* కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించి సాయం చేయాలని కోరామని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిదులు ఇంకా రాలేదు. వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరాం.
* కంపెనీలో కష్టపడి పనిచేసే వారు కొందరైతే.. వచ్చామా పోయామా అన్నట్లు ఉండేవారు మరికొందరు. పని గంటలకు మించి చేసే వారు కొందరైతే.. ఉన్న పని గంటల్లో టైమ్ పాస్ చేసేవారు ఇంకొందరు. ఎంత పనిచేసినా గుర్తింపు రావడం లేదనే బాధపడుతున్న ఈ రోజుల్లో.. తనకు పనీపాటా లేకపోయినా రూ.3 కోట్లు పైనే ఆర్జించానంటూ చెప్పుకొచ్చాడో ఉద్యోగి. తన ‘ఘన’కార్యాన్ని తానే స్వయంగా ఓ పోస్టులో రాసుకొచ్చాడు. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. అమెజాన్‌లోని సీనియర్ ఉద్యోగి ఒకరు బ్లైండ్ అనే ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల ఓ పోస్ట్ పెట్టాడు. గూగుల్ తనకు ఉద్వాసన పలికాక ఇక్కడ చేరానని అందులో పేర్కొన్నాడు. సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు 3.70 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.3.10 కోట్లు ఆర్జించినట్లు పేర్కొన్నాడు. కంపెనీలో ఏ పనీ చేయకపోయినా తనకు మొత్తం వచ్చిందని పేర్కొన్నాడు. ‘ఎంతకాలమో ఈ అదృష్టం!’ అంటూ రాసుకొచ్చాడు.
* యాపిల్ కొత్త ప్రొడక్టుల (Apple) రాకపై టెక్ ప్రియుల ఆసక్తి ఇంతా అంతా కాదు. ఆ వస్తువులు కొన్నా, కొనకపోయినా వాటి ధరలు, ఫీచర్లు తెలుసుకోవడానికైనా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అందుకే ఏడాదికోసారి యాపిల్ నిర్వహించే ఈవెంట్‌కు అంతటి క్రేజ్. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా యాపిల్ తన 16 సిరీస్ ఫోన్లను తీసుకురాబోతోంది. త్వరలోనే వీటిని లాంచ్ చేయనుంది. అధికారిక తేదీని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. అయితే, యాపిల్ ఇంకా ఈవెంట్ తేదీ ఖరారు చేనప్పటికీ.. సెప్టెంబర్ 10వ తేదీన ఈవెంట్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ ఈవెంట్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది సెప్టెంబర్ 12న కాలిఫోర్నియా వేదికగా ఈవెంట్ నిర్వహించగా.. అంతకుముందు ఏడాది సెప్టెంబర్ 7న ఈవెంట్ కండక్ట్ చేసింది. ఈ సారి సెప్టెంబర్ 10న ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20 నుంచి కొత్తగా లాంచ్ చేసిన ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొందరికి ఇప్పటికే ఇన్విటేషన్లు పంపించినట్లు సమాచారం.
* ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు (Tesla) భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం గుడ్‌బై చెప్పారు. 2013 నుంచి టెస్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె.. సుదీర్ఘ విరామం తర్వాత కంపెనీని వీడారు. కుటుంబంతో సమయం గడపడానికి, స్నేహితులతో సరదగా గడపడానికి తన సమయాన్ని కేటాయించడం కోసమే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామాను లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. టెస్లాలో శ్రీలా వెంకటరత్నం 2013లో చేరారు. గత 11 ఏళ్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆపరేషన్ హోదాలో తొలుత విధుల్లో చేరిన ఆమె.. తర్వాత సీనియర్ డైరెక్టర్‌గా హోదా పొందారు. 2019 నుంచి 2024 వరకు కంపెనీ వైస్‌ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్లాకు రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. తాను కంపెనీలో చేరిన తర్వాతే టెస్లా 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించడం సంతోషం కలిగించే విషయమని పేర్కొన్నారు. కొంతకాలం పాటు విరామం తర్వాతే కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తానని పేర్కొన్నారు.
* శనివారం (24 ఆగస్టు 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. ధరలు స్వల్పంగా తగ్గాయి.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర రూ.72,640 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 66,590 గా ఉంది. రూ.10 మేర ధర తగ్గింది.. వెండి కిలో ధర రూ. 100 మేర తగ్గి రూ.86,600లుగా ఉంది.
* తిరుమలతోపాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను వేలం వేయనున్నారు. భక్తులు స్వామి వారికి సమర్పించిన కెమెరాలను ఆగస్టు 28న వేలం వేయనున్నారు. వాటిలో ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు కూడా ఉన్నాయి. మొత్తం 6 లాట్లు ఉండగా వాటిని ఆగస్టు 28న వేలం వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే కాపర్-2, సిల్వర్ కోటెడ్ రాగి రేకులను ఆగస్టు 30, 31 తేదీల్లో టెండర్ కమ్ వేలం వేయనున్నారు. ఆగస్టు 30న కాపర్- 2 రేకులు 3 వేల కేజీలను 15 లాట్లుగా పెట్టి వేలం వేస్తారు. అలాగే ఆగస్టు 31న సిల్వర్ కోటెడ్ రాగి రేకులు 2,400 కేజీలను 12 లాట్లుగా పెట్టి వేలం వేయనున్నారు. టెండర్ లేదా వేలంలో పాల్గొనాలనుకునే భక్తులు మరింత సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ ఆఫీసులో సంప్రదించాలి. దూరప్రాంతాల వారు 0877-2264429 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. www.tirumala.org ద్వారా కూడా టెండర్, వేలానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z