తెలుగుదేశం, జనసేన, బిజెపి తరపున కూటమి అభ్యర్థిగా కృష్ణాజిల్లా గుడివాడ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించిన రాము వెనిగండ్ల తన అమెరికా పర్యటనలో భాగంగా ఉత్తర కరోలిన రాష్ట్రంలోని షార్లెట్‌లో పర్యటించారు. ప్రవాసులు ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు, ఆయన తనయుడు నందమూరి హరికృష్ణల చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాము మాట్లాడుతూ ఎన్నారైల సత్కారం మరచిపోలేనిదన్నారు. జన్మభూమి ప్రగతికి తోడ్పాటును అందిస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివంటూ, తన గెలుపులో కూడా ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఏపీకి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఎన్నారైలు దీనికి కూడా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు గత ప్రభుత్వ దౌర్జన్యాలు, ఆక్రమణలు, అవినీతిని సహించలేక ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ ఎన్నారై టీడీపీ స్థానిక నాయకులు నితిన్ కిలారు, నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రమేష్ ముకుళ్ళ, బాలాజి తాతినేని, కిరణ్ కొత్తపల్లి, సతీష్ నాగభైరవ, మాధురి యేలూరి తదితరులు సమన్వయపరచారు. ఈ కార్యక్రమంలో లావు అంజయ్య చౌదరి, ఎన్నారై టీడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z