DailyDose

₹12కోట్ల విలువైన ఐఫోన్ల చోరీ-CrimeNews-Sep 02 2024

₹12కోట్ల విలువైన ఐఫోన్ల చోరీ-CrimeNews-Sep 02 2024

* మధ్యప్రదేశ్‌లో భారీ చోరీ జరిగింది. సాగర్‌ జిల్లాలో ఓ కంటైనర్‌ ట్రక్కు నుంచి దాదాపు 1,500లకు పైగా ఐఫోన్లను దుండగులు చోరీ చేశారు. ఆ ట్రక్కు హరియాణా నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ అయిన ఐఫోన్ల విలువ రూ.11-12కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 15న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్‌ నుంచి బయల్దేరిన ట్రక్కు మధ్యప్రదేశ్‌లోకి రాగానే కొందరు దుండగులు దానిపై దాడి చేశారు. డ్రైవర్‌కు మత్తుమందు ఇచ్చి, అతడిని బంధించి ట్రక్కులోని ఐఫోన్లను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. స్పృహలోకి వచ్చిన డ్రైవర్‌ చోరీని గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ట్రక్కులో ఉన్న సెక్యూరిటీ గార్డును ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. డ్రైవర్‌ ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయకుండా అలసత్వం ప్రదర్శించిన ముగ్గురు పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

* రెండు వేర్వేరు ఘటనల్లో 786 కిలోల గంజాయిని పట్టుకున్నామని, నలుగురిని అరెస్టు చేశామని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్‌ కార్యాలయంలో ఆయన తెలిపిన ప్రకారం.. శనివారం చింతపల్లి మండలం బలపం పంచాయతీ ఇటుకబెడ్డలు గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు చేపట్టగా 370.7 కిలోల గంజాయి దొరికింది. తిమురు సోమలింగం, తిమురు అప్పారావులను నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామ శివారులో ఆదివారం ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. కొద్ది సమయానికి అదే మార్గంలో వస్తున్న కారులోంచి ముగ్గురు దిగి పారిపోయారు. ఆ వాహనంలో 415.3 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసుల అదుపులో ఉన్న గెమ్మెలి శ్రీను, కొర్రా రాజులు.. తాము గంజాయితో ఉన్న కారుకు పైలట్‌గా వచ్చామని ఒప్పుకొన్నారు. రెండు ఘటనల్లో పట్టుబడిన గంజాయి విలువ రూ.38.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

* దేశవ్యాప్తంగా గత ఏడాదిగా సైబర్‌ నేరాలు విపరీతంగా పెరగుతున్నాయి. ఆన్‌లైన్‌ వేదికగా చెలరేగుతున్న సైబర్‌ నేరగాళ్లు అమాయకులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ వృద్ధురాలు తన క్రెడిట్ కార్డ్‌ అన్‌లాక్‌ చేసే క్రమంలో స్కామర్ల చేతిలో మోసపోయారు. ఈ ఆన్‌లైన్‌ స్కామ్‌లో ఆమె ఏకంగా రూ. 72 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితురాలికి ఆర్‌బీఐ అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. భద్రతా కారణాలతో ఆమె క్రెడిట్‌ కార్డు బ్లాక్ అయిందని నిందితుడు ఆమెను నమ్మబలికాడు. ఆపై వృద్ధురాలు తన కార్డును అన్‌బ్లాక్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రక్రియలో స్కామర్లు ఆమె బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 72 లక్షలు కాజేశారు. ఆగస్ట్‌ 23న ఓ వ్యక్తి నుంచి ఆమె ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకున్నారు. తాను ఆర్బీఐ అధికారినని స్కామర్‌ పరిచయం చేసుకుని బాధితురాలి క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ అయిందని నమ్మబలికాడు. ఆపై సీబీఐ అధికారి అంటూ మరో వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. ఆమెపై మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదైందని భయపెట్టాడు. ఫేక్‌ ఎఫ్‌ఐఆర్‌ కాపీలను చూపి బెదిరించారు. విచారణ పేరుతో ఆమె బ్యాంకు ఖాతా వివరాలను రాబట్టారు. నిందితులను నమ్మిన వృద్ధురాలు వారు అడిగిన కీలక సమాచారం ఇవ్వడంతో ఆమె ఖాతాల నుంచి రూ. 72 లక్షలు తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

* ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ఆరో రోజుల కిందట పుట్టిన నవజాత శిశువుకు పాలు ఇస్తున్న సందర్భంగా గొంతు నొక్కి చంపింది. (Woman Strangles Newborn To Death) తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నాలుగో కాన్పులో కూడా ఆడ పిల్ల పుట్టడంతో సమాజం నుంచి హేళన భరించలేక పసిపాపను హత్య చేసినట్లు చివరకు ఒప్పుకున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం తెల్లవారుజామున ఫోన్‌ కాల్ వచ్చింది. ఆరు రోజుల బిడ్డ కనిపించడం లేదని 28 ఏళ్ల శివాని ఫిర్యాదు చేసింది. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యిన తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు ఆమె తెలిపింది. గత రాత్రి బిడ్డకు పాలిచ్చి పడుకోబెట్టానని, నిద్ర లేచి చూసేసరికి పక్కన పాప లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అదృశ్యమైన పసి బిడ్డ కోసం పోలీసులు వెతకసాగారు. అయితే కుట్లు తీయడానికి ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులతో శివాని చెప్పింది. ఒకపక్క బిడ్డ కనిపించకపోయినా ఆసుపత్రికి వెళ్తానని ఆ మహిళ అనడంతో పోలీసులు కాస్త అనుమానించారు. అయితే వైద్య పరిస్థితి నేపథ్యంలో ఆమెను అడ్డుకోలేదు. మరోవైపు అదృశ్యమైన పసిపాప కోసం పోలీసులు వెతికారు. ఎదురింటి రూఫ్‌పై ఒక బ్యాగ్‌ కనిపించింది. దానిని తెరిచి చూడగా పసిపాప అందులో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z