆ రాక్షసుడిని అనుగ్రహిస్తుంది. వర గర్వంతో దేవతలను తీవ్ర ఇక్కట్లు పాలు చేస్తుంటాడు. చివరికి శివుడు ఉపాయంతో మహావిష్ణువు విల్లుకు బాణాన్ని సంధించి తీవ్ర అలసటతో వాలిపోయాడు. అతన్ని నిద్ర లేపేందుకు దేవతలెవరూ సాహసించలేదు. చివరికి ఓ కీటకాన్ని పంపి వింటి నారిని కొరికేలా ప్రోత్సహిస్తాడు. తద్వారా విష్ణువుకు మెలకువల వస్తుందని భావిస్తాడు. కీటకం తాడును కొరకగానే పొరపాటున వింటిని ఉన్న బాణం తగిలి విష్ణువు తల ఎగిరిపోతుంది. దేవీ అనుగ్రహంతో గుర్రం తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్తుంది. అలా పునర్జన్మించిన విష్ణుమూర్తి హయగ్రీవుడి రూపంలో ఆ రాక్షసుని సంహరిస్తాడు. శ్రావణపౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి నిర్వహిస్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z