Business

ఒక డాలరుకు ₹84.80-BusinessNews-Aug 20 2024

ఒక డాలరుకు ₹84.80-BusinessNews-Aug 20 2024

* బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) వినూత్న ఉద్యోగావశాన్ని ప్రకటించింది. రోజుకు ఏడు గంటలు నడవగలిగే సామర్థ్యంతో పాటు టెక్నాలజీ వాడకంపై అవగాహన ఉండాలి. అలాంటి వారికి గంటకు 48 డాలర్ల (దాదాపు రూ.4,000) వరకు ఇవ్వడానికి సిద్ధమైంది. అలా రోజుకు ఏడు గంటల చొప్పున రూ.28 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఆప్టిమస్‌ పేరిట టెస్లా రోబోను (Tesla Optimus) తయారు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి శిక్షణనివ్వడం కోసం వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని నియమించుకుంటోంది. తాజాగా అత్యాధునిక మోషన్‌-క్యాప్చర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆప్టిమస్‌కు శిక్షణనిచ్చేందుకు ఉద్యోగులు కావాలని ప్రకటించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ త్వరలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు.. ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు రాణించడానికి కారణమయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 80,722.54 (క్రితం ముగింపు 80,424.68) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 80,942.96 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 378.18 పాయింట్ల లాభంతో 80,802.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 126.20 పాయింట్ల లాభంతో 24,698.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి 84.80గా ఉంది.

* రిలయన్స్‌ జియో మరో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.198తో వస్తోన్న ఈ ప్లాన్‌లో వాయిస్‌ కాలింగ్‌, ఎస్సెమ్మెస్‌, డేటా సహా జియో యాప్‌లు లభించనున్నాయి. తక్కువ ధరలో జియో ప్లాన్‌ (Jio Prepaid Plan) కోసం చూసేవాళ్లకు ఇది సరైన ఎంపిక. ఈ టెలికాం సంస్థ రూ.189, రూ.199తోనూ మరో రెండు చౌక ప్లాన్లను అందిస్తోంది. యాక్టివ్‌ సర్వీస్‌ వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్‌లోని పూర్తి ప్రయోజనాలు చూద్దాం. జియో తీసుకొచ్చిన రూ.198 కొత్త ప్లాన్‌ 14 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2జీబీ డేటా లభిస్తుంది. ఎంపిక చేసిన కస్టమర్లకు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తోంది. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ యాప్‌లూ లభిస్తాయి. అదే రూ.199 ప్లాన్‌ 18 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. దీంట్లో రోజుకు రూ.1.5జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ వంటి ప్రయోజనాలూ ఉంటాయి. జియో యాప్‌లూ లభిస్తాయి.

* విమాన చార్జీలు పెరుగుతున్నాయి. రాబోయే పండుగ సీజన్‌ దృష్ట్యా ఇప్పటికే ఏకంగా 25 శాతం వరకు టికెట్‌ ధరలను వివిధ విమానయాన సంస్థలు పెంచేశాయి. ఒక్కసారిగా పెరిగిన ముందస్తు బుకింగ్‌లే కారణం. ఈ క్రమంలోనే వన్‌-వే టికెట్‌ సగటు ధర దీపావళికి ఆయా ప్రధాన మార్గాల్లో 10 నుంచి 15 శాతం వరకు పెరిగింది. ఇక ఓనమ్‌ పండుగకైతే కేరళ వెళ్లేవారు 20 నుంచి 25 శాతందాకా అధిక చార్జీలను చెల్లించాల్సిన పరిస్థితి వస్తున్నది. ట్రావెల్‌ పోర్టల్‌ ఇక్సిగో వివరాల ప్రకారం ఢిల్లీ-చెన్నై నాన్‌స్టాప్‌ విమానం ఎకానమీ క్లాస్‌ టిక్కెట్‌ సగటు ధర అక్టోబర్‌ 30-నవంబర్‌ 5 మధ్య 25 శాతం ఎగిసి రూ.7,618గా ఉంటున్నది. గత ఏడాది నవంబర్‌ 10-16 నడుమ రూ.5,713గానే ఉండటం గమనార్హం. అలాగే ముంబై-హైదరాబాద్‌ రూట్‌లో టికెట్‌ ధర 21 శాతం ఎగబాకి రూ.5,162 పలుకుతున్నది. ఢిల్లీ-గోవా, ఢిల్లీ-అహ్మదాబాద్‌ మార్గాల్లో ధరలు రూ.5,999, రూ.4,930గా ఉంటున్నాయి. నిరుడుతో చూస్తే 19 శాతం ఎక్కువ. ఇతర మార్గాల్లోనూ టికెట్‌ రేట్లు 1 నుంచి 16 శాతం మేర పెరిగిపోయాయని చెప్తున్నారు. గత ఏడాది ఆగస్టు 20-29 మధ్య ఓనమ్‌ పండుగ జరిగినప్పటితో చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌ 6-15 మధ్య ఓనమ్‌ సమయంలో హైదరాబాద్‌-తిరువనంతపురం విమాన టికెట్‌ ధర 30 శాతం ఎగిసి రూ.4,102కి చేరింది. ముంబై-కాలీకట్‌ ఫ్లైట్‌ చార్జీ కూడా ఇంతే స్థాయిలో పెరిగి రూ.4,448గా నమోదైంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z