Politics

యూకె పర్యటనకు జగన్-NewsRoundup-Aug 27 2024

యూకె పర్యటనకు జగన్-NewsRoundup-Aug 27 2024

* మలయాళ (Mollywood) చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ (Hema Committee report) సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. దీనిపై తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న మొత్తం పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. ఈ మేరకు ‘అమ్మ (AMMA)’ సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూకుమ్మడి రాజీనామాలతో మలయాళ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.

* భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో ఆమె సోదరుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘థాంక్యూ సుప్రీంకోర్టు. ఊరట లభించింది.. న్యాయం గెలిచింది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

* ఏపీలో ప్రజారోగ్య రంగానికి చంద్రబాబు సర్కార్‌ ఉరితాడు బిగుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా నిలదీశారు. ‘‘ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరుగారుస్తున్నారు. తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్‌ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి ఇంకో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

* సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వైరల్‌ జ్వరాలు, డెంగ్యూ, చికున్‌ గున్యా కేసుల పెరుగుదలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాక ముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని, గ్రేటర్‌ హైదరాబాద్‌, పట్టణాలు, గ్రామాల్లో ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్యశాఖ అధికారులు, కలెక్టర్‌ సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు.

* వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్‌ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని.. అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు. విశాఖలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేశారని గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలుపెట్టాల్సి ఉంటుందన్నారు.

* మాజీ సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్‌ 3 నుంచి 25 వరకు కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు ఆయనకు కోర్టు అనుమతి కోరారు. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబరు, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్‌కు ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాస్‌పోర్టు జారీకి కూడా సీబీఐ కోర్టు నుంచి అనుమతి లభించింది.

* కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వాసుపత్రులకు శాపంగా మారుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి దక్కులేకుండా పోయిందన్నారు. నిత్యం వేలాది మందికి సేవలందించే ఆ ఆస్పత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. ఆస్పత్రిలో మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

* ఆలస్యం అయినప్పటికీ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడం సంతోషకర విషయమని మాజీ ఎంపీ, భారాస నేత వినోద్‌ కుమార్‌ అన్నారు. భాజపా వ్యతిరేక రాజకీయ నేతలపై ఆరోపణలు లేకపోయి ఉంటే దిల్లీ మద్యం కేసులో 15 రోజుల్లోనే బెయిల్‌ వచ్చేదని చెప్పారు. బతుకమ్మ పండుగ, తెలంగాణ సంస్కృతిని కవిత ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారని తెలిపారు.

* జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు అవార్డు వరించింది. ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ప్రభాకర్‌రెడ్డి పెసర, సిరిసిల్ల దమ్మన్నపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తాండూరి సంపత్‌ కుమార్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z