Movies

సారీ…హేమ కమిటీ గురించి నాకు తెలీదు-NewsRoundup-Sep 01 2024

సారీ…హేమ కమిటీ గురించి నాకు తెలీదు-NewsRoundup-Sep 01 2024

* రష్యా తూర్పు ప్రాంతంలో 22 మందితో ప్రయాణిస్తూ.. అదృశ్యమైన హెలికాప్టర్‌ (Russian Helicopter) కథ విషాదాంతమైంది. అది కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతానికి సమీపంలో 900 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు. అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు చెప్పారు.

* హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Committee Report) గత కొన్నిరోజులుగా మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నివేదికను ఉద్దేశించి ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty) స్పందించారు. తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. షూటింగ్‌ ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కలిగించేందుకు నివేదికలో చేసిన సూచనలను స్వాగతిస్తున్నా అని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.

* రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin).. ఉత్తర కొరియా (North Korean) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un)లు బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడాన్ని తరచూ చూస్తుంటాం. తాజాగా పుతిన్‌ మరోసారి కిమ్‌కు గిఫ్ట్‌లను పంపించారు. మేలిమి జాతికి చెందిన 24 గుర్రాలను కిమ్‌కు బహుకరించారు. ఉక్రెయిన్‌ (Ukraine war)తో యుద్ధం వేళ ఉత్తర కొరియా నుంచి ఆయుధాలను సరఫరా చేసినందుకు కృతజ్ఞతగా ఈ రిటర్న్‌ గిఫ్ట్‌ను పంపినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.

* భారీ వర్షాల కారణంగా సూర్యాపేట వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 65)పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి – అద్దంకి, ఖమ్మం వైపు దారి మళ్లిస్తున్నారు. కోదాడ – రామాపురం చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఒక్కవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. హుజూర్‌ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.

* ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాజా టోల్‌గేట్‌, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందన్నారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టామన్నారు.

* జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ (justice hema committee report)తో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ నటీ నటులందరూ మలయాళ ఫిల్మ్‌ ఇండస్ట్రీ (malayalam film industry) గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లైంగిక వేధింపులు అంతటా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే పలువురు నటీనటులు మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మహిళల రక్షణకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నివేదికపై స్పందించమని తాజాగా మీడియా అగ్ర నటుడు రజినీకాంత్‌ (rajinikanth)ని సంప్రదించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘దాని గురించి నాకు తెలియదు సారీ’’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. గత కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారిన విషయం తనకు తెలియదనడం గమనార్హం అని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

* కుండపోత వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం నగరంలో బీభత్సం సృష్టించింది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్‌ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకుంది. చిక్కుకున్నవారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు. వరద చుట్టుముట్టిన ఇంటి నుంచి రక్షించాలని బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వెంకటేశ్వరనగర్‌లో ఓ ఇంటిని మున్నేరు వరద చుట్టుముట్టింది. ఏడుగురు బాధితులు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గణేశ్‌నగర్‌, దానవాయిగూడెం ప్రాంతాల్లోనూ చాలా ఇళ్లు నీట మునిగాయి.

* హైదరాబాద్‌లోని పాతబస్తీలో భాజపా పాగా వేయడం ఖాయమని, ఎంఐఎంను ఆనవాళ్లు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్లో శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల భాజపా సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతోందన్నారు. త్వరలో కాంగ్రెస్‌లో భారాస విలీనమవుతుందని పేర్కొన్నారు.

* వైకాపా నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. శనివారం వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. పెండ్లిమర్రి మండలం మాచునూరుకు చెందిన వైకాపా మండల సమన్వయకర్త, మాజీ సర్పంచి మాచునూరు చంద్రారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. జగన్‌ ఆయన ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గొందిపల్లెకు చేరుకుని ఇటీవల వివాహమైన కడప మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్‌ చంద్రహాసరెడ్డి కుమార్తె ఆశారెడ్డి, అల్లుడు శివారెడ్డి దంపతులను ఆశీర్వదించారు.

* భారీ వర్షాల కారణంగా ఆత్మకూరు-డోర్నాల, డోర్నాల-శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గాల్లో పలుచోట్ల రహదారిపై చెట్లు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపేశారు. భారీ వర్షాల కారణంగా ఆత్మకూరులో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక్కడి సాయిబాబా నగర్‌, ఇందిరానగర్‌, ఏకలవ్య నగర్‌, రహమత్‌ నగర్‌, లక్ష్మీనగర్‌లోకి వరద చేరింది. ఏకలవ్యనగర్‌లో 30కిపైగా ఇళ్లలోకి నీరు చేరింది. భవనాశి వాగు పొంగడంతో ఆత్మకూరు-కొత్తపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు-దుద్యాల, ఆత్మకూరు-వడ్లరామాపురం మధ్య రాకపోకలు ఆగిపోయాయి. గుండ్లకమ్మ వాగు పొంగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

* రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో నిన్నటి నుంచి విపరీతంగా వర్షం కురుస్తోందని, ఎక్కడ సమస్యలు లేకుండా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటాన్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ అమ్రపాలి తెలిపారు.

* తెలంగాణలో భారీ వర్షాలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా వరద పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, పట్టణంలోని ఇతర భవనాలపై 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు వివరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z