* తొలి పొట్టి కప్ విజేతగా టీమ్‌ఇండియా నిలవడంలో రాబిన్ ఉతప్ప కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో మానసికంగా ఇబ్బంది పడినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. జీవితంలో ప్రతి ఒక్కరూ కుంగుబాటుకు గురవుతుంటారని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) తెలిపాడు. ఇలా డిప్రెషన్‌కు గురై ప్రాణాలను వదిలేవారిని చూస్తుంటే బాధేస్తుందని తెలిపాడు. ఇటీవల ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రాహమ్ థోర్ప్ ఇలానే చనిపోయిన సంగతి తెలిసిందే. గతంలో భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్ర శేఖర్, మరో మాజీ డేవిడ్ జాన్సన్ కూడా ఇలా ప్రాణాలు విడిచినవారే. మానసికంగా కుంగుబాటు ఎదురైనప్పుడు ఆ జీవిత ప్రయాణం దారుణంగా ఉంటుందని పేర్కొన్నాడు. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితి అనుభవించినట్లు గుర్తు చేసుకున్నాడు. భారత జట్టులోకి ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో.. బయటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని ఉతప్ప వెల్లడించాడు.
* తాను కొత్త ప్రయాణం మొదలు పెట్టినట్టు ప్రముఖ నటి సమంత (Samantha) తెలిపారు. వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ (world pickleball league)లో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. చెన్నై టీమ్‌కు యజమానిగా ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘న్యూ బిగినింగ్’ హ్యాష్‌ట్యాగ్ జోడించారు.
* నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం పంజాగుట్ట, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. నిన్నటి వర్షానికే ఇంకా నగర వాసులు కోలుకోలేదు. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు.
* రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు రోజుకో తీరున మాట్లాడుతున్నారని భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.31వేల కోట్ల రుణమాఫీ జరిగిందని చెప్పారు, సీఎం సమక్షంలోనే భట్టి అసత్యాలు చెప్పారని విమర్శించారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా ఆందోళన చేస్తున్నారని చెప్పారు. సీఎం, మంత్రులు ఇష్టానుసారం మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ జరిగితే రైతులు ఎందుకు ఆందోళన చేస్తారని ప్రశ్నించారు. రుణమాఫీపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.
* లేటరల్ ఎంట్రీ (Lateral Entry) విధానంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వంలో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన ప్రకటనను రద్దు చేయాలంటూ యూపీఎస్సీ (UPSC)కి కేంద్రం లేఖ రాయడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ల వ్యవస్థను కాంగ్రెస్ పరిరక్షిస్తుందని పేర్కొన్నారు.
* ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయం వద్ద ఫ్లెక్సీ వివాదం అనంతరం మరోసారి సిద్దిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు సర్ది చెప్పడంతో మరో మార్గం ద్వారా కాంగ్రెస్ నేతలు పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
* ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.
* వృద్ధాప్యం కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొని 2024 ఎన్నికల రేసు నుంచి వైదొలగిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షికాగో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో సుదీర్ఘ రాజకీయ కెరీర్‌పై ఆయన మాట్లాడుతూ‘‘నేను సెనెట్‌కు వెళ్లేనాటికి మరీ కుర్రాడిని. కనీసం 30 ఏళ్లు కూడా రాలేదు.
* కరోనా(Corona) సృష్టించిన కలవరాన్ని మర్చిపోతున్న తరుణంలో తాజాగా ఎంపాక్స్(Mpox) కలకలం రేపుతోంది. ఆఫ్రికా దాటి పలు దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ ఆందోళన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెప్పిన మాట కాస్త ఊరటనిస్తోంది. ఎంపాక్స్(Mpox) కొవిడ్ కాదని, దాని వ్యాప్తిని నియంత్రించొచ్చని తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓలో యూరప్ రీజినల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న హాన్స్ క్లుగే మీడియాతో మాట్లాడుతూ.. ఎంపాక్స్ (Mpox) వ్యాప్తిని నియంత్రించేందుకు, నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని వ్యాఖ్యానించారు. ‘‘దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలి. మనం ఈ వైరస్‌ను నియంత్రిస్తామా..మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా..అనేది మన స్పందనపై ఆధారపడి ఉంటుంది. రానున్న ఏళ్లలో ఐరోపా, ప్రపంచానికి ఇది మరో పరీక్షే’’ అని హెచ్చరించారు.
* వృద్ధాప్యం కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొని 2024 ఎన్నికల రేసు నుంచి వైదొలగిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షికాగో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో సుదీర్ఘ రాజకీయ కెరీర్‌పై ఆయన మాట్లాడుతూ‘‘నేను సెనెట్‌కు వెళ్లేనాటికి మరీ కుర్రాడిని. కనీసం 30 ఏళ్లు కూడా రాలేదు. ఇప్పుడు అధ్యక్షుడిగా కొనసాగడానికి మరీ ముసలివాడినైపోయాను’’ అని వ్యాఖ్యానించారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని డిమాండ్ చేసిన డెమోక్రాట్లపై తాను ఆగ్రహంగా ఉన్నట్లు జరిగిన ప్రచారాన్ని బైడెన్ తిరస్కరించారు. ప్రజాస్వామ్యం నిలబడాలని ఆయన ఆకాంక్షించారు.
* కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. రాజీవ్‌గాందీ విగ్రహం కూలగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ లాంటి గొప్పనాయకుడి గురించి భారాస నేతలు చులకనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భారాస పదేళ్లపాటు నరకం చూపించింది కాబట్టే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు. మేము సోనియగాంధీ, రాహుల్ గాంధీకి గులాంగిరి చేస్తాం నిజమే.. తప్పేంటి? ఐదేళ్లలో రాజీవ్ విగ్రహం తీసే ధైర్యం మీకు లేదు. మీరు విగ్రహం కూలగొట్టాలంటే అధికారంలోకి రావాలి. కానీ, మరో ఐదేళ్లు మేమే అధికారంలో ఉంటాం’’ అని జగ్గారెడ్డి అన్నారు.
* గతంలో వైఎస్ ప్రభుత్వం చేపట్టిన పనుల వల్లే హైదరాబాద్ అభివృద్ధికి బీజం పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. క్రెడాయ్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వల్లే అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కోసం కందుకూరు వైపు అభివృద్ధిపై దృష్టి పెట్టాం. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించాం. స్థిరాస్తి వ్యాపారుల సమస్యల్ని మంత్రిమండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. భారాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఒక్కో సమస్యను తీరుస్తూ వస్తున్నాం. సోనియా ఇచ్చిన తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
* బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) వినూత్న ఉద్యోగావశాన్ని ప్రకటించింది. రోజుకు ఏడు గంటలు నడవగలిగే సామర్థ్యంతో పాటు టెక్నాలజీ వాడకంపై అవగాహన ఉండాలి. అలాంటి వారికి గంటకు 48 డాలర్ల (దాదాపు రూ.4,000) వరకు ఇవ్వడానికి సిద్ధమైంది. అలా రోజుకు ఏడు గంటల చొప్పున రూ.28 వేల వరకు సంపాదించుకోవచ్చు.
* మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను కూల్చివేశారు. 220 విల్లాలకు అనుమతి పొంది.. అదనంగా 7 విల్లాలను సొసైటీ నిర్మించినట్లు గుర్తించారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను అధికారులు చేపట్టారు. సొసైటీ సభ్యులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z