Business

త్వరలో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు-BusinessNews-Aug 19 2024

త్వరలో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు-BusinessNews-Aug 19 2024

* విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వేజోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. భూ కేటాయింపు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముందన్నారు. అతిత్వరలోనే జోన్‌ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలకు సిద్ధమవుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూ విషయంలో అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో.. ఈ విషయంపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఇరు ప్రభుత్వాల అధికారుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని, ఇప్పుడు జోన్‌ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయన్నారు.

* భారత విమానయాన సంస్థల్లో 2024, జులైలో 1.29 కోట్ల మంది ప్రయాణీకులు ప్రయాణించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.30% ఎక్కువ అని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూన్‌లో దేశీయ విమానయాన సంస్థలు తీసుకెళ్లిన 1.32 కోట్ల మందితో పోలిస్తే జులైలో విమానాల్లో రద్దీ తక్కువగా ఉంది. ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ దేశీయ ఎయిర్‌ ట్రాఫిక్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించింది. జులైలో దాని మార్కెట్‌ వాటా 62 శాతానికి పెరిగింది. ఎయిర్‌ ఇండియా వాటా 14.30 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA) విడుదల చేసిన డేటా ప్రకారం, జులై నెలలో ‘విస్తారా’కు సంబంధించిన దేశీయ మార్కెట్‌ వాటా 10 శాతానికి చేరుకుంది. AIX కనెక్ట్‌, స్పైస్‌జెట్ల వాటా 4.50 శాతం, 3.10 శాతం వరకు మాత్రమే ఉంది. అలాగే, ఆకాసా ఎయిర్‌, అలయన్స్‌ ఎయిర్ల వాటా 4.70, 0.90 శాతం నమోదైంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు.. ఈ వారంలో వెలువడబోయే యూఎస్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశ వివరాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరకు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ (Sensex) 12 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ (Nifty) స్వల్పంగా 31 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 80,680.25 వద్ద ఉత్సాహంగానే ప్రారంభమైన సెన్సెక్స్‌ .. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఆద్యంతం ఊగిసలాడింది. ఒక దశలో 80,332 పాయింట్ల ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయిన సూచీ చివరకు 12.16 పాయింట్ల అత్యల్ప నష్టంతో 80,424.68 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 24,522.95 – 24,638.80 మధ్య కదలాడింది. మార్కెట్ ముగిసే సమయానికి 31.50 పాయింట్ల స్వల్ప లాభంతో 24,572.65 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు పెరిగి 83.87గా ముగిసింది.

* ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ షేర్లు (Ola Electric Share) సోమవారం అప్పర్‌సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో 9.99 శాతం పెరిగి రూ.146.38 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.64,565.73 కోట్లకు చేరింది. పలు బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌పై సానుకూల వైఖరి వ్యక్తం చేసిన నేపథ్యంలోనే స్టాక్‌ రాణిస్తోందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఐపీఓ ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు జరిగింది. ఒక్కో షేరుకు రూ.72-76 ధర నిర్ణయించారు. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సంస్థ రూ.6,100 కోట్లు సమీకరించింది. మదుపరులు రూ.14,972తో కనీసం 197 షేర్లకు బిడ్లు దాఖలు చేశారు.

* కృత్రిమ మేధ ఆధారంతో క్రియేట్‌ చేసిన ఆహార పదార్థాల చిత్రాలను తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించనున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ వెల్లడించారు. అలాంటి చిత్రాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ చాలామంది కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

* వయనాడ్‌ బాధితులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అత్యవసర సాయం కింద రూ.10 వేలు అందించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలుప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మొత్తాన్ని నేరుగా బాధితుల కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే, ఈ సొమ్ము నుంచే కేరళ గ్రామీణ బ్యాంకు ఈ నెల ఈఎంఐలను కట్‌ చేసుకుంది. దీనిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. వయనాడ్‌ వరదల బాధితుల రుణాలను రైటాఫ్‌ చేయాలని వివిధ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. దీని వల్ల బ్యాంకులపై పెద్ద భారమేమీ ఉండదని వ్యాఖ్యానించారు. వెంటనే రుణాలను రైటాఫ్‌ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. వడ్డీ మొత్తంలో మినహాయింపు, వాయిదాల చెల్లింపునకు గడువు పొడిగించడం వంటి చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీసుకున్న రుణాలను రైటాఫ్‌ చేయడమొక్కటే పరిష్కారమని తెలిపారు. ఈ సమయంలో బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి లోన్‌ ఈఎంఐలు తీసుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z