Movies

అబద్ధాలు నమ్మొద్దంటున్న అక్కినేని-NewsRoundup-Aug 25 2024

అబద్ధాలు నమ్మొద్దంటున్న అక్కినేని-NewsRoundup-Aug 25 2024

* మాదాపూర్‌లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌-కన్వెన్షన్‌ కూల్చివేతను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తెలిపారు. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. చెరువుల ఆక్రమణదారుల్లో ఎంతటి వారున్నా ఉపేక్షించొద్దన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలని కోరారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భారాస నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువుల్లో కాలేజీలు కట్టారని ఆరోపించారు.

* నగరంలో అక్రమంగా కట్టుకున్న పెద్దల కట్టడాలు కూల్చడం సంతోషమే కానీ, సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ‘‘1956లో రాష్ట్రం ఏర్పడితే 40 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంది. చెరువుల చుట్టూ ఉన్న పట్టా భూముల్లో పెదలు కట్టుకున్న ఇళ్లు కూలుస్తామని సాహెబ్‌ నగర్‌, సరూర్‌ నగర్‌, ఫాక్స్‌ నగర్‌లో ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కరెక్టేనా అని సీఎం రేవంత్‌రెడ్డిని అడుగుతున్నా.

* తాను న్యాయస్థానం వెలువరించే తీర్పునకు కట్టుబడి ఉంటానని, తీర్పు వెలువడే వరకూ ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని నాగార్జున (Nagarjuna) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు.. N- కన్వెన్షన్‌ (n convention)కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పట్టా భూమిలోనే కన్వెన్షన్‌ నిర్మించాం. ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్‌ కోర్టు, ఏపీ లాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ 24-02-2014న ఓ ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రస్తుతం.. నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించాం. న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటాను. అవాస్తవాలు నమ్మకండి’’ అని ట్వీట్‌ చేశారు.

* రాష్ట్ర రాజధానిలో సంచలనంగా మారిన హైడ్రా .. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈక్రమంలో జూన్‌ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా వెల్లడించింది. తద్వారా కబ్జాదారుల నుంచి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది.

* ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించమని ప్రభుత్వాలు, రవాణాశాఖ ఎన్నిసార్లు చెప్పినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. సిగ్నల్‌ పడినా ఆగకుండా వెళ్లేవాళ్లకు లెక్కే ఉండదు. ఇలాగే ఓ ద్విచక్రవాహనదారుడు రాంగ్‌రూట్‌లో వచ్చి కారు ఎదురుగా బండిని నిలిపాడు. పైగా తాను పక్క నుంచి వెళ్లకుండా కారు నడిపే వ్యక్తిని పక్కకు వెళ్లమని సైగలు చేస్తూ అక్కడే నిలబడిపోయాడు. సరిగ్గా అదే రూట్‌లో వెళ్తున్న ఓ ఆర్మీ జవాను ఈ తతంగాన్ని చూసి, వాహనదారుడిని మందలించాడు. అయినా కూడా వినకపోవడంతో లాఠీ తీయాల్సి వచ్చింది. ఇంతలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వచ్చి, పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

* బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై తాజాగా మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయి. 2010లో బంగ్లాదేశ్‌ రైఫిల్స్‌ ఉన్నతాధికారి మరణానికి సంబంధించి కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది. బంగ్లాదేశ్‌లో రైఫిల్స్‌లో 2010లో డిప్యూటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అబ్దుల్‌ రహీం ఉన్న సమయంలో అక్కడి ఫీల్‌ఖానాలో మారణహోమం సంభవించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రహీం.. అదే ఏడాది జులై 29న జైల్లో మరణించాడు. దీనిపై రహీం కుమారుడు అబ్దుల్‌ అజీజ్‌ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌పై మాజీ ప్రధాని హసీనాపై అభియోగాలు మోపారు.

* మాజీ మంత్రి బాబూమోహన్‌ (Babu Mohan) ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చి తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. దీంతో ఆయన తెదేపాలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భాజపాలో ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీలో చేరినప్పటికీ అక్కడ కూడా ఇమడలేక పోయారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాబూమోహన్‌ తాజాగా చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది.

* ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నాయకులను ఆదేశించారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను అధినేత రద్దు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో తెదేపా బలోపేతానికి కృషి చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం తీసుకొనే ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. 15రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని, అందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని తెలిపారు.

* శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అని చెప్పారు. హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

* దేశ రాజధాని నగరం దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)కు ఎదురు దెబ్బ తగిలింది. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఐదుగురు కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. భాజపాలో చేరారు. దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ సమక్షంలో వీరంతా కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా సచ్‌దేవ మాట్లాడుతూ.. ఆప్‌ నేతల అవినీతితో ఈ కౌన్సిలర్లు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా ఎంపీలు రామ్‌వీర్‌ సింగ్‌ బిధౌరి, యోగేందర్‌ చండోలియా, పార్టీ సీనియర్‌ నేత అర్విందర్‌ సింగ్‌ లవ్లీ పాల్గొన్నారు.

* ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. కార్యాలయాల అద్దెలు, విద్యుత్‌ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బిల్లులు త్వరలోనే క్లియర్‌ చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ.. త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామన్నారు. అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు రెండేళ్లలో ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్‌ శాఖల్లో ఉన్న బెస్ట్‌ ప్రాక్టీసులను మన రాష్ట్రంలో కూడా పాటించేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

* శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే వైద్య విభాగం చర్యలు చేపడుతోంది. నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తితిదే తెలిపింది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో శాశ్వతంగా ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఉద్యోగులు, స్థానికులకు తితిదే వైద్య సేవలు అందిస్తోంది. బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా హాజరయ్యే భక్తుల కోసం అదనంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో రెండు, రాంబగీచ అతిథి గృహాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శిలాతోరణం, బాట గంగమ్మ ఆలయం, పాపనాశనం, 7వ మైలు వద్ద ఒక్కో ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. దీనికోసం తితిదే వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్‌లను సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

* జస్టిస్‌ హేమ కమిటీ (hema committee report) రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్‌ నటి ఊర్వశి (Urvashi). నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాకయ్యానని అన్నారు. ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని పరిశ్రమల్లోనూ ఉన్నాయన్నారు. మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు తాను సపోర్ట్‌ చేస్తున్నట్లు తెలిపిన ఆమె.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలుపడాలన్నారు.

* రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి మెరుగుపడింది. తద్వారా వారి పేదరికం జాతీయ స్థాయి కన్నా తక్కువగా నమోదైంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2022–23 నాటికి పేదరికం నిష్పత్తిని ఈ నివేదిక విశ్లేషించింది.గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం 7.10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.62 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఐదు శాతం కన్నా దిగువున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 4.40 శాతం ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పేదరికం తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది.దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమని స్పష్టం చేసింది. వీటి ద్వారా గ్రామీణ జీవనోపాధిని గణ­నీయంగా మెరుగు పరచిందని నివేదిక తెలి­పిం­ది. ప్రభుత్వాలు అమలు చేసిన కార్య­క్రమాలతో పేదరికం తగ్గడంతో పాటు గ్రామీ­ణ, పట్టణ పేదల జీవనోపాధి మెరుగుపడిందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే జాతీయ స్థాయిని మించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో పేదరికం ఉందని పేర్కొంది.

* టాలీవుడ్‌లో మెగా కాంపౌండ్‌, అల్లు అర్జున్ మధ్య విబేధాల గురించి అందరికీ తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడైతే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారో ఆ సమయం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, బన్నీ మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. కానీ, గత ఎన్నికల్లో తన మిత్రుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం బన్నీ నంద్యాలకు వెళ్లడంతో మెగా కాంపౌండ్‌లో పెద్ద దుమారమే రేగింది. దీంతో బన్నీ, పవన్‌ అభిమానుల మధ్య పెద్ద రచ్చే జరిగింది.ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బెంగళూరు పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరోల పాత్రల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అటవీ సంపదను కాపాడేవారని ఇప్పుడు అదే హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్‌ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పవన్‌ చేశారని ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు. ఇప్పటికీ ఆ గొడవ జరుగుతూనే ఉంది. అయితే, తాజాగా అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి రియాక్ట్‌ అయ్యారు.

* కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?. “V6 బిజినెస్” యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?.’’ అంటూ కేటీఆర్‌ ప్రశ్నలు గుప్పించారు.‘‘లోక్‌సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో నగదు విత్‌డ్రా చేయబడిన బార్‌లు, బంగారు దుకాణాలు ఎవరివి? కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమిటి?. హైదరాబాద్‌కు ఇన్ని లింకులు కనపడుతున్నా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ ఈ స్కాం గురించి నోరు విప్పాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z