పిల్లలే కాదు, చాలామంది పెద్దవాళ్లూ పగటిపూట కునుకు తీస్తుంటారు. పిల్లలు ఆయా విషయాలను నేర్చుకోవటం, మెదడు ఎదుగుదలలో కునుకు కీలకపాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా కునుకు తీసే పిల్లలు తాము నేర్చుకున్న విషయాలను బాగా గుర్తుపెట్టుకుంటారు. అవసరమైనప్పుడు సమర్థంగా గుర్తుతెచ్చుకుంటారు. స్వల్ప కాల జ్ఞాపకాలు పిల్లల్లో అంత ఎక్కువగా నిల్వ ఉండవు. అందువల్ల మెదడు పునరుత్తేజం పొందటానికి వీరికి తరచూ నిద్ర అవసరం. అయితే కునుకు పిల్లలకే పరిమితం కాదు. పెద్దవాళ్లకూ ఇది అవసరమని అధ్యయనాలు చెబుతుండటం ఆశ్చర్యకరం.
పగటి పూట కునుకు తీయటాన్ని కొన్నిసార్లు సోమరితనంతో పోలుస్తుంటారు. కానీ నిజానికిది ఆరోగ్యకరం. ఇటీవల కొన్ని ఆఫీసుల్లో ‘కునుకు గదులు’ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రించినప్పుడో, ఉదయం అలసటగా అనిపించినప్పుడో అప్పుడప్పుడూ పగటి పూట మంచం మీద ఒరగటం మామూలే. కొందరు అలవాటుగానూ క్రమం తప్పకుండా కునుకు తీస్తుంటారు. ఇదొక ఆరోగ్యకరమైన అలవాటని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది హుషారు కలిగిస్తుంది, జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. కునుకు తర్వాత అంకెలు, పదాలను బాగా గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు పరీక్షల్లో తేలింది. చంచల స్వభావం గలవారు మరింత ప్రశాంతంగా ఉంటున్నట్టు, చిరాకు పడటం తగ్గుతున్నట్టూ బయటపడింది. మన మెదడు రసాయన సంకేతాలతో పని చేస్తుంది. ఇవి రోజు గడుస్తున్నకొద్దీ, వయసు మీద పడుతున్నకొద్దీ తగ్గుతుంటాయి. కాసేపు కునుకు తీస్తే మెదడు పునరుత్తేజిత మవుతుంది. మతిమరపు త్వరగా రాకుండానూ చూస్తుంది. అలసట ప్రమాదకరంగా పరిణమించొచ్చు. ముఖ్యంగా వాహనాలు నడుపు తున్నప్పుడు లేదా భారీ యంత్రాలతో పనిచేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదాల బారినపడొచ్చు. కొద్దిసేపు కునుకు తీస్తే ఇలాంటివి నివారించుకోవచ్చు. ఎందుకంటే దీంతో ప్రతిస్పందించే వేగం పెరుగుతుంది. ఎక్కువ దూరాలు ప్రయాణం చేయాల్సినప్పుడు బయలు దేరటానికి ముందు కొద్దిసేపు మంచం మీద వాలితే నిద్రలేమి, అలసట దరిజేరకుండా చూసుకోవచ్చు.
ఇన్‌ఫెక్షన్, వాపు త్వరగా తగ్గటానికి కునుకు తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తీ పుంజుకుంటుంది. అందుకే జబ్బుల బారినపడ్డవారిని విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. గుండె ఆరోగ్యానికి కునుకు మేలు చేస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా మున్ముందు ఒత్తిడిని కలిగించే ఘటనలను ఎదుర్కోవాల్సి వస్తే రక్తపోటు బాగా అదుపులో ఉంటుంది. ఉదయం నిద్ర లేచాక సుమారు 6 నుంచి 8 గంటల తర్వాత కునుకు తీయటం మంచిది. ఎందుకంటే అప్పటి వరకూ అప్రమత్తంగా ఉండటానికి తోడ్పడిన కార్టిజోల్ హార్మోన్ మోతాదులు తగ్గుతాయి. కునుకు తీసినప్పుడు నిజంగా నిద్రపట్టకపోయినా.. సగం నిద్ర, సగం మెలకువతో ఉన్నా కూడా మంచి విశ్రాంతి లభిస్తుంది. సృజనాత్మకత మరింత పెరుగుతుంది. సమస్య పరిష్కార సామర్థ్యం మెరుగవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలను గుర్తుంచుకోవటం తప్పనిసరి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z