Business

UPI మాదిరి రుణాల కోసం ULI – BusinessNews-Aug 26 2024

UPI మాదిరి రుణాల కోసం ULI – BusinessNews-Aug 26 2024

* స్పామ్‌ సందేశాల నివారణకు ట్రాయ్‌ (TRAI) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇ-కామర్స్‌ సంస్థల నుంచి మనకొచ్చే ఓటీపీల (OTP) విషయంలో అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. దీంతో గడువు కావాలని టెల్కోలు కోరుతుండగా.. అందుకు ట్రాయ్‌ సుముఖంగా లేదని తెలుస్తోంది. యూఆర్‌ఎల్స్‌, ఓటీటీ లింక్స్‌, ఏపీకేలతో కూడిన సందేశాలు, వైట్‌ లిస్ట్‌ చేయని కాల్‌ బ్యాక్‌ నంబర్లతో కూడిన సందేశాలను నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31లోగా తమ మెసేజ్‌ టెంప్లేట్స్‌, కంటెంట్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలని ఆయా సంస్థలకు సూచించింది. అయితే, సందేశాలు పంపే వివిధ సంస్థలు తమ హెడర్‌, టెంప్లేట్స్‌ మాత్రమే గతంలో టెల్కోలతో రిజిస్టర్‌ చేసుకున్నాయి. అంటే లోపల కంటెంట్‌ ఏముందనే దానితో సంబంధం లేకుండా సందేశాలు బదిలీ అవుతూ వచ్చాయి. ట్రాయ్‌ కొత్త రూల్స్‌ ప్రకారం.. బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (డీఎల్‌టీ)కి టెలికాం కంపెనీలు మారాలి. అంటే ప్రతి ఒక్క కమర్షియల్‌ మెసేజ్‌ను చదవాలి. రికార్డులకు అనుగుణంగా లేనివాటిని బ్లాక్‌ చేయాల్సి ఉంటుంది.

* యూపీఐ (UPI) సేవల ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరో కొత్తతరహా సేవలకు నాంది పలకనుంది. రుణాలు తీసుకోవడాన్ని సులభతరం చేయడం కోసం యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ULI)ను జాతీయస్థాయిలో త్వరలో లాంచ్‌ చేయనుంది. గతేడాదే ‘ఫ్రిక్షన్‌లెస్‌ క్రెడిట్‌’ పేరిట పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఆర్‌బీఐ.. అవి సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది. ‘‘డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలో యూపీఐ ఏవిధమైన పాత్ర పోషిస్తోందో.. రుణ వితరణలో యూఎల్‌ఐ కూడా అదే పాత్ర పోషించబోతోంది. దేశ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక నిర్వహించబోతోంది’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు.

* ఉబ‌ర్(Uber ) సంస్థ‌కు భారీ జ‌రిమానా విధించింది నెద‌ర్లాండ్స్ డేటా ప్రొటెక్ష‌న్ విభాగం. ఉబ‌ర్‌ రెయిడ్ స‌ర్వీస్ సంస్థ‌కు 32.4 కోట్ల డాల‌ర్ల జ‌రిమానా వేశారు. యురోపియ‌న్ డ్రైవ‌ర్ల ప‌ర్స‌న‌ల్ వివ‌రాల‌ను అమెరికాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన కేసులో హేగ్‌లోని డేటా ప్రొటెక్ష‌న్ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. డ‌చ్ డేటా నిఘా విభాగం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఉబ‌ర్ యాప్‌ సంస్థ త‌ప్పుప‌ట్టింది. దీనిపై కోర్టులో అప్పీల్ చేయ‌నున్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది. రెండేళ్లుగా డేటా ట్రాన్స్‌ఫ‌ర్ జ‌రిగింద‌ని, యురోపియ‌న్ యూనియ‌న్ జ‌న‌ర‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ రెగ్యులేష‌న్ రూల్స్‌ను ఉల్లంఘించార‌ని డచ్ డేటా ప్రొటెక్ష‌న్ అథారిటీ పేర్కొన్న‌ది.

* పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ షోకాజ్ నోటీసులు ఇచ్చిన వార్తలు రావడంతో సోమవారం స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్ దాదాపు 9 శాతం పతనమైంది. పేటీఎం డైరెక్టర్లకు కూడా సెబీ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఎస్ఈలో పేటీఎం షేర్ 8.8 శాతం నష్టపోయి రూ.505.25కు పడిపోయింది. 2021 నవంబర్‌లో ఐపీఓకు వెళ్లినప్పుడు క్లాసిఫికేషన్ నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ సెబీ నోటీసు ఇచ్చినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తాకథనం ప్రచురించింది. ఇంతకుముందు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ విచారణ నివేదిక ఆధారంగా ఎంక్వైరీ ప్రారంభమైంది. సెబీకి ఐపీఓ పత్రాలు సమర్పించినప్పుడు విజయ్ శేఖర్ శర్మ .. పేటీఎం ఉద్యోగిగా కాకుండా ప్రమోటర్ గా యాజమాన్య నియంత్రణ కలిగి ఉన్నట్లు తెలిపారు. పేటీఎం సీఈఓ వైఖరిని బోర్డు సభ్యులు ఆమోదిస్తున్నారా? లేదా? తెలుపాలంటూ వారికీ సెబీ నోటీసు జారీ చేసింది. సెబీ నిబంధనల ప్రకారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన తర్వాత ప్రమోటర్లు ఎంప్లాయి స్టాక్ ఆప్షనస్ పొందడం నిషేధం. 2021లో ఐపీఓకు వెళ్లడానికి ముందే పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన వాటాలో 5 శాతం తన కుటుంబ ట్రస్ట్ వీఎస్ఎస్ హోల్డింగ్ ట్రస్ట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. పేటీఎంలో 14.6 శాతం వాటా గల విజయ్ శేఖర్ శర్మ వాటా.. వీఎస్ఎస్ హోల్డింగ్ ట్రస్టుకు బదిలీ చేసిన తర్వా 9.6 శాతానికి దిగి వచ్చింది. దీంతో కంపెనీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించవచ్చునని పేటీఎం వర్గాలు తెలిపాయి. 10 శాతం లోపే వాటా గల వాటాదారులు కంపెనీని ప్రొఫెషనల్ గా మేనేజ్ చేయొచ్చునని తెలుస్తున్నది.

* మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతడు గమనించలేదు. తన దారిలో వెళ్లిపోతుండగా.. ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల కాలంలో మన్యం జిల్లాలో ఏనుగుల దాడులు తరచూ జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

* ఒడిశా నుంచి ఏపీకి తరలిస్తోన్న 912 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తుండగా.. అనకాపల్లి జిల్లాలో పోలీసులు అడ్డుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. మరో ఐదుగురిని అరెస్టుచేయాల్సి ఉందని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.45లక్షలు ఉంటుందని అంచనా.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z