* అమెరికా (USA)లో ఓ భారతీయ వైద్యుడు (Indian doctor) వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గత కొన్నేళ్లుగా చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌కు చెందిన ఒయిమెయిర్ ఎజాజ్ 2011లో వర్క్ వీసాపై అమెరికా వెళ్లాడు. తొలుత కొన్నేళ్ల పాటు అలబామాలో నివాసమున్న అతడు 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా అతడు లైంగిక దారుణాలకు పాల్పడ్డాడు. తాను పనిచేసే చోట ఆసుపత్రి గదులు, బాత్రూమ్‌లు, చేజింగ్ ఏరియా వంటి ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు పెట్టి అనేక మంది మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలను రికార్డ్ చేశాడు. మహిళలు స్పృహలో లేనప్పుడు వారిపై అభ్యంతరకంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను రికార్డ్ చేసేవాడు. ఆసుపత్రుల్లో పేషెంట్లను కూడా లైంగిక వేధించేవాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అతడి భార్యకు ఈ విషయం తెలియడంతో ఆ వీడియోలను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగస్టు 8న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం అతడి ఇంటిని సోదా చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతడి నివాసంలో ఓ కంప్యూటర్, ఫోన్లు, 15 ఎక్స్‌టర్నల్ స్టోరేజీ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందులో వేలాదిగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఒక సింగిల్ హార్డ్ డ్రైవ్‌లో 13వేల వీడియోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్లౌడ్ స్టోరేజ్‌లోనూ ఈ దృశ్యాలను అప్‌లోడ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతడిపై నేరాభియోగాలు మోపి జైలుకు పంపించారు. అతడి బాధితుల సంఖ్య చాలా ఎక్కువ ఉందని, దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసేందుకు కొన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.
* కడప నగరంలోని అగాడివీధిలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. వీధిలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యహ్నం తన్వీర్ (11) ఆదాం(10) సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు స్పందించి చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
* సంతానం లేని ఓ దంపతులు పిల్లలను కనడానికి చేసిన అభ్యర్థనకు కేరళ హైకోర్టు( Kerala HighCourt) కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్త నుంచి వీర్యం సేకరించి, భద్రపరచడానికి అనుమతినిచ్చింది. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్త వీర్యాన్ని(sperm) భద్రపరచడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. కొద్ది కాలంగా తన భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తమకు ఇప్పటి వరకు సంతానం లేదని ఆమె పేర్కొంది. కాబట్టి భవిష్యత్తులో తాను సంతానాన్ని కనడానికి ఉపయోగపడేలా భర్త వీర్యాన్ని భద్రపరచడానికి(cryopreserving) అనుమతించాలని కోర్టును కోరింది. భర్త పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అతడి రాతపూర్వక సమ్మతిని తీసుకురాలేకపోయానని పేర్కొంది. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారి అతడు మరణించే ప్రమాదముందని.. వెంటనే తమకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. కాగా ఆ అభ్యర్థనను స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ వీజీ అరుణ్ ఆ దంపతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించారు. భర్త నుంచి వీర్యం సేకరించి, భద్రపరచడానికి కోర్టు అనుమతిచ్చింది. దానికి మినహా మరే ఇతర ప్రక్రియలు చేపట్టవద్దని ఆంక్షలు విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీన చేపట్టనుంది.
* అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా, 18 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఘటన జరగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
* దేశంలో వరుస అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. వీటి నియంత్రణ కోసం కేంద్రం కఠినచట్టాలు చేస్తున్నప్పటికీ కొందరు మృగాళ్లలో ఎటువంటి మార్పు రావట్లేదు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని నర్సరీ చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడడంతో తల్లిదండ్రులు, స్థానికులు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో రాఖీ పండగ రోజు కొందరు కీచకులు గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల గిరిజన మహిళ సోమవారం రాఖీ పండగను పురస్కరించుకొని తమ ఊరిలో జరుగుతున్న వేడుకకు హాజరవడానికి వెళ్లింది. మార్గమధ్యలో ఆరుగురు దుండగులు ఆమెను అడ్డగించి, సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారినుంచి తప్పించుకున్న మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందన్నారు.
* నిజామాబాద్‌లో ఏఎస్‌ఐ గుండెపోటుతో మృతిచెందారు. ఒకటో పట్టణ ఠాణాలో ఏఎస్‌గా పనిచేస్తున్న దత్తాద్రి (56) బుధవారం ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దత్తాద్రి గత రెండేళ్లుగా నిజామాబాద్ ఒకటో పట్టణ ఠాణాలో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్‌కు చెందిన ఆయన.. గత 20 ఏళ్లుగా నిజామాబాద్‌లోని గాయత్రి నగర్‌లో నివాసముంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z