NRI-NRT

టాంటెక్స్ 205వ సాహిత్య సదస్సులో తెలుగు భాషా సౌరభాలు-మహిళలచే వినూత్న సాహిత్య రూపకం

టాంటెక్స్ 205వ సాహిత్య సదస్సులో తెలుగు భాషా సౌరభాలు-మహిళలచే వినూత్న సాహిత్య రూపకం

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(TANTEX) ఆధ్వర్యంలో 205వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు 18వ తేదీన కొప్పెల్‌లో వేముల లెనిన్ నివాసంలో అంతర్జాల వేదికగా నిర్వహించారు. “తెలుగు భాషా సౌరభాలు-మహిళలచే వినూత్న సాహిత్య రూపకం” అనే అంశంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ప్రవాస యువతి సమన్విత త్యాగరాయ కీర్తనలను ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాడ దయాకర్ ముఖ్య అతిథులను సభకు పరిచయం చేశారు. డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి, డాక్టర్ వీ.ఎన్.రాజ్యలక్ష్మి, నిడుమోలు కనకదుర్గా రాణితోను, డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి, డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి, డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల మైథిలి, డాక్టర్ వేమూరి సత్యవతి, డాక్టర్ మద్దూరి బాలదుర్గాశ్యామలలు అతిథులుగా హాజరయ్యారు.

డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆరుగురు మహిళామణులతో కలిసి సాహిత్య ప్రక్రియల రూపాకాన్ని ప్రదర్శించమని టాంటెక్స్ సంస్థ నుండి అభ్యర్థన రావడం ఆనందంగా ఉందని అన్నారు. డాక్టర్ వీ.ఎన్.రాజ్యలక్ష్మి ప్రాచీన, ఆధునిక కవులు అందించిన రచనలలోని తెలుగు భాషా మాధుర్యాన్ని గుర్తుచేశారు. ద్విపద ప్రక్రియను నిడుమోలు కనకదుర్గారాణి, పద్యం ప్రక్రియను డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి, జానపదం ప్రక్రియను డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి, శతకం ప్రక్రియను డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల మైథిలి, వచన-లఘు కవితల ప్రక్రియను డాక్టర్ వేమూరి సత్యవతి, గజల్ ప్రక్రియను డాక్టర్ మద్దూరి బాలదుర్గాశ్యామలలు రూపకంగా ప్రదర్శించారు. మేధోసంపత్తికి సంగీత సాహిత్యాలను మేళవించి, పద్యరత్నాలను, జానపద గీతాలను, లాలిపాటలను, గజల్ ప్రక్రియను వీనుల విందుగా గానం చేసి రూపకాన్ని అద్భుతంగా రక్తి కట్టించారు. డా. యు. నరసిమ్హారెడ్డి మన తెలుగు సిరిసంప్దలు అనే అంశంపై ప్రసంగించారు. డాక్టర్ వైదేహి శశిధర్ ‘ముగ్గరమ్మలు’ శీర్షికతో తాను వ్రాసిన కొన్ని పద కవితలు చదివి వినిపించారు. డాక్టర్ నిర్మల లక్కరాజు తాను వ్రాసిన ”బడ్జెటు’ ‘ఎగిరే పక్షి’ ‘చందమామ’ శీర్షికలతో వ్రాసిన కవితలను చదివి వినిపించారు.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు సతీష్ బండారు, సంస్థ పూర్వాధ్యక్షులు, డాక్టర్ ప్రసాద్ తోటకూర, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కాశీనాధుని రాధ, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల, దయాకర్ మాడ, లలితానంద ప్రసాద్, రాజశేఖర్, గోవర్ధనరావు నిడిగంటి, స్వాతి, సుబ్బు చిట్టా, రాజశేఖర్, తదితరులు పాల్గొని అతిథులను సత్కరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z