* దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ సంస్కృతిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా సంస్థలు పుట్టుకొస్తుండడాన్ని గొప్ప విజయంగా భావించకూడదని, ఇది ‘ఆందోళన చెందాల్సిన విషయం’ అని పేర్కొన్నారు. ‘ఉద్యోగ కల్పన, వినియోగదారుల సంక్షేమంపై ఇ-కామర్స్ ప్రభావం’ అనే నివేదిక విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇ-కామర్స్ సంస్థల వృద్ధి వల్ల సామాజిక అంతరానికి కారణమవుతున్నాయని పీయూష్ గోయల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇ-కామర్స్ నెట్‌వర్క్ వల్ల రాబోయే పదేళ్లలో సగం మార్కెట్ అవే ఆక్రమించడాన్ని విజయంగా భావించకూడదని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఇ-కామర్స్ సంస్థలు.. పోటీ నివారించేందుకు అనుసరిస్తున్న ధరల విధానం వల్ల సంప్రదాయ రిటైల్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ తరహా ధరల విధానం దేశానికి మంచిదా? అంటూ ప్రశ్నించారు.
* మనం ఉద్యోగాల కోసం నిత్యం పొరుగు ఊళ్లకు వెళ్లేవారిని చూస్తుంటాం.. ఏ వంద కిలోమీటర్లో అయితే రోజువారీ రాకపోకలు చేస్తారు. అంతకుమించితే చాలామంది ఆయా ఊళ్లలోనే ఉండేందుకు ఇష్టపడతారు. కానీ, అమెరికా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ (Starbucks) నూతన సీఈవో బ్రియాన్ నికోల్ మాత్రం తన ఇంటి నుంచి 1,600 కిలోమీటర్ల దూరంలోని కార్పొరేట్ ఆఫీస్‌కు రాకపోకలు సాగించాలని నిర్ణయించుకొన్నారు. ఇందుకోసం కార్పొరేట్ జెట్ కూడా సిద్ధమైనట్లు అధికారిక లేఖ తెలియజేస్తోంది. ప్రస్తుతం నికోల్ కాలిఫోర్నియాలోని ఇంట్లో ఉంటున్నారు. ఇక స్టార్‌బక్స్ ప్రధాన కార్యాలయం సియాటెల్‌లో ఉంది. దీంతో అతడికి ప్రత్యేక విమానం సిద్ధమైంది. కంపెనీ హైబ్రీడ్ వర్క్ పాలసీ ప్రకారం వారంలో కనీసం మూడు రోజులు సియాటెల్ నుంచి ఆయన పని చేయనున్నారు.
* ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా వరుసగా రెండోసారీ ఎంపికైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్‌ను (Shaktikanta Das) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఇది ఆయనలోని నాయకత్వానికి లభించిన గుర్తింపుగా కొనియాడారు. ‘‘ఈ ఘనత సాధించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అభినందనలు. అది కూడా రెండోసారి. ఆర్‌బీఐలో ఆయన నాయకత్వానికి; ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని నిర్ధరించే దిశగా ఆయన చేసిన కృషికి ఇది గుర్తింపు’’ అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
* ప్రముఖ ఫ్రెంచ్ స్పోర్ట్స్ రిటైలర్ డీకాథ్లాన్, రాబోయే అయిదేళ్లలో భారత్‌లో 100 మిలియన్ యూరో(రూ.933 కోట్లు)ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ రోజు(బుధవారం) ప్రకటించింది. భారత్ అంతటా 190 ప్రాంతాల్లో తన స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ఈ పెట్టుబడి ఉండనుందని డీకాథ్లాన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందుతున్న క్రీడా సంస్కృతితో డైనమిక్ మార్కెట్‌గా ఉంది. భారత్‌లో క్రీడలకు సంబంధించిన బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. అందుచేత, ఈ స్పోర్ట్స్ బ్రాండ్ రిటైలర్ వచ్చే 3-5 ఏళ్లలో భారత్‌లో తన వ్యాపారాన్ని రెట్టింపు చేయాలనే యోచనలో ఉందని డీకాథ్లాన్ ఇండియా CEO తెలిపారు.
* అంగారకుడిపై మానవ కాలనీ ఏర్పాటు చేయకముందే తాను చనిపోతానని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గతంలో ఓ సదస్సులో వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఫాల్కన్-9 వంటి హెవీ రాకెట్లను అభివృద్ధి చేసినా.. అంగారకుడిపైకి మానవ నివాసాల ఏర్పాటులో ఉన్న అడ్డంకులను మస్క్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయాలను బ్రాడ్ బెర్గాన్ విడుదల చేసిన ‘స్పేస్ ఎక్స్: ఎలాన్ మస్క్ అండ్ ద ఫైనల్ ఫ్రంటియర్’ పుస్తకంలో వివరించాడు.
* కియా, టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నాయి. ఆయా కంపెనీల కార్లలో లోపాల కారణంగా కంపెనీలు వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణకొరియా రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. కార్లను రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతోపాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి. నాలుగు కంపెనీలకు సంబంధించిన ఏడు మోడల్స్‌లో 1,03,543 కార్లలో లోపాలు ఉన్నట్లు ఆయా కంపెనీలు గుర్తించాయి. టెస్లా కంపెనీ కార్లలోని మోడల్ Y లో సాఫ్ట్‌వేర్ లోపం ఉందని నిర్ధారణ అయ్యింది. కియా ప్రైడ్ కాంపాక్ట్ కారులోని హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్‌లో డ్యూరెబిలిటీ లేకపోవడంతో వెనక్కి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఫోర్డ్ కంపెనీకి చెందిన Lincoln MKX SUV కారులో బ్రేక్ బూస్టర్‌లో లోపం ఉంది. జీఎం ఏసియా పసిఫిక్ కంపెనీకి చెందిన Cadillac Lyriq all-electric sedan కారులో ఎలక్ట్రిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్‌లో సమస్య ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z