Movies

కోటి రూపాయిలు విరాళం ప్రకటించిన ఎన్‌టీఆర్-NewsRoundup-Sep 03 2024

కోటి రూపాయిలు విరాళం ప్రకటించిన ఎన్‌టీఆర్-NewsRoundup-Sep 03 2024

* నటుడు ఎన్టీఆర్‌(NTR) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని నావంతుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను’ అని తెలిపారు.

* భారీ వర్షాలు మిగిల్చిన విలయం నుంచి ప్రజలను ఆదుకోవడమే సంకల్పంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కాన్వాయ్ వదిలి జేసీబీపైనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితులను సీఎం పరిశీలిస్తున్నారు. ఆహారం అందుతుందా? లేదా? అని స్వయంగా ఆయనే బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. అందరినీ ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

* భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు.

* కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కడప స్టీల్‌ప్లాంట్‌పై ఏమాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తోందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తిచేయాలని వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌కు ఆమె వినతిపత్రం అందజేశారు. మాజీ సీఎం జగన్‌ గత ఏడాది స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసినా దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. పరిశ్రమ ఏర్పాటుపై కాంగ్రెస్‌ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. ముంబయి నటి కాదంబరి జత్వానీ వ్యవహారంపైనా షర్మిల స్పందించారు. ఈ విషయంలో జగన్‌పై పలు విమర్శలు చేశారు. ఆమెను ఎలా కట్టడి చేయాలో జగన్‌, సజ్జన్‌ జిందాల్‌ ప్లాన్‌ చేశారని ఆరోపించారు.

* తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ సంచాలకులు ప్రకటించారు. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.

* అవాంఛిత ఫోన్‌ కాల్స్ విషయంలో అన్‌ రిజిస్టర్డ్‌ టెలీ మార్కెటర్లపై ట్రాయ్‌ (TRAI) తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా 2.75 లక్షల మొబైల్‌ నంబర్లను టెలికాం కంపెనీలు బ్లాక్‌ చేశాయి. మరో 50 సంస్థలనూ నిషేధిత జాబితాలో చేర్చాయి. అన్‌రిజిస్టర్డ్‌ టెలీమార్కెటర్లపై చర్యలు తీసుకోవాలన్న ట్రాయ్‌ ఆదేశాల మేరకు టెల్కోలు ఈ చర్యలు చేపట్టాయి. ఈ మేరకు ట్రాయ్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

* ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయి.

పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో.. బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్‌ తారామతిపేట పంచాయతీలు విలీనం
శంషాబాద్ మున్సిపాలిటీలో.. బహదూర్‌గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ విలీనం
నార్సింగి మున్సిపాలిటీలో.. మీర్జాగూడ గ్రామపంచాయతీ
తుక్కుగూడ మున్సిపాలిటీలో.. హర్షగూడ గ్రామపంచాయతీ
మేడ్చల్ మున్సిపాలిటీలో.. పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతీలు
దమ్మాయిగూడ మున్సిపాలిటీలో.. కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి
నాగారం మున్సిపాలిటీలో.. బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు
పోచారం మున్సిపాలిటీలో.. వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం
ఘట్‌కేసర్‌ మున్సిపాల్టీలో.. అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనం
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో.. మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు
తూంకుంట మున్సిపాలిటీలో.. బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం

* తెలంగాణలో విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్‌ ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్‌ ఏర్పాటు చేయనున్నారు. కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులను త్వరలో నియమించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విద్యాకమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

* టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ సంచలనం సృష్టించింది. నిరసనలు, అల్లర్లతో తమ దేశం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో.. స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. పాక్‌పై బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌ నైట్ స్కోరు 42/0తో (రెండో ఇన్నింగ్స్‌) మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది. ఓపెనర్లు జకీర్‌ హసన్‌ (40), షాద్మాన్‌ ఇస్లామ్ (24), నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్ (34), ముష్పీకర్‌ రహీమ్ (22*), షకీబ్‌ అల్ హసన్ (21*) రాణించారు. పాక్‌ బౌలర్లలో మీర్ హంజా, షాజాద్, అబ్రార్ అహ్మద్, ఆఘా సల్మాన్‌ తలో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ 274 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో లిటన్ దాస్ (138), మెహదీ హసన్‌ మిరాజ్ (78) ఆదుకోవడంతో 262 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్లు హసన్‌ మహ్మద్‌ (5/43), నహీద్‌ రాణా (4/44) విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ 172కే కుప్పకూలింది. సల్మాన్‌ ఆఘా (47 నాటౌట్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (43) పోరాడకపోతే పాక్‌ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు.

* 2001లో వినయన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కాశీ’ (Kasi) మూవీ విక్రమ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో ఆయన అంధుడిగా నటించారు. ఉత్తమ నటుడిగానూ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు. పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించడం వల్ల కొన్ని సమయాల్లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ మూవీ షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ‘‘సినిమాల్లో పాత్రకు అవసరమైనట్లు మారడం, నటించడమంటే నాకు ఇష్టం. ఇతరులతో పోలిస్తే, ఏదైనా ప్రత్యేకంగా చేయాలి. అది అందరూ చేసినట్లు ఉండకూడదు. నేను మందు తాగను, సిగరెట్‌ కాల్చను. కానీ, సినిమా పట్ల నాకున్న అభిరుచి నాకు విషంలాంటిది. నేను బాగా నటించాలని అనుకున్నప్పుడు అది మరింత ఎక్కువ విషంగా మారుతుంది. నేను ‘కాశీ’ (తెలుగులో శ్రీను, వాసంతి, లక్ష్మి) అనే మూవీ చేశా. అందులో నటించిన తర్వాత రెండు, మూడు నెలల పాటు నా కంటి చూపు మందగించింది. సరిగా చూడలేకపోయేవాడిని. ఎందుకంటే ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేది. ఆ ప్రభావం నా కంటి చూపుపై పడింది. మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు’’ అంటూ కాశీ మూవీ పూర్తయిన తర్వాత తనకెదురైన పరిస్థితిని గుర్తుచేసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z