బీసీసీఐ కార్యదర్శిగా వరుసగా రెండో పర్యాయం కీలక పాత్ర పోషిస్తున్న జై షాను త్వరలో ఐసీసీ ఛైర్మన్‌గా చూడబోతున్నామా? ఔననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. రెండోసారి ఛైర్మన్‌గా కొనసాగుతున్న గ్రెగ్ బార్క్‌లే పదవీ కాలం నవంబరు 30తో ముగియనుండగా.. ఆయన మూడో పర్యాయం బరిలో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. ఖాళీ అవుతున్న స్థానానికి ప్రస్తుతం జై షా పేరే గట్టిగా వినిపిస్తోంది. షాను ఛైర్మన్‌గా చేయడానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద బోర్డులు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ ఎన్నికలో 16 ఓట్లు ఉంటాయి. అందులో 9 పడ్డ వ్యక్తి ఛైర్మన్ అవుతాడు. అవి సాధించడం జై షాకు పెద్ద కష్టమేమీ కాదని సమాచారం. బీసీసీఐ కార్యదర్శిగా షాకు ఇంకో ఏడాది పదవీ కాలం ఉంది. ఆ తర్వాత మూడేళ్లు భారత బోర్డులో మరే పదవీ తీసుకోకుండా విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఐసీసీ ఛైర్మన్ కావడానికి ఈ నిబంధన అడ్డు కాదు. ఏడాది తర్వాత ఎలాగూ మూడేళ్లు బీసీసీఐకి దూరంగా ఉండాలి కాబట్టి ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టడం మంచి ఆలోచనే అని షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 లోపు ఛైర్మన్ పదవికి నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అతను నామినేషన్ వేశాడంటే ఛైర్మన్ కావడం లాంఛనమే! చివరగా భారత్ నుంచి శశాంక్ మనోహర్ 2015-20 మధ్య ఈ పదవిలో ఉన్నాడు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z