Politics

తాడేపల్లి వైకాపాకు ఆఫీసుకు పోలీసు నోటీసులు-NewsRoundup-Aug 21 2024

తాడేపల్లి వైకాపాకు ఆఫీసుకు పోలీసు నోటీసులు-NewsRoundup-Aug 21 2024

* జన్వాడ ఫాంహౌస్‌ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధుల గురించి చెప్పాలని ఏఏజీకి ఉన్నత న్యాయస్థానం సూచించింది. 15-20 ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణమంటూ కూల్చివేయడమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది.

* తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్‌ సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. ఘటన జరిగిన రోజు వైకాపా కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. 2021 అక్టోబర్‌ 19 నాటి సీసీ ఫుటేజ్‌ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

* గత ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. హోంశాఖపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. సమావేశం వివరాలను వెల్లడించారు. చాలా చోట్ల సీసీ కెమెరాలు లేక నేరాలు జరుగుతున్నాయన్నారు.

* అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్‌ పేలి ఒకరు మృతి చెందగా, 18 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

* కడప నగరంలోని అగాడివీధిలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. వీధిలో విద్యుత్‌ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యహ్నం తన్వీర్‌ (11) ఆదాం(10) సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. తెగిపడిన విద్యుత్‌ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు.

* ఓటుకు నోటు కేసులో వైకాపా నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని పిటిషనర్‌ను హెచ్చరించింది.

* ఐపీఎల్‌(IPL)లో యశ్‌ దయాళ్‌(Yash Dayal).. ఈ పేరు వినగానే అతడి బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో రింకు సింగ్‌ కొట్టిన ఐదు సిక్స్‌లే గుర్తుకు వస్తాయి. 2023వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడిన ఈ బౌలర్‌ ఆ ఘటన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత సీజన్‌లో బెంగళూరు జట్టు (Royal Challengers Bengaluru )కు మారి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ సమయంలో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)ఎంతగానో సహకరించాడని తెలిపాడు. అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు.

* తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. జాబితాపై సెప్టెంబర్‌ 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురిస్తారు. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై ఈనెల 29న కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

* మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దీనిపై సినీరంగంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా (Tanushree Dutta) దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపులకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం నివేదికల మీద నివేదికలు విడుదల చేసినంత మాత్రాన ప్రయోజనం ఏముందని ఆమె ప్రశ్నించారు.

* చిరంజీవితో నటించడం ఎప్పటికీ మర్చిపోలేనని నటి సోనాలి బింద్రే తెలిపారు. చిరంజీవి, సోనాలి బింద్రే నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇంద్ర’. ఈ సినిమా చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రీరిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో సోనాలి (Sonali Bendre) ‘ఇంద్ర’ షూటింగ్‌ రోజులను గుర్తుచేసుకున్నారు. ‘‘వైజయంతీ బ్యానర్‌లో వర్క్‌ చేయడం గొప్ప అనుభూతి. అశ్వినీదత్‌ చాలా మంచి వ్యక్తి. చిరంజీవితో నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. ‘ఇంద్ర’లో అన్నిటికంటే కష్టమైన పని ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేయడమే. ‘దాయి దాయి దామ్మా..’ పాట చిత్రీకరణ ఉందని చెప్పగానే భయంతో రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆ పాటలో చిరంజీవి అద్భుతంగా చేశారు. నన్ను కూడా వీణ స్టెప్‌ వేయమంటారేమో అని భయపడ్డాను’’ అని సోనాలి తెలిపారు.

* భారత వైమానిక దళానికి (IAF) చెందిన యుద్ధవిమానం గగనతలంలో ఉండగా అనుకోని పరిస్థితి ఎదురైంది. అందులో నుంచి సామగ్రి (air store) జారిపడిందని ఐఏఎఫ్ వెల్లడించింది. సాంకేతిక లోపమే ఇందుకు కారణమని తెలిపింది. బుధవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సామగ్రి జారిపడిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొంది. దీనిపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది. అయితే పడిపోయిన ఆ సామగ్రి ఏంటో మాత్రం వెల్లడించలేదు. ఎయిర్‌ స్టోర్ పడినప్పుడు పెద్ద శబ్దం వినిపించడంతో.. ఏం జరిగిందో తెలుసుకునేందుకు దగ్గర్లోని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఒక వస్తువు ముక్కలు కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z