* మన దేశంలో బంగారం, వెండి లోహాలపై అందరికీ మక్కువే. మొన్నటిదాకా బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు దీనికంటే ఎక్కువగా వెండి (Silver)పై ఆసక్తి చూపుతున్నారు మదుపరులు. ధర తగ్గడంతో పసిడి కంటే మంచి రిటర్నులు ఉంటాయని భావిస్తున్నారు. దీనికి తోడు పారిశ్రామిక వర్గాల నుంచి కూడా గిరాకీ పెరగడంతో ఈ ఏడాది వెండి దిగుమతులు (Silver Imports) భారీగా పెరిగాయి. ఇవి గత ఏడాదితో పోలిస్తే రెట్టింపుగా ఉండనున్నట్లు దిగుమతుదారులు చెబుతున్నారు. గతేడాది భారత్ (India) మొత్తంగా 3,625 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది ఈ మొత్తం 6,500-7000 టన్నుల వరకు ఉండొచ్చని దిగ్గజ దిగుమతిదారు ఆమ్రపాలి గ్రూప్ గుజరాత్ సీఈవో చిరాగ్ టక్కర్ అంచనా వేస్తున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 2024 తొలి అర్ధభాగంలో ఇప్పటికే 4,554 టన్నుల వెండిని దిగుమతి చేసుకున్నారు. గతేడాది తొలి ఆరు నెలల్లో ఈ సంఖ్య కేవలం 560 టన్నులు మాత్రమే కావడం గమనార్హం.
* టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్(TPSSL) నివాస, కార్పొరేట్ వినియోగదారులకు సోలార్ ప్యానెల్స్/యూనిట్ల కొనుగోలు కోసం రుణాలు అందించడానికి ఐసీఐసీఐ బ్యాంకుతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందంలో భాగంగా, వినియోగదారులు 5 ఏళ్ల వరకు పూచీకత్తు లేకుండా రూ.90 లక్షల వరకు రుణాలను పొందొచ్చు. అంతకంటే అధిక రుణాల కోసం పూచీకత్తుతో 20 ఏళ్ల వరకు కాలపరిమితి పొందొచ్చు. TPSSL, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్(TPREL)కు సంబంధించిన యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. వినియోగదారులు తమ రుణ మొత్తంలో 20-25 శాతం వరకు ఫ్లెక్సిబుల్ డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను పొందవచ్చు. టాటా పవర్‌కు సంబంధించిన విభాగమైన TPREL పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ డెవలపర్.
* ఎయిర్‌ఇండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శుక్రవారం పెద్దమొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు గానూ ఆ సంస్థకు రూ.90లక్షల జరిమానా (Fine)ను విధిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. దీంతోపాటు ఎయిర్‌ఇండియా (Air India) ఆపరేషన్స్ డైరెక్టర్‌కు రూ.6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్‌కు రూ.3 లక్షలు జరిమానా విధించింది. ఈ లోపాలపై సంస్థ ఇచ్చిన స్వచ్ఛంద నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దీనికితోడు ఐటీ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను (Stock Market) ఒత్తిడికి గురిచేశాయి. దీంతో ఆద్యంతం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరకు స్వల్పంగా లాభపడ్డాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ (Sensex) స్వల్పంగా 33 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 12 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఈ ఉదయం 81,165 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభనష్టాల్లో ఊగిసలాడింది. ఒక దశలో 80,883 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయిన సూచీ చివరకు కాస్త కోలుకుని 33.02 పాయింట్ల అత్యల్ప లాభంతో 81,086.21 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ స్వల్పంగా 11.65 పాయింట్లు పెరిగి 24,823.15 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 83.89గా ముగిసింది.
* అమెజాన్ సంస్థలో ఒకప్పుడు వైస్‌ప్రెసిడెంట్ (Amazon Ex Vice President) హోదాలో పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ సంస్థకు చెందిన సీఈఓ తన భార్యను ప్రలోభపెట్టడంతో తాను చివరకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. పని విషయంలో ఆయన్ను వ్యతిరేకించినందుకు తనకు ఆ పరిస్థితి తలెత్తిందన్నారు. అలాగే కార్పొరేట్ సెక్టార్ (corporate sector)లో మనుగడ సాగించేందుకు కొన్ని సూచనలు చేశారు. ఎథాన్ ఇవాన్స్(Ethan Evans) గతంలో అమెజాన్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అప్పుడు ఆ సంస్థ సీఈఓగా ఉన్న వ్యక్తి చేతిలో తాను ఎదుర్కొన్న దారుణ అనుభవం గురించి లింక్డిన్‌లో పోస్టు పెట్టారు. ‘‘పని విషయంలో ఆ సీఈఓను నేను వ్యతిరేకించినందుకు.. అతడు నా భార్యను ప్రలోభపెట్టాడు. అతడు గెలిచాడు. నేను విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. సంస్థను వీడాల్సి వచ్చింది. కొన్ని ఎగ్జిక్యూటివ్ టీమ్స్ ఎలా విషం చిమ్ముతాయో నాకు అర్థమైంది. నేను చెప్పిన విషయాన్ని మీరు నమ్ముతారనుకుంటున్నా. మీరు నా బాధ నుంచి నేర్చుకోండి’’ అంటూ కొన్ని సూచనలు చేశారు. అలాగే ‘‘మీకు నచ్చని లీడర్లు ఉన్నప్పటికీ.. అద్భుతమైన పనితీరు ప్రదర్శించడానికి ప్రయత్నించాలి. అలాంటివారితో నేరుగా ఘర్షణ పెట్టుకోకుండా చూసుకోండి. మీ విశ్వసనీయతను పెంచుకోవడంపై దృష్టిసారించండి’’ అని సూచించారు.
* ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై (Anil Ambani) మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ.. సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ‘రిలయన్స్ హోమ్ ఫైనాన్స్’ (RHFL)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అనిల్ అంబానీపై (Anil Ambani) సెబీ రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనొద్దని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆర్నెళ్ల పాటు నిషేధించింది. రూ.6 లక్షల జరిమానా కూడా విధించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z