Movies

నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు-NewsRoundup-Aug 24 2024

నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు-NewsRoundup-Aug 24 2024

* మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక (Hema Committee report) అంతటా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతటా ఈ కమిటీ నివేదిక గురించే చర్చ జరుగుతున్న తరుణంలో ఆ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌ (Ranjith)పై బెంగాలీ నటి శ్రీలేఖ కీలక ఆరోపణలు చేశారు. రంజిత్‌ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని తెలిపారు. 2009లో ఒక సినిమా ఆడిషన్‌ కోసం సంప్రదించానని ఆ సమయంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు.

* మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) స్పందించారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించారు. ‘‘ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిని. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేం ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని నాగార్జున పేర్కొన్నారు.

* జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Committee Report)ను ఉద్దేశించి నటుడు నాని (Nani) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నివేదికలో తెలియజేసిన షాకింగ్‌ విషయాల గురించి తెలుసుకొని తానెంతో బాధపడినట్లు చెప్పారు. ‘‘ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు నా హృదయం ముక్కలైంది. నా సెట్స్‌లో లేదా చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. మెయిన్‌స్ట్రీమ్‌ మూవీస్‌కు సంబంధించి ఇలాంటివి జరగవని నేను అనుకుంటున్నా. భారీ చిత్రాలను తెరకెక్కించడం కోసం ప్రతిఒక్కరూ శ్రమిస్తుంటారు. నా చుట్టూ ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండి ఉండొచ్చు. అందుకే నా లొకేషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఎప్పుడూ నా దృష్టికి రాలేదు. కాబట్టి, ఈ నివేదిక గురించి చదివినప్పుడు.. ‘ఇలా ఎక్కడ జరుగుతుంది’ అని షాకయ్యా’’ అని నాని తెలిపారు. సినీ రంగంలో రాణించాలనే ఆసక్తితో చాలామంది మహిళలు ఇప్పటి రోజుల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారని ఆయన తెలిపారు. గతంతో పోలిస్తే ఇండస్ట్రీపై ఆసక్తి చూపించే మహిళల సంఖ్య ఇప్పుడు మరింత పెరిగిందన్నారు. వారు రాణించడానికి ఇక్కడ అనువైన పరిస్థితులు ఉండాలని కోరుకున్నారు.

* తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

* గత వైసీపీ ఐదేండ్ల పాలనలో(YCP Rule) పరిశ్రమల్లో భద్రత గురించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ (TDP) ఏపీశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivas rao) ఆరోపించారు. విశాఖలో శనివారం ఎంపీ భరత్‌, ఎమ్మెల్యేతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.

* తాప్సీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను నటిని, పబ్లిక్ ప్రాపర్టీని కాదు’ అంటూ నటి తాప్సీ చేసిన బోల్డ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాప్సీ ఇటీవల ‘పాపరాజీ’ గురించి మాట్లాడింది. ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నేను ప్రముఖ నటిని, పబ్లిక్ ప్రాపర్టీని కాదు. రెండింటికీ చాలా తేడా ఉంది. ‘నో అంటే నో’ అని చెబితే తెరవెనుక ఉన్న మహిళలు అంగీకరించరు. నేను మొదట అమ్మాయిని. ఆ తర్వాత నటిని. నేను ఇలా అంటున్నానుని కొందరు నన్ను తప్పుగా అర్ధం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్ గా చేస్తున్నావ్ అని కామెంట్స్ చెయ్యొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి’ అని తెలిపింది తాప్సీ.

* తమ ప్రాంత సమస్యలను ఐదో తరగతి విద్యార్థిని గ్రామ సభలో కలెక్టర్‌కు విన్నవించిన ఘటన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలో చోటుచేసుకుంది. స్వర్ణ పంచాయతీల సాధనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా చంద్రశేఖరపురంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్‌తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఈ సభలో పలువురు తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్న తరుణంలో ఓ చిన్నారి వేదికపైకి వచ్చి తన సమస్యను వివరించింది. తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, ఇంటికి వెళ్లే దారిలో వీధి దీపాలు వెలగడం లేదని అర్జీ రూపంలో కలెక్టర్‌కు అందజేసింది. ధైర్యంగా సమస్యలు వివరించిన చిన్నారిని మంత్రి, అధికారులు అభినందించారు.

* ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) విలువైన కానుక అందజేశారు. ‘ఇంద్ర’ రీ రిలీజ్‌ (Indra ReRelease)ను పురస్కరించుకుని ఆ చిత్రబృందాన్ని శుక్రవారం చిరు కలిశారు. నిర్మాత అశ్వనీదత్‌, దర్శకుడు బి.గోపాల్‌, సంగీత దర్శకుడు మణిశర్మ, సినీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, చిన్నికృష్ణలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. ఆ సినిమా విశేషాలను నెమరువేసుకున్నారు. ఇందులో భాగంగా అశ్వనీదత్‌కు ఒక అందమైన శంఖాన్ని బహుమతిగా అందజేశారు.

* పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్‌ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని భాజపా ఎంపీ రఘునందన్‌రావు దుయ్యబట్టారు. ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్న భారాస కూలగొట్టలేదని అన్నారు.

* జనగామ భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌ కేసర్ మండలం వెంకటాపూర్‌ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్‌ జోన్‌లో 1.5ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్‌శాఖ ఏఈ పరమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. సైన్స్‌ ల్యాబ్‌లో ఆరోతరగతి విద్యార్థులు చేసిన ప్రయోగం వికటించి విషవాయువులు విడుదలయ్యాయి. దీంతో ల్యాబ్‌లో ఉన్న 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్‌ నుంచి బయటకు పరిగెత్తారు.

* ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) కథానాయకుడిగా అషుతోశ్‌ గోవారికర్‌ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘లగాన్‌’ (Lagaan Movie). 2001లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, అనేక అవార్డులను సొంతం చేసుకుంది. భువన్‌గా ఆమిర్‌ నటన అందరినీ కట్టిపడేసింది. అయితే, తొలుత ఈ మూవీ స్క్రిప్ట్‌ అగ్ర కథానాయకులైన షారుక్‌, హృతిక్‌ రోషన్‌ల దగ్గరకు వెళ్లిందట. ఇందులో లఖా పాత్ర పోషించిన యశ్‌పాల్‌ శర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘లగాన్‌’ కథ, స్క్రిప్ట్‌ను ఎవరూ నమ్మలేదని, కచ్చితంగా ఫ్లాప్‌ అవుతుందనుకున్నారని యశ్‌పాల్ అన్నారు. ‘‘జావేద్‌ అక్తర్‌తో సహా ప్రతి ఒక్కరూ ‘లగాన్‌’ సబ్జెక్ట్‌ వర్కవుట్‌ కాదనుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా హీరో ధోతి, పగ్డీ ధరించడం నచ్చలేదు. అషుతోష్‌ దగ్గర ఈ స్క్రిప్ట్‌ ఎప్పటి నుంచో ఉంది. ఆయన ఈ కథను సెట్స్‌పైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం షారుక్‌ను కలిశారు. అయితే, స్క్రిప్ట్‌ ఆయన్ను మెప్పించలేదు. ఆ తర్వాత హృతిక్‌ రోషన్‌ను కలిసి కథ చెప్పినా, ఆయన కూడా అంగీకారం తెలపలేదు. తీరా చూస్తే, సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఆస్కార్‌కు కూడా నామినేట్‌ అయింది. సినిమా విజయం సాధించడం, ఆస్కార్‌కు నామినేట్‌ కావడంతో మేమంతా అమెరికా వెళ్లాం. సరిగ్గా అదే సమయంలో 9/11 ట్విన్‌ టవర్స్‌పై దాడి జరిగింది. దాదాపు నెల రోజుల పాటు అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది’’ అని యశ్‌ పాల్‌ చెప్పుకొచ్చారు.

* భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కథానాయిక. పీరియాడిక్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రం కంగన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్‌లో తనపై కుట్ర జరిగిందని చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్న పలువురు వ్యక్తులు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారన్నారు. తన సినిమాల్లో యాక్ట్‌ చేయొద్దని చాలా మందికి చెప్పారని ఆరోపించారు.

* రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 11 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాల అభివృద్ధి కోసం తొలి విడతగా కేంద్రం రూ.15.4 కోట్లను మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో కర్నూలు, కడప, నెల్లిమర్ల, చిత్తూరులో రెండు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుకొండ, కదిరి, పలాస, విశాఖపట్నంలో నగరవనాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z