తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 71వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ఆదివారం నాడు నిర్వహించారు. గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “తెలుగుభాష పరిరక్షణ, పరివ్యాప్తికోసం ఏంచేద్దాం?” అనే అంశంపై చర్చించరు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా తానా సంస్థ గత 50 సంవత్సరాలగా విశేష కృషి చేస్తోందని అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తెలుగును వ్యావహారిక భాషగా మార్చడంలో ఎంతోమంది ఛాందసువాదులను ఒంటిచేత్తో ఎదుర్కొని, ఆ కృషిలో తన సర్వసాన్ని త్యాగంచేసిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులని కొనియాడారు. ఆయన జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకోవడం ముదావహమన్నారు. మాతృభాషను ఉన్నతస్థితిలో ఉంచడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో ప్రాధమిక స్థాయి వరకైనా తెలుగును నిర్భందం చెయ్యాలన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగువారు సాధించిన జ్ఞానం విజ్ఞానం, అనుభవసారం అంతా తెలుగుభాషలోనే నిక్షిప్తమై ఉందన్నారు. భారతీయ భాషాశాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షులు ఆచార్య డా. గారపాటి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భాషమీద ఆధారపడి 87% ఉత్పత్తులు, అమ్మకాలు, కొనుగోళ్ళ వ్యవహారాలు జరుగుతున్నాయని, భాషా వినియోగంతోనే ఆర్ధిక ఆలంబన ఉందని, తెలుగుభాషా మాధ్యమం అమలు జరగకపోతే భవిష్యత్త్ లో భాషా సంక్షోభం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య డా. మాడభూషి సంపత్ కుమార్ కార్పోరేట్ విద్యావిధానం ద్వారా మాతృభాషకు ముప్పు ఏర్పడిందని, మాతృభాషను నిలబెట్టుకోవడానికి ప్రజా ఉద్యమాలు అవసరం అన్నారు. తెలుగుభాషోధ్యమ నాయకులు డా. సామల రమేష్ బాబు మాట్లాడుతూ పట్టణాలతో పాటు గ్రామాలలో నివసిస్తున్న ప్రజల్లోకి తెలుగు భాషోధ్యమాన్ని తీసుకువెళ్ళడంలో గిడుగు కృషిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పూర్వ డిప్యూటీ కలెక్టర్ డా. నూర్ భాషా రహంతుల్లా ప్రాథమిక స్థాయిలో తెలుగుమాధ్యమం తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని, న్యాయవ్యవస్థలో తీర్పులు తెలుగులోనే ఉండాలని అన్నారు. డా. గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తులు, వ్యవస్థల ద్వారానే భాషా పరిరక్షణ సాధ్యమని, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఉర్దూభాష మాదిరిగానే తెలుగుభాష కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ ద్వారా విదేశీయులకు తెలుగు శిక్షణ ఇస్తున్న ఆచార్య డా. కటికనేని విమల మాట్లాడుతూ ముందుగా భాషాతర్కాన్ని అర్ధం చేసుకోవాలని, కేవలం తెలుగు మాట్లాడమే గాకుండా రాయడం కూడా నేర్చుకోవాలన్నారు. ఆచార్య విమల దగ్గర మూడు సంవత్సరాలగా తెలుగును నేర్చుకుంటున్న విదేశీ వనిత యానా రెమిల్లార్డ్ మల్లవరపు తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరచారు. నిజాం కళాశాల తెలుగు అధ్యాపకులు డా. చంద్రయ్య శివన్న మాట్లాడుతూ సామాజిక సమానత్వ విలువగా భాషా పరివ్యాప్తి జరగాలని, విద్యార్థులకు భాషపై పట్టును, వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొదించే విధంగా రూపకల్పన జరగాలన్నారు. తెలుగుభాషను సులువుగా నేర్చుకునేందుకు వీలుగా ‘ఈ – బుక్’, ‘యాప్స్’, ‘ఆన్లైన్ నిఘంటువులు’ లాంటివి రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాల సాంకేతిక నిపుణులు రహమానుద్దీన్ షేక్ అన్నారు. సురేష్ కొలిచాల మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవడంలో సరైన ప్రణాళికను అనుసరించకపోతే 22వ శతాబ్దంలో అంతరించబోయే 90% భాషల్లాగే తెలుగుభాష కూడా తన మనుగడను కోల్పోవచ్చని హెచ్చరించారు. అమెరికా దేశంలో స్థిరపడ్డ బిందు బచ్చు తనకు తెలుగుభాష పెద్దగా తెలియకపోయినా, మాతృదేశంలో ఉన్న బంధుమిత్రులతో మాట్లాడడానికి మాతృభాష చాలా అవసరం అని గుర్తించి, వివాహమై, పిల్లలు కల్గిన తర్వాత పట్టుదలతో తెలుగు నేర్చుకున్నానని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులోనే మాట్లాడడం ద్వారా ప్రవాసంలో మాతృభాషను నిలుపుకోవచ్చన్నారు. దుబాయిలో స్థిరపడిన ప్రశాంతి చోప్రా సభా ప్రారంభంలో సురేష్ కొలిచాల రచించిన “ఘనమైన మన భాష మన తెలుగు భాష” అనే పాటను గానం చేశారు. తెలుగు మాట్లాడం రాకపోయినా 400కు పైగా తెలుగు పాటలను అతి శ్రావ్యంగా పాడగల పోలాండ్ దేశానికి చెందిన 15 సంవత్సరాల జాక్ చెర్ట్లూర్ ‘బ్రోచేవారెవరురా’, ‘వేదం అణువణున నాదం’, తరలి రాదా తనై వసంతం’ మొదలైన పాటలను ఆలపించి ఔరా అనిపించాడు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z