* భారత మహిళల వద్ద నమ్మశక్యం కాని రీతిలో బంగారం, వెండి ఉందని బిలియనీర్ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ అన్నారు. ఈ విలువైన లోహాలకు భారత మహిళలు ఇచ్చే ప్రాధాన్యత తన ధృక్కోణాన్ని మార్చివేసిందని చెప్పారు. క్వాంటం ఫండ్‌ను ఏర్పాటు చేసిన రోజర్స్ అనతికాలంలోనే బిలియనీర్‌గా ఎదిగారు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పొరపాట్లు చేశానని 81 ఏండ్ల ఇన్వెస్టర్ గురూ, ఇన్వెస్టర్ గుర్తుచేసుకున్నారు. అత్యున్నత లోహాల్లో పెట్టుబడి పెట్టడం మేలని సూచించారు. తన పెట్టుబడుల జీవితంలో ఎన్నో తప్పులు చేశానని, కెరీర్‌లో పలు స్టాక్ మార్కెట్ మలుపులను కోల్పోయానని చెప్పారు. భారత మార్కెట్‌ను కూడా మిస్ అయ్యానని అన్నారు. ఇక జీవితంలో సంక్లిష్ట సమయాల్లో విలువైన లోహాలు మనల్ని ఆదుకుంటాయని పేర్కొన్నారు.
* డిజిటల్ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేసే వాళ్లం. తర్వాత యూపీఐ లైట్ అంటూ పిన్‌తో పని లేకుండా పోయింది. కొత్తగా ట్యాప్ అండ్ పే అంటూ గ్యాడ్జెట్స్‌తో పేమెంట్ చేసే సదుపాయాల్ని కొన్ని సంస్థలు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏకంగా వస్తువులతో పనిలేకుండా కేవలం ముఖ గుర్తింపు ఆధారంగా పేమెంట్ జరిపే సదుపాయం వచ్చేస్తోంది. అంటే ఇకపై పేమెంట్స్ చేయాలంటే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదన్నమాట. స్మైల్ పే (SmilePay) పేరిట కొత్త తరహా పేమెంట్ విధానానికి ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) శ్రీకారం చుట్టింది. దీంతో వినియోగదారుల ఫేస్ రికగ్నైజేషన్‌తో చెల్లింపులు చేయొచ్చు. అంటే స్మార్ట్‌ఫోన్, గ్యాడ్జెట్స్‌తో పనుండదు. కేవలం రెండు దశల్లోనే (two steps) ఈ చెల్లింపులు పూర్తి చేయొచ్చు. UIDAIకి చెందిన భీమ్ ఆధార్‌పేతో రూపొందించిన అధునాతన ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీనే ఈ స్మైల్‌పే.
* భారతదేశ కంపెనీలు ఒకదాని వస్తువులు మరొకటి కొనుగోలు చేస్తూ మద్దతుగా నిలవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు. దీని వల్ల కరోనా మహమ్మారి వంటి అవాంతరాలను ఎదుర్కోవచ్చన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వ్యాపారవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లూ దూసుకెళ్లాయి. సూచీలు వరుసగా లాభపడటం ఇది పన్నెండో రోజు. ప్రధానంగా ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం ఆరంభంలోనే 82,637.03 పాయింట్లతో జీవనకాల గరిష్ఠాల వద్ద (క్రితం ముగింపు 82,134.61) దాదాపు 500 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. తర్వాత లాభం కొంత తగ్గినప్పటికీ.. అదే ఒరవడి కొనసాగింది. చివరికి 231.16 పాయింట్ల లాభంతో 82,365.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 83.95 పాయింట్ల లాభంతో 25,235.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.86గా ఉంది.
* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆగస్టు నెలలో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ గణనీయంగా తగ్గింది. ఈ నెల ప్రారంభంలో(ఆగస్టు 2న) బ్యాంకింగ్ లిక్విడిటీ రూ.2.86 లక్షల కోట్లుగా ఉంది. ఇది ఆగస్టు 16న రూ.1.55 లక్షల కోట్లకు తగ్గింది. ఆగస్టు 28న లిక్విడిటీ రూ.0.95 లక్షల కోట్లకు తగ్గిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ గవర్నర్ బ్యాంకులకు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, బ్యాంకింగ్ లిక్విడిటీలో ఈ క్షీణత కొనసాగుతోంది. ఒకప్పుడు బ్యాంకులపై ఆధారపడే వ్యక్తులు ఎక్కువగా క్యాపిటల్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాలపై మొగ్గు చూపుతున్నారని..దీనివల్ల బ్యాంకు డిపాజిట్లలో వీరి వాటా గణనీయంగా తగ్గుతోందని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
* భారత్‌లో విదేశీ మారక నిల్వలు (Forex Reserve) జీవనకాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నెల 23తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 681.69 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ వెల్లడించింది. ఈ నెల 16తో ముగిసిన వారానికి 4.54 బిలియన్ డాలర్ల వృద్ధితో 674.66 బిలియన్ డాలర్లకు చేరిన ఫారెక్స్ నిల్వలు.. ఈ నెల 23తో ముగిసిన వారానికి మరో 7.02 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ పతనం కాకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నది. ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 5.98 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 597.55 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం రిజర్వు నిల్వలు 893 మిలియన్ డాలర్లు పెరిగి 60.9 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ఎస్డీఆర్‌లు 118 మిలియన్ డాలర్లు పుంజుకుని 18.45 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్‌లో భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు మూడు మిలియన్ డాలర్లు పెరిగి 4.68 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z