* ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్.. తన యూజర్లకు ఉచితంగా అందిస్తున్న వింక్ మ్యూజిక్ (Wynk) సేవల్ని త్వరలోనే నిలిపి వేస్తున్నట్లు సమాచారం. యాపిల్‌తో కొత్తగా కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
* కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కకు మించిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో 6 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు యాపిల్ పేర్కొంది. దేశంలో యాపిల్ తన కార్యకలాపాలను పెంచుకోవాలనుకునే నేపథ్యంలో 2025 నాటికి మొత్తం 2,00,000 మంది ఉద్యోగులను కలిగి ఉండాలని సంకల్పించింది. ఇందులో 70 శాతం మంది మహిళలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ ఫోక్స్‌కాన్, విస్ట్రాన్, పెగట్రాన్ వంటి యాపిల్ సరఫరాదారులలో 80,872 మంది ప్రత్యక్ష ఉద్యోగులు.. టాటా గ్రూప్, సాల్‌కాంప్, మదర్‌సన్, ఫాక్స్‌లింక్, సన్‌వోడా, ఏటీఎల్, జాబిల్ వంటి సరఫరాదారులు 84,000 మంది పరోక్ష ఉద్యోగులు ఉన్నట్లు సమచారం.
* నిధులు సమీకరించేందుకు చాలా కంపెనీలు ఐపీఓకు (IPO) వస్తుంటాయి. కొన్నిసార్లు పేరుమోసిన కంపెనీలు లిస్టింగ్ సమయంలో నష్టాలను మిగులుస్తుంటాయి. అనామక కంపెనీలు అద్భుత రిటర్నులతో అదరగొడుతుంటాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయా కంపెనీలు వార్తల్లో నిలుస్తుంటాయి. కానీ, దిల్లీ వాసులకు కూడా పెద్దగా పరిచయం లేని ఓ కంపెనీ.. ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అంతేకాదు చర్చనీయాంశమైంది కూడా. స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజ్ సెగ్మెంట్‌లో (SME) ఐపీఓకు వచ్చిన రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ కంపెనీ ఏకంగా 419 రెట్లు ఓవర్ స్క్రైబ్ అవ్వడమే ఇందుక్కారణం. రూ.12 కోట్ల ఐపీఓకు రూ.4,800 కోట్ల విలువైన బిడ్లు దాఖలవ్వడం గమనార్హం. కంపెనీ వివరాల్లోకి వెళితే.. రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ అనే కంపెనీ 2018లో ఏర్పాటైంది. సాహ్ని ఆటోమొబైల్ బ్రాండ్‌పై వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి యమహా డీలర్ షిప్ ఉంది. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల సేల్స్, సర్వీసింగ్‌ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి దిల్లీలో రెండే రెండు షోరూమ్‌లు ఉండగా.. మొత్తం 8 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో రెండు షోరూమ్‌లు తెరవడంతో పాటు, రుణాలు, నిర్వహణ ఖర్చుల కోసం ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వినియోగించుకుంటామని కంపెనీ తన ఐపీఓ పత్రాల్లో పేర్కొంది.
* పండగ సీజన్ వేళ.. వాహన తయారీ సంస్థలు వినియోగదారులకు తీపి కబురు అందించాయి. సాధారణంగా ఏటా తగ్గింపు ధరలతో వాహనాలను కొనుగోలు చేసే వీలు ఉంటుంది. అయితే.. స్క్రాపేజ్ సర్టిఫికెట్ (scrappage certificate) ఉన్నవారికి మాత్రం మరింత డిస్కౌంట్ ఇవ్వనుంది. పాత వాహనాలను ఇచ్చి డిస్కౌంట్‌లో కొత్త వాహనాలను తక్కువ ధరకే పొందే సువర్ణ అవకాశం కల్పించాయి. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చిన తర్వాత ఈ సర్టిఫికెట్‌ను అందిస్తారు.
* మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసినందుకు గానూ తమ అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ లెటర్ ఆఫ్ అవార్డ్(LOA) అందుకున్నట్లు JSW ఎనర్జీ ఈ రోజు(మంగళవారం) తెలిపింది. 200 MW విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్, JSW నియో ఎనర్జీకి టారిఫ్ ఆధారిత పోటీ బిడ్‌లో లభించిందని JSW ఎనర్జీ ప్రకటించింది. ఇది వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని 17.20 గిగావాట్లకు పెంచుతుంది. సంస్థ 2030 నాటికి 20 GW ఉత్పత్తి సామర్థ్యాన్ని, 40 GWh విద్యుత్ శక్తి నిల్వ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. JSW ఎనర్జీ, 2050 నాటికి ‘కార్బన్ న్యూట్రాలిటీ’ని సాధించాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
* ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) సిద్ధమైంది. తన కస్టమర్ కేర్ సర్వీసులకు మెరుగులద్దింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లీష్ భాషలకే పరిమితమైన ఈ సేవలు.. తాజాగా మరో ఏడు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని విమానయాన సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో రాణించిన ప్రపంచ మార్కెట్లలో స్తబ్దత నెలకొంది. మన మార్కెట్ సూచీలూ అందుకనుగుణంగానే చలించాయి. మరోవైపు పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ వంటి షేర్లు సూచీలకు దన్నుగా నిలవగా.. రిలయన్స్, హెచ్‌యూఎల్ షేర్లు పడేశాయి. సెన్సెక్స్ ఉదయం 81,815.23 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,698.11) నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత లాభాల్లోకి చేరుకుంది. ఇంట్రాడేలో 81,919 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి కేవలం 13.65 పాయింట్ల లాభపడి 81,711.76 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 7 పాయింట్లు మాత్రమే లాభపడి 25,017 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.92గా ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z