Politics

తెలంగాణాలో 35వేల ఉద్యోగాల భర్తీ-NewsRoundup-Aug 26 2024

తెలంగాణాలో 35వేల ఉద్యోగాల భర్తీ-NewsRoundup-Aug 26 2024

* మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్‌ దర్శకుడు తులసీ దాస్‌పై నటి గీతా విజయన్‌ కీలక ఆరోపణలు చేశారు. ఒక సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డానని చెప్పారు. సెట్‌లో తనకు డైలాగ్స్‌ చెప్పేవాడు కాదని.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని ఆరోపించారు. ‘‘ఇండస్ట్రీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా. 1991లో ‘చంచట్టం’ షూట్‌లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నా. చిత్రీకరణలో భాగంగా హోటల్‌ రూమ్‌ కేటాయించారు. రాత్రి సమయంలో దర్శకుడు తులసీరామ్‌ నా గది తలుపు కొడుతుండేవాడు. ఆయన తీరును నేను తప్పుబట్టా. దాంతో ఆయన వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. సెట్‌లో డైలాగ్స్‌ చెప్పేవాడు కాదు. ఇండస్ట్రీ నుంచి తప్పించేస్తానని ఆయన బెదిరించాడు’’ అని ఆరోపణలు చేశారు.

* మదుర మీనాక్షి దేవాలయ సిబ్బంది తనతో అగౌరవంగా మాట్లాడారని నటి నమిత (Namitha) ఆరోపించారు. తనని దేవాలయంలోకి వెళ్లనివ్వలేదని తెలిపారు. ఈమేరకు ఆమె వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లా. ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. నాకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ చూపించమన్నారు. ఈ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను సందర్శించినట్లు చెప్పినా వారు వినిపించుకోలేదు. ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా’’ అని నమిత పేర్కొన్నారు.

* రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. రిజర్వేషన్‌ను అమలుచేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని, రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా కాజీపేటలో బీపీ మండల్‌ జయంతి సందర్భంగా బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో బీసీల సమర శంఖారావం నిర్వహించారు. బీపీ మండల్‌ చిత్రపటానికి ఆయన మనవడు సూరజ్‌యాదవ్, అతిథులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. బీసీల సహకారంతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని ఎద్దేవా చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వనని అన్నారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందన్నారు. బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో బీసీలకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తే తాను నిర్భయంగా ప్రశ్నించానన్నారు. వరంగల్‌లో వార్‌ రూం ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని, మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

* నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్‌ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రేవంత్‌రెడ్డి చెక్కులు అందజేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్‌ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సివిల్స్‌ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.

* అవకాశం వస్తే ప్రభాస్‌ (Prabhas)తో తనకు మరోసారి నటించాలని ఉందని సినీ నటి శ్రీదేవి (Sridevi) అన్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాలు చేయడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. ప్రభాస్‌ సినీ ఇండస్ట్రీకి పరిచమమైన చిత్రం ‘ఈశ్వర్‌’. ఆ చిత్రంతోనే శ్రీదేవి కూడా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఈశ్వర్‌’ సినిమా తనకెంతో ప్రత్యేకమని శ్రీదేవి తెలిపారు.

* అన్నక్యాంటీన్‌ నిర్వహణకు సెల్‌కాన్‌ సీఎండీ వై. గురుస్వామినాయుడు భూరి విరాళం ఇచ్చారు. తన జన్మదినం సందర్భంగా ఒక్క రోజు భోజన ఖర్చు కింద రూ. 26.25 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లకు విరాళం ఇచ్చినందుకు చంద్రబాబు ఆయన్ని అభినందించారు.

* క్రికెట్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడినా.. గెలిచినా ఆ జట్టు మాజీల్లో కొందరు మాత్రం భారత్‌ ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేరు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఓడించింది. ఈ క్రమంలో తమ జట్టు ఓడిపోవడానికి పరోక్షంగా టీమ్‌ఇండియానే కారణమని మాజీ క్రికెటర్ రమీజ్ రజా వ్యాఖ్యానించాడు. అలాగే తమ జట్టు ఎంపికపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లుగా పాక్‌ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని మరో మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ వ్యాఖ్యానించాడు.

* అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఓ చిత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో సైతం బయటకు రావడం గమనార్హం. అందులో ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్‌ మాట్లాడినట్లుగా ఉంది.

* కాంగ్రెస్‌ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని చెప్పారు. రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పేటోడు లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రేవంత్‌ సర్కార్‌ మోసం చేస్తున్నదంటూ ఎక్స్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు.

* డెంజెల్ తాజాగా న‌టిస్తున్న చిత్రం గ్లాడియేట‌ర్ 2 (Gladiator II). రిడ్లీ స్కాట్ (Ridley Scott) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో త‌న రిటైర్మెంట్ గురించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశాడు డెంజెల్. త‌న రిటైర్మెంట్ గురించి ఎంపైర్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. ”ఇప్పుడు నాకు 70 ఏండ్లు నాకు ఆసక్తి ఉన్న సినిమాలు చేయడానికి చాలా తక్కువ చిత్రాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. నేను నా ద‌ర్శకుడిని చూసి ప్రేరణ పొందాలి. నా ద‌ర్శ‌కుడు రిడ్లీ స్కాట్ ఇప్పుడు 86 సంవ‌త్సరాలు. 86 వ‌య‌సులో కూడా గ్లాడియేట‌ర్ 2 వంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఆయ‌నను చూసి ప్రేరణ పొందాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకోచ్చాడు.

* శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం అయిన జైళ్లను బాగుచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. హైదరాబాద్‌లోని మగ్ధుమ్ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైడ్రా(Hydra) చర్యల వల్ల బడా బాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందా లేదా వారి ఒత్తిడితో రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) జైలుకు(Jail) వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రధానిగా మోదీ అయ్యాక నేను సన్యాసిని.. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు అన్నారు.

* తాను క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి (Mayawati) స్పష్టం చేశారు. ‘కులవాద మీడియా’ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్, గౌరవనీయులైన కాన్షీరామ్ జీ వంటి బహుజనుల ఆశయాలను నిర్వీర్యం చేసే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి తన చివరి శ్వాస వరకు బీఎస్పీ ఆత్మగౌరవం, ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం కావాలన్నదే తన నిర్ణయమని సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z