ఆరుగాలం శ్రమించి.. రూ.లక్షల ఖర్చు చేసి టమాటా సాగుచేస్తే కనీసం పెట్టుబడి రావడం లేదు. ప్రస్తుతం జిల్లాలో టమాటా రైతుల ఆవేదన ఇదీ. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పతనమై అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే సమయంలో గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో తెగుళ్లు సోకి, ఊజీ ప్రభావంతో దిగుబడులు తగ్గాయి. వచ్చిన కాస్తా పంట నాణ్యత లోపించింది. 15 కిలోల పెట్టె జూన్‌లో రూ.800- రూ.1000 మధ్య పలికింది. ప్రస్తుతం రూ.250- రూ.300 మాత్రమే వస్తోంది. టమాటా సాగులో ఏటికేడు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఎకరాకు రూ.1.50 లక్షల – రూ.2 లక్షల వరకు ఖర్చవుతోంది. మూడేళ్ల కిందట ఇందులో సగం ఖర్చులే వచ్చేవి. అప్పుడున్న ధరలే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ పరిస్థితులన్నీ సహకరిస్తే 15 నుంచి 19 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం వివిధ కారణాలతో 10 క్వింటాళ్లకు మించడం లేదు. టమాటా కోతలు, మార్కెట్‌కు తరలింపు, రవాణా, ఎగుమతి దిగుమతి ఖర్చులు లెక్కిస్తే ఒక్కో బాక్సుకు రూ.40 వరకు వ్యయమవుతోంది. ఒక్కో బాక్సుకు కమీషన్ రూ.10 ఇచ్చుకోవాల్సిందే. ఇలా అన్నింటిని భరించి విక్రయించినా ప్రస్తుత ధరలతో రైతుకు నష్టమే మిలుగుతుంది.
మే, జూన్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో రైతులు అధికంగా సాగు చేశారు. సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ధరలు బాగుంటాయి. పొరుగు రాష్ట్రాల్లో పంట లేక అక్కడి వ్యాపారులు ఇక్కడికి రావడమే ఇందుకు కారణం. జులై, ఆగస్టులో వాతావరణం చల్లబడి దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గాయి. దీంతో నష్టాలు అధికమయ్యాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z