* దేశీయంగా ఎంతో ఆదరణను సంపాదించుకున్న పసిడి బాండ్లు (Sovereign gold bonds) ఇకపై జారీ కావని తెలుస్తోంది. బంగారంలో మదుపు చేయాలనుకునే వారి కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈ బాండ్ల విక్రయాలు నిలిపివేసేందుకు ప్రభుత్వ వర్గాలు సుముఖంగా ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌బీసీ కథనం ప్రచురించింది. ప్రభుత్వ ఖజానాకు భారం అవుతుండటంతో ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బంగారం దిగుమతుల్ని అరికట్టేందుకు 2015లో కేంద్రం డిజిటల్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టించాలనే లక్ష్యంతో పసిడి బాండ్లను తీసుకొచ్చింది. అయితే తాజాగా 2024-25 బడ్జెట్‌లో పసిడి, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అప్పటినుంచి పసిడి బాండ్ల జారీకి అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అనుమానాలు మొదలయ్యాయి. ధర పెరుగుతున్నప్పుడు ప్రభుత్వ పసిడి బాండ్లపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఆసక్తి చూపుతారు కానీ, తగ్గినప్పుడు వీటిపై ఆసక్తి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో పసిడి బాండ్లు జారీ కాబోవనే వాదనలు వినిపిస్తున్నాయి.
* బీసీ జిందాల్ గ్రూప్ ఈ రోజు(గురువారం) భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో తన ప్రవేశాన్ని ప్రకటించింది. వచ్చే ఐయిదేళ్లలో 2.50 బిలియన్ డాలర్ల(రూ.20,750 కోట్ల) పెట్టుబడి పెట్టే యోచనలో ఉంది. ఒడిశాలోని అంగుల్‌లో ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోతో, బీసీ జిందాల్ గ్రూప్‌కు సంబంధించిన పునరుత్పాదక వెంచర్‌ను నిర్వహించడానికి అంకితమైన సంస్థను ప్రారంభించిదని ఒక ప్రకటనలో తెలిపింది. రూ.18 వేల కోట్ల టర్నోవర్‌తో భారత్‌లోని ప్రముఖ బహుళ ఉత్పత్తుల సంస్థ అయిన బీసీ జిందాల్ గ్రూప్..పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, సోలార్ సెల్స్, మాడ్యుల్స్ తయారీ మొదలగు వ్యాపారాలను నిర్వహిస్తోంది. జిందాల్ ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ(JIRE) సోలార్, విండ్, హైబ్రిడ్, ఎఫ్‌డీఆర్‌ఈ మోడ్స్ నుంచి 5 గిగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు, సోలార్ డిమాండ్‌ను ఉపయోగించుకోవడానికి JIRE..పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను కూడా తయారు చేస్తుంది. JIRE బీసీ జిందాల్ గ్రూప్ కింద పనిచేస్తుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి లాభాల్లో ముగిశాయి. వచ్చే నెల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే సూచనలు ఉండడంతో ఇతర మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ లాభపడ్డాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ రాణించడంతో వరుసగా ఆరో రోజూ సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. నిఫ్టీ 24,800 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 81,207.24 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,905.30) లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. చివరికి 147.89 పాయింట్ల లాభంతో 81,053.19 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41.30 పాయింట్ల లాభంతో 24,811.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.94గా ఉంది. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టీసీఎస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.43 డాలర్లు, బంగారం ఔన్సు 2,542 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
* దేశీయ కార్ల విక్రయాల్లో టాటా పంచ్ (Tata punch) సత్తా చాటింది. గత కొంతకాలంగా అత్యధికంగా అమ్ముడుపోయే కారుగా ఉన్న మారుతీ సుజుకీ వేగనార్‌ను (Maruti suzuki WagonR) దాటేసింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో తొలి ఏడు నెలల్లో ఎక్కువ విక్రయాలు నమోదుచేసిన మోడల్‌గా నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు నమోదైన అమ్మకాల ఆధారంగా ఆటోమార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ డేటా వెలువరించింది. గత ఏడు నెలల్లో టాటా పంచ్ 1.26 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. వేగనార్ 1.16 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ క్రెటా 1.09 లక్షలు, మారుతీ సుజుకీ బ్రెజ్జా 1.05 లక్షలు, మారుతీకే చెందిన ఎర్టిగా 1.04 లక్షల యూనిట్లు చొప్పున విక్రయాలు నమోదయ్యాయి. అయితే, జులై నెల విక్రయాల్లో మాత్రం టాటా పంచ్ నాలుగో స్థానానికి పడిపోవడం గమనార్హం. హ్యుందాయ్‌కి చెందిన క్రెటా అగ్రస్థానంలో నిలిచింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z