* పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన (Kolkata Doctor Rape and Murder) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంతటి అమానుషానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష పడాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కోర్టులో అతడి తరఫున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రాలేదు. ఇలాంటి పరిణామాల నడుమ ఓ మహిళా న్యాయవాది నిందితుడి తరఫున వాదనలు వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆమే లాయర్ కవితా సర్కార్ (Lawyer Kavita Sarkar)..! కేసు ఎంతటి తీవ్రమైనదైనా సరే.. పారదర్శక విచారణ కోసం నిందితుడి వాదనలు వినడం కూడా ముఖ్యమే. దీన్ని పరిగణనలోకి తీసుకునే ఇటీవల కోర్టు లీగల్ ఎయిడ్‌కు సిఫార్సులు చేసింది. దీంతో సంజయ్ రాయ్ (Accused Sanjay Roy) కోసం వాదించే బాధ్యతలను కోల్‌కతాకు చెందిన మహిళా న్యాయవాది కవితా సర్కార్‌కు అప్పగించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
* సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరునే సైబర్ నేరగాళ్లు తమ మోసానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ఓ సైబర్ కేటుగాడు సోషల్ మీడియాలో తనను సీజేఐగా పరిచయం చేసుకొని డబ్బులు అడగిన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాను సీజేఐని అని, క్యాబ్ ఛార్జీల కోసం తనకు రూ.500 పంపాలని మోసపూరిత మెసేజ్ పెట్టాడు.
* కొత్తగా పెళ్లైన వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. (Doctor Dies By Suicide) డాక్టరైన భర్త తనను వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల ప్రతీక్షా భూసారే, ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నది. ఈ ఏడాది మార్చి 27న రష్యాలో ఎంబీబీఎస్ చదివిన వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. అయితే ఆదివారం తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నాడని నిందిస్తూ ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. తనను అనుమానించడంతోపాటు మొబైల్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చెక్ చేసేవాడని, వరకట్నం కోసం డిమాండ్ చేస్తునట్లు ఆరోపించింది. మరోవైపు వైద్యురాలి భర్తపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సొంత ఆసుపత్రి ఏర్పాటు కోసం పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని తన కుమార్తెపై నిరంతరం ఒత్తిడి తెచ్చాడని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో వరకట్న మరణం, వైద్యురాలిని ఆత్మహత్యకు పురిగొల్పడం వంటి పలు సెక్షన్ల కింద ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా డాక్టర్ ఆత్మహత్య సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
* సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన కేసులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. షంషేర్‌గంజ్ ఎస్‌బీఐ మాజీ మేనేజర్ మధుబాబు, సందీప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షంషేర్‌గంజ్ ఎస్‌బీఐకి చెందిన ఆరు ఖాతాల నుంచి రెండు నెలల్లో రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బ్రాంచ్ మేనేజర్ మధుబాబు ఆరుగురు క్యాబ్, ఆటో డ్రైవర్లకు కరెంట్ అకౌంట్లు తెరిచినట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్ షోయబ్ అనే వ్యక్తి ఖాతాలు తెరిపించి ఖాతాదారులకు రూ.20 నుంచి రూ.30వేల వరకు, మధుబాబుకు కమీషన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కేసులోనే రెండ్రోజుల కిందట మహ్మద్ షోయబ్, అహ్మద్ బవజీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z