* జపాన్ పేరు వినగానే మనకు అక్కడి శ్రామిక శక్తి గుర్తొస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలను నేలమట్టం చేసినా, పట్టుదలతో ముందడుగు వేస్తూ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడి ప్రజలు ఎంతో క్రమశిక్షణగా ఉంటూ, దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. తాజాగా జపాన్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని జపాన్ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో కొంత కాలానికి జపాన్ వెనుకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కేవలం 8శాతం సంస్థలే దానిని అనుసరించాయి. మిగిలిన సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వారానికి నాలుగుసార్లు మాత్రమే పని చేయించుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చని వివరించింది. ఈ విధానంతో నిరుద్యోగిత రేటు కొంతైనా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అంతే కాకుండా తక్కువ పని దినాలు ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది.
* స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) శనివారం తన తల్లితో కలిసి ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ నటుడు రిషబ్‌శెట్టి కూడా ఎన్టీఆర్ వెంట ఉన్నారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్ పంచుకుంటూ.. ‘అమ్మ ఎప్పుడూ నన్ను తన సొంతూరు కుందాపురాతో పాటు, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనానికి వెళుదామని అడుగుతుంటుంది. ఇప్పుడు ఆమె కల నెరవేరింది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి ఇదే. విజయ్ కిరంగదూర్ సర్ (హోంబలే ఫిలింస్ అధినేత).. మీకు ధన్యవాదాలు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే రిషబ్‌శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అని ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
* శ్రీవారి భక్తులకు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్న స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణిలోకి ఆదివారం నుంచి శ్రీవారి భక్తులకు అనుమతి.
* నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టారు. శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్‌చెరులో సుడిగాలి పర్యటన చేపట్టారు. స్థానిక సాకి చెరువును పరిశీలించారు. ఇక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు వద్ద తూములు బంద్ చేసి ఇన్‌కోర్ సంస్థ అపార్టుమెంట్ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అపార్టుమెంట్‌ను రంగనాథ్ పరిశీలించారు.
* ప్రస్తుతం జరుగుతున్న దిల్లీ ప్రిమియర్ లీగ్ (DPLT20)లో ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya) ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఇప్పటికే 57 (30), 82 (51), 53 (32), 45 (26), 107*(55), 88 (42), 24 (9)తో దుమ్మురేపిన ఈ 23 ఏళ్ల క్రికెటర్ తాజాగా మరో సెంచరీ బాదాడు. ఈ లీగ్‌లో సౌత్ దిల్లీ సూపర్‌స్టార్స్ తరఫున ఆడుతున్న ప్రియాన్ష్ శనివారం నార్త్ దిల్లీ స్ట్రైకర్స్‌పై చెలరేగి 50 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. మనన్ భరద్వాజ్ వేసిన 12 ఓవర్‌లో ఏకంగా ఆరు సిక్స్‌లు బాదేసి సంచలనం సృష్టించాడు. పవర్ పుల్ బ్యాటింగ్‌తో బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రియాన్ష్ రానున్న ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటే కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇతడు 2019లో అండర్-19లో ఇండియా-ఎ తరఫున ప్రస్తుతం భారత సీనియర్ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌తో కలిసి ఆడాడు.
* ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)కు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) క్షమాపణలు చెప్పారు. గతంలో ఒక అభిమాని ఫోన్ చేసినప్పుడు తాను ఏదో మూడ్‌లో ఉండి ఆయన గురించి నోరు జారి కొన్ని వ్యాఖ్యలు చేశానని ‘గబ్బర్‌సింగ్’ రీ రిలీజ్ (Gabbar Singh Re-Release) సందర్భంగా అన్నారు. ‘తీన్‌మార్ సరిగ్గా ఆడక నిరాశలో ఉన్నప్పుడు పవన్ మిమ్మల్ని పిలిచి గబ్బర్‌సింగ్‌కు అవకాశం ఇచ్చారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?’ అని విలేకరి ప్రశ్నించగా ఆయన ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
* తిరుమలలో శనివారం సాయంత్రం భారీ వృక్షం నేలకూలి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. శేషాద్రి నగర్ 305వ కాటేజీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన మహిళ చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి(44)గా గుర్తించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో తిరుమలలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని, భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.
* పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. మహిళా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం కైవసం చేసుకుంది. 10మీ.ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్‌లో 211.1 స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. జవాన్మార్డి సారె (ఇరాన్) 236.8 స్కోరుతో స్వర్ణం సాధించింది. తుర్కియోకు చెందిన 46 ఏళ్ల ఐసెల్ ఓజ్గాన్ (231.1) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. తాజాగా రుబీనా పతకం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. శుక్రవారం షూటింగ్‌లోనే అవని లేఖరా స్వర్ణం, మనీశ్ నర్వాల్ రజతం, మోనా అగర్వాల్ కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. మహిళల 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కాంస్యం గెలిచింది. మరోవైపు, బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 ఈవెంట్‌లో సుకాంత్ కదమ్, సుహాస్ యతిరాజ్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు.
* విజయవాడ(Vijayawada) నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో కొండ చరియలు విరిగిపడి ప్రొటోకాల్ ఆఫీస్, డోనర్ సెల్ ధ్వంసమయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఘాట్‌రోడ్‌లో పలు చోట్ల కొండచరియలు పడ్డాయి. ఆ ప్రదేశంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఇవాళ ఉదయం నుంచే ఘాట్‌రోడ్‌ను మూసివేశారు. మధ్యాహ్న సమయంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దుర్గగుడి సమీపంలోనే సమాచార కేంద్రం (ప్రొటోకాల్ ఆఫీస్) ఉంటుంది. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు విధుల్లో ఉంటారు. నలుగురు సిబ్బంది భోజనానికి వెళ్లిన సమయంలో బండరాళ్లు పడి ప్రొటోకాల్ ఆఫీస్ పూర్తిగా నేలమట్టమైంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
* తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు సీఎస్ పలు సూచనలు చేశారు. ‘‘ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కలెక్టరేట్లు, జీహెచ్‌ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. లోతట్టు, వరద ప్రాంతాలకు ప్రజలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలి. ఉద్ధృతంగా ప్రవహించే వాగుల వద్ద ఒక అధికారిని పెట్టి పర్యవేక్షించాలి. స్కూళ్లకు సెలవులపై పరిస్థితిని బట్టి కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలి. మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్యబృందాలను అప్రమత్తం చేయాలి. హైదరాబాద్‌లో మ్యాన్ హోళ్లు తెరవకుండా నిఘా పెట్టాలి’’ అని సీఎస్ తెలిపారు.
* జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్రపరిశ్రమను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేవలం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (AMMA)ను లక్ష్యంగా చేసుకోవద్దని ‘అమ్మ’ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ (Mohanlal) విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని. ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదేనన్నారు. అన్ని ప్రశ్నలకు ‘అమ్మ’ సమాధానం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. మలయాళ చిత్రపరిశ్రమ.. చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని, ఇందులో చాలామంది ఉన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయకండని విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇటీవలే ‘అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
* భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్‌ఆర్ నగర్‌లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది.
* రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదని ఆయన విమర్శించారు. చీమ కుట్టినట్లు అయినా మీకు లేదు. సిగ్గుచేటని, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి అన్నారు హరీష్ రావు. ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది గురుకులాల్లో జాయిన్ చేస్తే ఏం చేస్తున్నారని, ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. నువ్వు పూర్తిగా విఫలం అయ్యావంటూ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు రోడ్డు మీదకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంటే బాధ తెల్సుకోవాలని వచ్చానని, దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నారు. భయంతో వణికిపోతున్నారు. కర్రలు విరిగేలా కొడుతున్నారని ఏడుస్తున్నారన్నారు హరీష్ రావు. అన్నంలో, పప్పులో పురుగులు అంటే తినేసి తినండి అంటున్నారు అని బాధపడుతున్నారని, ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండో జత ఇవ్వలేదు అంటున్నారన్నారు హరీష్ రావు.
* షేక్ హసీనా వల్ల భారత్‌కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలోని ఢిల్లీలో ఉందని. . హోం మంత్రిత్వ శాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ నుండి ఏదైనా అభ్యర్థన వస్తే, షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపమని తాము భారత ప్రభుత్వాన్ని కోరవలసి ఉంటుందని పేర్కొన్నారు.
* గతంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. తప్పు చేయాలంటేనే ఎవరైనా భయపడేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో మహిళల రక్షణ చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సినీనటి రవళితో కలిసి ఈ రోజు శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన రోజా.. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తే మహిళల రక్షణ ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు.. గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తప్పు చేయాలంటే ఎవరైనా భయపడే వారని.. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ నుంచి వరుసగా ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయిస్తూ ఉన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయిస్తున్న ప్రజా ప్రతినిధులకు ప్రజలలో గౌరవం దక్కదని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉందో గుర్తు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.
* గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల్లో జరిగిన ఘటనను ఉద్దేశించి పూనమ్ కౌర్ స్పందిస్తూ అమ్మాయిలకు మద్దతుగా పూనమ్ “ప్రియమైన అమ్మాయిలారా, మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ వ్రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో మరియు నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల వల జరిగిన పరిస్థితులు చాలా దారుణం, కానీ విద్యార్థి సంఘాలు మరియు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను. చట్టం బలహీనులకు బలంగా మరియు బలవంతులకు బలహీనంగా వర్తించబడుతుంది అనే నానుడి మన దేశంలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలలో గుర్తుకు తెచ్చాయి. “నేరస్థులు ఎలా రక్షించబడతారు మరియు బాధితులు ఎలా అవామీ = అవమానింప బడతారు” అనేది నాకు బాగా అనుభవం. అటువంటి చర్యలతో నేను మానసికంగా అలసిపోయాను. కాలేజీలు డిగ్రీ సర్టిఫికెట్లను రద్దు చేసి స్టూడెంట్స్ ను బయటకు పంపిన సంఘటనలు ఇక్కడ అనేకం ఉన్నాయి. వ్యక్తులు ఎంత శక్తివంతమైన వారైనా, వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు వదలకండి. నేను మీకు ” రెజ్లర్స్ నిరసనను మాత్రమే గుర్తు చేయగలను, ఇక్కడ కూడా అమ్మాయిలు తమ కోసమే కాకుండా మనందరికీ తెలియని చాలా మంది ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. ఒక అమ్మాయి చాలా మంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం అనేది నాకు అసహ్యం కలిగిస్తుంది. నేరస్తులకు ఎంతటి శక్తిమంతులైనా సహకరిస్తున్నా, ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. సలహాలు ఇవ్వడం సులువు కానీ దాన్ని అమలు చేయడం కష్టం అది నాకు తెలుసు కానీ ఈ మాటలు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న ఇతరులకు కూడా బలాన్ని ఇస్తుంది. ప్రేమ మరియు అభినందనలతో మీ పూనమ్ కౌర్. కూతురిగా, చెల్లిగా మీరు చూడాలనుకుంటున్న మార్పు కోసం పోరాడండి ” అంటూ గాంధీ కోట్ ను జతచేస్తూ ‘X ‘లో పోస్ట్ చేసింది పూనమ్ కౌర్.
* కలుషిత ఆహారం తిని, పిల్లలు, అస్వస్థతకు గురవుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రెండు నెలల్లో పది ఘటనలు జరిగాయని గుర్తుచేశారు.ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. సంబంధిత అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం పిల్లల విషయంలో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని మండిపడ్డారు.ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులు సీసీ కెమెరాలు పెట్టారని, ఆరోపిస్తుంటే దీనిపైన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి.. పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యం ఇచ్చామని.. తెలుగు మీడియం తీసివేయలేదని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అమ్మఒడి పైసలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో నాడు – నేడులో అనేక పనులు చేపట్టామని తెలిపారు. మిగిలిన పనులు కూడా ఈ ప్రభుత్వం చేయాలని కోరారు. విద్య మీద ఖర్చుపెట్టి ప్రతి పైసా కూడా రేపు భవిష్యత్తు కోసమేనని చెప్పారు. ఫార్మా క్షతగాత్రులకు, పార్టీ తరపున, ప్రకటించిన పరిహారం రెండు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల అస్వస్థతపై కఠినమైన చర్యలు తీసుకొని, ఒక ఎస్ఓపీని అమలు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z