* జస్టిస్ హేమ కమిటీ నివేదిక (Justice Hema Committee Report) బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకూ మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బాధితుల్లో పలువురు కథానాయికలు ఉండటం, తమకు ఎదురైన పరిస్థితులను ధైర్యం వెల్లడిస్తుండటంతో రోజుకో సంచలనం బయటకు వస్తోంది. తాజాగా ఓ నటి కథానాయకుడు నివిన్ పౌలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, గత నవంబరులో ఆమెను దుబాయ్ తీసుకెళ్లారు. అక్కడే ఆమెను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నాడు. నిందితుల జాబితాలో నివిన్ పౌలీని ఆరో వ్యక్తిగా చేర్చారు. నివిన్‌పై కేసు నమోదైన విషయం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు, ఇతర భాషల ప్రేక్షకులకూ నివిన్ సుపరిచితుడే. ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అతడు దగ్గరయ్యాడు. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాడు నివిన్. ఈ ఏడాది ‘మలయాళీ ఫ్రమ్ ఇండియా’తో ప్రేక్షకులను పలకరించాడు. ‘ఏళు కడల్ ఏళు మలై’ అనే తమిళ చిత్రంలోనూ నటించారు. ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్‌లపై కేసులు నమోదయ్యాయి. కేరళ ప్రభుత్వం కూడా ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)కు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయకండని విజ్ఞప్తి చేశారు. షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కలిగించేందుకు నివేదికలో చేసిన సూచనలను స్వాగతిస్తునని చెప్పిన మమ్ముట్టి, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.
* 13ఏళ్ల బాలికపై దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పుర్ జిల్లాలోని ఓ గ్రామంలో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఆరుగురు మైనర్లు ఉండటం గమనార్హం. వీరిలో ఒకరి వయస్సు 19 ఏళ్లు కాగా.. మిగతా వారి వయస్సు 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకడు బాధితురాలికి తెలిసిన వ్యక్తేనని తెలిపారు.
* ఇంటర్నెట్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోల కోసం వెతికే వారిపై కేరళ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అటువంటి ఫొటోలు, వీడియోలు వెతకడం, వాటిని సేకరించడం, ఇతరులతో పంచుకునే వారిని గుర్తించేందుకు కొన్నేళ్ల చేపట్టిన ‘ఆపరేషన్ పీ-హంట్’ను ముమ్మర స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వివిధ జిల్లాల్లో సోదాలు చేసిన పోలీసులు.. 37 కేసులు నమోదు చేయడంతోపాటు ఆరుగురిని అరెస్టు చేశారు. చిన్నారుల అశ్లీల కంటెంటు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొన్నేళ్లుగా పీ-హంట్ (Operation P-Hunt) పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 455 ప్రదేశాల్లో తాజాగా సోదాలు నిర్వహించారు. తిరువనంతపురం, కొల్లాం సిటీ, పథనంతిట్టా, మలప్పురం, కొయ్‌కోడ్ రూరల్, కాసర్‌గోడ్ జిల్లాల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. అత్యధికంగా మలప్పురం జిల్లాలో 60 చోట్ల సోదాలు జరిపిన పోలీసులు.. 23 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
* ఓ విద్యార్థిని పశువుల స్మగ్లర్‌గా భావించి గో సంరక్షకులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం… ఆగస్టు 23న హరియాణలోని ఫరీదాబాద్‌లో కొందరు పశువుల స్మగ్లర్లు రెనాల్ట్ డస్టర్, టయోటా ఫార్చూనర్ కార్లలో నగరంలోకి ప్రవేశించినట్లు గో సంరక్షకులకు సమాచారం అందింది. అదే సమయంలో 12వ తరగతి చదువుతున్న ఆర్యన్ మిశ్రా, అతడి స్నేహితులు హర్షిత్, శాంకీ, మరికొందరు పటేల్ చౌక్ వద్ద డస్టర్ కారులో వెళ్తుండగా గోసంరక్షకులు వారిని పశువుల స్మగ్లర్లుగా భావించి, దాదాపు 30 కి.మీ.లు వెంబడించారు. కారు ఆపమని పలుమార్లు వారిని అడిగారు. అయితే ఆర్యన్ స్నేహితుడు శాంకీకి, ఇతరులకు మధ్య గొడవలు ఉండటంతో వారే తమను చంపడానికి రౌడీలను పంపారని భావించిన విద్యార్థులు కారును ఆపకుండా వెళ్లిపోయారు. వారు ఆగకపోవడంతో గో సంరక్షకులు కారుపై కాల్పులు జరిపారు. దీంతో వెనక సీట్లో కూర్చున్న ఆర్యన్ మెడలోకి బుల్లెట్ దూసుకుపోయింది. విద్యార్థులు వెంటనే కారును ఆపారు. అనంతరం వారు విద్యార్థిపై మళ్లీ కాల్పులు జరిపారు. వెనక సీటులో ఇద్దరు విద్యార్థినులు ఉండటం చూసిన గో సంరక్షకులు తాము కాల్పులు జరిపింది స్మగ్లర్లపై కాదని గుర్తించి, అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆర్యన్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరునాడు మరణించాడు. విద్యార్థిపై కాల్పులకు పాల్పడిన గోసంరక్షక బృందానికి చెందిన ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు తాజాగా మీడియాకు వెల్లడించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనలో ఉపయోగించిన తుపాకీ కూడా చట్టవిరుద్ధంగా పొందినదేనని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z