* సెన్సార్ బోర్డ్‌ను విమర్శిస్తూ.. ఓటీటీలపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని చట్టం ఏంటంటే.. ఓటీటీలో అయితే ఎటువంటి సెన్సార్ ఉండదు. అనూహ్యమైన హింసను, అశ్లీలతను ప్రదర్శించవచ్చు. రాజకీయంగా పలుకుబడి ఉంటే నిజజీవిత సంఘటనలను కూడా వక్రీకరించి సినిమాలు తీయొచ్చు. ఓటీటీల్లో అంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛలో కొంచెం కూడా మాలాంటి వాళ్లకు ఉండదు. అందుకే భారతదేశ సమగ్రత, ఐక్యత చుట్టూ తిరిగే చిత్రాలను తీయడానికి మాకు అనుమతి ఉండదు. కొన్ని చిత్రాలు తీయడానికి మనలో కొంతమందికి మాత్రమే సెన్సార్‌షిప్ ఉంది. ఇది అన్యాయం’ అని పేర్కొన్నారు. తాను ఆత్మగౌరవంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. సెన్సార్‌బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే తాను కోర్టులో పోరాడటానికైనా సిద్ధమేనన్నారు.
* కాపాడగలిగి కూడా ఓ వ్యక్తి ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఘటన యూపీలో చోటు చేసుకొంది. అది కూడా ఓ ఉన్నతాధికారికి ఈ పరిస్థితి రావడం గమనార్హం. యూపీలోని ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆదిత్య వర్థన్ సింగ్ శనివారం బిల్‌హౌర్లోని నానమౌ వద్ద గంగానది ఘాట్‌లో సూర్యుడిని ఆరాధిస్తూ పుణ్యస్నానానికి దిగాడు. తన స్నేహితులు ఫొటోలు తీస్తుండటంతో కొంత దూరం నదిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన వార్నింగ్ మార్క్‌ను కూడా దాటేశాడు. అతడికి ఈత బాగానే వచ్చినా..ప్రవాహం తీవ్రంగా ఉండటంతో తట్టుకొలేక నదిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న ఆదిత్య మిత్రులు అక్కడే ఉన్న ప్రైవేటు గజఈతగాళ్ల వద్దకు వెళ్లి.. ఆదిత్యను రక్షించాలని కోరారు. వారు రూ.10,000 చెల్లిస్తేగానీ నదిలోకి దిగమని మొండికేశారు. తమ వద్ద అంతమొత్తం నగదు రూపంలో లేదని చెప్పినా వినలేదు.. యూపీఐలో చెల్లించాలన్నారు. దీంతో అతడి మిత్రులు చెల్లింపులు చేసేసరికి.. ఆదిత్య ప్రవాహంలో గల్లంతైపోయాడు.
* చిన్నారులు టీవీలు, డిజిటల్ మీడియాల ముందు గంటల కొద్దీ గడుపుతుండటం వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీంతో వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు స్వీడన్ దేశం తాజాగా సూచనలు జారీ చేసింది. రెండేళ్ల లోపు చిన్నారులను టీవీలు, డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచాలని తలిదండ్రులకు ఆ దేశ ఆరోగ్య శాఖ మార్గ దర్శకాలు జారీ చేసింది.
* విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో వరద బాధితులకు డ్రోన్ ద్వారా ఆహార పంపిణీ సత్ఫలితాలనిస్తోంది. సహాయ చర్యలపై విభాగాలవారీగా అధికారులకు మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు అప్పగించారు. అధికారులు తమకు అప్పగించిన బాధ్యతను ఏమేరకు పూర్తి చేశారన్న విషయమై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగరంలో నీటమునిగిన రవినగర్, వాంబేకాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో ఎంఐ-17 హెలీకాప్టర్ ద్వారా 3వేల కిలోలు, ఎఎల్-హెచ్ ద్వారా 2వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు జారవేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆహారాన్ని తెప్పించి.. బాధితులకు చేరవేసే బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి వీరపాండ్యన్‌కు అప్పగించారు. పొరుగు జిల్లాలైన బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలను పంపించాలని టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఆదేశించారు.
* నాగార్జున సాగర్ జలాశయం భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5.41 లోల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోందని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వరద ఉద్ధృతిని అంచనా వేస్తున్నారు.
* ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ఓవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరోవైపు పలు సంస్థలు తమవంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. విజయవాడ వరద బాధితులకు ఈ విపత్కర సమయంలో దివీస్ సంస్థ చేయూతను అందించింది. రోజూ 1.70లక్షల మందికి ఆహారం అందిస్తోంది. అక్షయపాత్ర ద్వారా ఆహారం అందిస్తున్నట్లు దివీస్ ఎండీ మురళీకృష్ణ వెల్లడించారు. సుమారు రూ.2.5కోట్ల అంచనా వ్యయంతో ఐదు రోజులపాటు ఈ సాయం కొనసాగుతుందని తెలిపారు.
* భారీ వర్షాలకు విజయవాడలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ బాధిదులకు భరోసా ఇస్తున్నారు. జక్కంపూడి, సితార సెంటర్‌లో జేసీబీ ఎక్కి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
* ప్రముఖ పంజాబీ గాయకుడు ఏపీ ధిల్లాన్ (AP Dhillon) నివాసం వెలుపల కాల్పులు కలకలం సృష్టించాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన నిందితుడి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..కెనడా (Canada) వాంకోవర్‌లోని విక్టోరియా ఐలాండ్‌లో ధిల్లాన్ నివాసం వెలుపల కాల్పులు జరిగినట్లు సమాచారం. గత రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లార్సెన్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్ చిత్రానికి గానం చేసినందునే ధిల్లాన్ నివాసంపై కాల్పులు జరిపినట్టు సమాచారం. అతడు రాత్రి వేళ ఓ నివాసం వెలుపల కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తోన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే.. అది ఎక్కడో కచ్చితమైన సమాచారం లేదు. కానీ, గాయకుడి నివాసం సమీపం నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా.. కెనడాలోని మరో ప్రాంతంలోనూ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
* వరద బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మంత్రులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో మంత్రులంతా ప్రజల వద్ద ఉండాలని, పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘‘పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం.. నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారం ఇస్తాం. విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తాం’’ అన్నారు.
* భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా నందిగామ మండలంలో మున్నేరు వరద తగ్గడంతో పోలీసులు ఐతవరం వద్ద వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. ఐతవరంలో నిలిచిన వాహనాలను పోలీసులు దగ్గరుండి పంపిస్తున్నారు. విజయవాడ- హైదరాబాద్ హైవేపై వాహనాలను అనుమతిస్తున్నారు.
* లఖ్‌నవూ (Lucknow) సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి పొరుగు గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. నాలుగు నెలల క్రితం ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారి వివాహాం చట్టపరంగా చెల్లుబాటు కాకపోవడంతో వివాదాలు తలెత్తాయి. దీంతో ఆమెను విడిచి యువకుడు వెళ్లిపోయాడు. భర్త వదిలేశాడని ఆ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఊరి వేసుకునే ముందు తాను ఎందుకు చనిపోవాలనుకుంటుందో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కొద్ది సమయంలోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే దీని గురించి డీజీపీ కార్యాలయానికి మెటా ఏఐ అలర్డ్ జారీ చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిమిషాల వ్యవధిలో ఆమె గ్రామాన్ని గుర్తించి పోలీసు బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. యువతి ప్రాణాలను కాపాడారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z