Devotional

యాదగిరిగుట్టకు తితిదే మాదిరి బోర్డు-NewsRoundup-Aug 30 2024

యాదగిరిగుట్టకు తితిదే మాదిరి బోర్డు-NewsRoundup-Aug 30 2024

* తాను రాసిన 12 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో కేవలం ఐదింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ దిల్లీ హైకోర్టును కోరారు. తనపై అనర్హత వేటు విషయంలో ఆమె కోర్టులో వాదనలు వినిపించారు. ఏసీఎల్‌ గాయం కారణంగా ఎడమ మోకాలు అస్థిరంగా ఉన్నట్లు మహారాష్ట్ర హాస్పిటల్‌ ఇచ్చిన ధ్రువీకరణ ఉందని ఆమె కోర్టుకు వెల్లడించారు. తాను ‘దివ్యాంగురాలి’ కేటగిరిలో రాసిన పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. తనకు 47శాతం వైకల్యం ఉందని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 శాతం దాటితే దివ్యాంగులుగా గుర్తిస్తారని వెల్లడించింది.

* రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ‘స్పీడ్‌’ ప్రాజెక్టులపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎకో, టెంపుల్‌ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. హెల్త్‌ టూరిజంను అభివృద్ధి చేయాలని చెప్పారు. హైదరాబాద్‌ బయట మరో జూపార్క్‌ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. తితిదే బోర్డు మాదిరే యాదగిరిగుట్ట టెంపుల్‌ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిలో పెండింగ్‌ పనుల వివరాలు, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు ఇవ్వాలని సూచించారు.

* భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉన్నదని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి సీఎం చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎక్స్‌వేదికగా స్పందించిన సీఎం రేవంత్‌.. ‘నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్టుగా కొందరు ఆపాదించారు. ప్రత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే నేను.. ఎప్పటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటా’ అని ట్వీట్‌ చేశారు.

* వెనుజువెలాలో (Venezuela) అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. రాజధాని కారాకస్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కరెంటు సమస్య (Power Outage) మొదలైంది. ఉదయం 4.50 నుంచి దేశంలో అనేక చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని.. ఇది విధ్వంసకారుల చర్యేనని (Electrical Sabotage) అధ్యక్షుడు నికోలస్‌ మడురో పేర్కొన్నారు. వెనుజువెలాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య కనిపించిందని సమాచారశాఖ మంత్రి ఫ్రెడీ నానెజ్‌ పేర్కొన్నారు. అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నామన్నారు. దీనిని అధిగమించేందుకు కేంద్రం మొత్తం క్రియాశీలంగా పనిచేస్తోందన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. దేశ ప్రజల శాంతి, సామరస్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరన్నారు.

* తన స్వార్థం కోసం నెలల పసిబిడ్డను ఎత్తుకొచ్చేశాడో వ్యక్తి. పాలు తాగే వయసులో ఆ బిడ్డను కన్న తల్లికి దూరం చేశాడు. ఎవరికీ దొరక్కుండా తనతో పాటు ఊరూరూ తిప్పాడు. 14 నెలల తర్వాత ఎట్టకేలకే పోలీసులకు చిక్కాడు. కానీ ఆ బిడ్డకేం తెలుసు.. తనను తల్లిదండ్రులకు దూరం చేసిన ఇతడేనని! ఇన్నాళ్లు తనని సాకినందుకు ఆ కిడ్నాపర్‌పైనే మమకారం పెంచుకున్నాడు. అమ్మానాన్న వద్దకు వెళ్లేందుకు మొండికేశాడు. విడదీసేందుకు ప్రయత్నిస్తే రోధించాడు. ఆ బిడ్డను అప్పగించే క్రమంలో సదరు కిడ్నాపర్‌ కూడా కంటతడి పెట్టుకున్నాడు. 90ల్లో విడుదలైన ఓ సినిమాను గుర్తుచేసిన ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.

* సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సింగరేణి కాలరీస్‌ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్‌లుగా క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు.

* పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. మరో 36 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తీరం దాటుతుందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కళింగపట్నంలో 8 సెం.మీ వర్షం నమోదైంది. రాగల 24గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.

* ఒకరిద్దరు మినహా కొత్త నటీనటులతో నూతన దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu). థియేటర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లోకి రానుంది. ‘‘కమిటీ కుర్రోళ్ళు’ సెప్టెంబరులోనే రాబోతున్నారు’ అంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది ఓటీటీ సంస్థ. విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబరు తొలి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలున్నాయి.

* హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో భారీగా అవకతవకలు జరిగాయని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. బీసీసీఐ నిధులను హెచ్‌సీఏ దుర్వినియోగం చేసిందని.. విచారణ జరిపించి అసోసియేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘అజహరుద్దీన్‌ హయాంలో జరిగిన అవినీతి ఇప్పుడున్న జగన్‌మోహన్‌ హయాంలోనూ కొనసాగుతోంది. హెచ్‌సీఏ పరిధిలోని క్లబ్బులన్నీ అవినీతి మయంగా మారాయి. సుప్రీంకోర్టు తీర్పును, గ్రామీణ క్రికెట్‌ను పట్టించుకోట్లేదు. హెచ్‌సీఏపై తెలంగాణ ఏసీబీ, సీబీఐకి ఫిర్యాదు చేశాం. హెచ్‌సీఏ అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.

* మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై (shivaji statue collapse) విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ(PM Modi) క్షమాపణలు తెలియజేశారు. ‘‘నేను ఇక్కడ దిగిన వెంటనే.. విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని వెల్లడించారు. ‘‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారు. నా తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నా. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదు’’ అని మోదీ మాట్లాడారు. ఈ రోజు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.

* జర్మనీ అధికారుల సంరక్షణలో ఉన్న చిన్నారిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ పేర్కొన్నారు. మూడున్నరేళ్ల పాపతో పాటు ఆమె తల్లిదండ్రులను త్వరగా భారత్‌కు రప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోందని, చట్టపరమైన ప్రక్రియలు చేపడుతోందని వెల్లడించారు. ముంబయికి చెందిన దంపతులు 2018లో ఉపాధి నిమిత్తం జర్మనీకి వెళ్లారు. అక్కడే వారికి పాప జన్మించింది. ఆ పాప ఆడుకుంటూ కింద పడిపోవడంతో ప్రైవేటు అవయవం వద్ద గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయం తీరు ఆధారంగా లైంగికదాడి జరిగి ఉండవచ్చని జర్మనీ అధికారులు అనుమానించారు. అయితే చిన్నారికి గాయం ప్రమాదవశాత్తూ అయ్యిందన్న తల్లిదండ్రుల వాదనను తోసిపుచ్చుతూ.. బెర్లిన్‌ (Berlin)లోని ఓ న్యాయస్థానం 2021 సెప్టెంబరులో పాప బాధ్యతలను పూర్తిస్థాయిలో జర్మనీ (Germany) అధికారులకు అప్పగించింది. 36 నెలలుగా చిన్నారి వారి వద్దే ఉంటోంది. అయితే, తల్లిదండ్రులు ఎప్పటిలాగే పాపను కలవొచ్చని తెలిపింది.

* దేశ రాజధాని దిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి పుల్‌ బంగశ్‌ హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత జగదీశ్‌ టైట్లర్‌పై (Jagdish Tytler) హత్య, ఇతర నేరాలపై అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్‌ సియాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయనపై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

* కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజిలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్‌, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు.

* మాజీ మంత్రి గల్లా అరుణకుమారి (Galla Arunakumari) స్వీయ చరిత్ర పుస్తకాన్ని తిరుపతిలోని అమరరాజా ఆడిటోరియంలో ఆవిష్కరించారు. దాదాపు వేయి పేజీలు కలిగిన పుస్తకంలో అసమానతలు, స్త్రీ-పురుష వివక్ష, సంస్కృతుల మధ్య తేడాలను కళ్లకు కట్టేలా వివరించారు. ఈ పుస్తకం ఉమ్మడి ఏపీ ఆర్థిక, రాజకీయాలను ప్రతిబింబించే డాక్యుమెంట్‌లా ఉందని ప్రముఖ రచయిత్రి ఓల్గా ప్రశంసించారు. నేటి యువతకు స్వీయచరిత్ర మార్గదర్శకంగా ఉంటుందని ప్రముఖులు కొనియాడారు. స్వీయ చరిత్రలో తనతో కలిసి ప్రయాణించిన వారందరినీ ప్రస్తావించినట్లు అరుణ తెలిపారు. ఈ పుస్తకం భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడేలా రాసినట్లు వెల్లడించారు. పరిస్థితులను యదార్థ సంఘటనలు ప్రస్తావించాలనే తప్ప ఎవర్నీ కించపరచలేదని అరుణ స్పష్టం చేశారు.

* అధికారంలోకి వస్తే అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తానని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ (Kamala Harris) హామీ ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత ఆమె తొలిసారి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికన్ ప్రజలు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దేశం కోసం కొత్త మార్గాన్ని నిర్దేశించాలని నిర్ణయించుకున్నానని, అధికారంలోకి వస్తే కేబినెట్‌లోకి రిపబ్లికన్లను తీసుకుంటానని హారిస్ ప్రకటించారు.

* పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో 2 నెలల్లో పూర్తిచేస్తామని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ప్రకటించారు. అక్టోబర్‌ చివరినాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. బైపాస్ పూర్తైతే ట్రాఫిక్ కష్టాలతో పాటు రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుందని స్థానికులు భావిస్తున్నారు. బైపాస్‌ రోడ్డు చిలకలూరిపేటకు మణిహారంలా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

* ‘పుష్ప 2’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 06న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా గురించి నిర్మాత‌ను మీడియా ప్ర‌శ్నించ‌గా.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు నిర్మాత‌. ఆరు నూరైనా పుష్ప 2 వ‌చ్చేది డిసెంబ‌ర్ 06వ‌ తేదీనే. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో పుష్ప 2 ఫ‌స్ట్ ఆఫ్ ఎడిటింగ్ అయిపోతుంది. అక్టోబ‌ర్‌లో 06 వ‌ర‌కు సెకండ్ ఆఫ్ ఎడిటింగ్ ప‌నులు అయిపోతాయి. నవంబ‌ర్ 20 వ‌ర‌కు కాపీ ఇచ్చేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా పంపిణీ చేయాలని ప్లాన్ ఉంది. న‌వంబ‌ర్ 25 క‌ల్లా సెన్సార్ కూడా చేయిస్తాం అంటూ ర‌విశంక‌ర్ వెల్ల‌డించాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z