Business

కాందహార్ హైజాక్‌పై నెట్‌ఫ్లిక్స్ సమీక్ష-BusinessNews-Sep 03 2024

కాందహార్ హైజాక్‌పై నెట్‌ఫ్లిక్స్ సమీక్ష-BusinessNews-Sep 03 2024

* భారీ వర్షాలు, వరదల దృష్ట్యా తెలుగురాష్ట్రాల్లోని వినియోగదారుల కోసం ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రీపెయిడ్‌ వినియోగదారులకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ప్రకటించింది. కాల్స్‌తోపాటు 4 రోజులపాటు రోజుకు 1.5జీబీ మొబైల్‌ డేటాను అందించనుంది. పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల బిల్లు చెల్లింపునకు వారంపాటు గడువు పొడిగించింది. ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వాళ్లకు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని కల్పించినట్టు ప్రకటించింది. విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులకు ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో మినహాయింపులిచ్చినట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. విపత్తు సమయంలో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

* బజాజ్‌ గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ వస్తోంది. ఆ గ్రూపునకు చెందిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్ ఐపీఓ (Bajaj Housing Finance IPO) సబ్‌స్క్రిప్షన్‌ సెప్టెంబర్‌ 9న ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 11న ముగియనుంది. మొత్తం రూ.6,560 కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.66-70గా కంపెనీ నిర్ణయించింది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు సెప్టెంబర్‌ 6న బిడ్డింగ్‌ విండో ఓపెన్‌ కానుంది. ఐపీఓలో భాగంగా రూ.3,560 కోట్లు విలువైన తాజా షేర్లను కంపెనీ జారీ చేయనుంది. మరో రూ.3వేల కోట్లు విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా కంపెనీ మాతృ సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌ విక్రయిస్తోంది. ఐపీఓలో భాగంగా మదుపర్ల కనీసం 214 ఈక్విటీ షేర్లతో కూడిన లాట్‌కు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. ఆపై ఎన్ని లాట్లయిన కొనుగోలు చేయొచ్చు. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ వద్ద 2015 సెప్టెంబర్‌ నుంచి నాన్‌ డిపాజిట్‌ టేకింగ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రిజస్టరై ఉంది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారితో పాటు గృహాలు, కమర్షియల్‌ ప్రాపర్టీల పునరుద్ధరణకు ఈ కంపెనీ రుణ సదుపాయం కల్పిస్తూ ఉంటుంది. ఈ కంపెనీని ఆర్‌బీఐ గతంలో అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తించింది. అప్పర్‌ లేయర్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు 2025 సెప్టెంబర్‌ నాటికి స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవ్వాలన్న ఆర్‌బీఐ నిబంధనలు అనుసరించి ఈ ఐపీఓ వస్తోంది.

* విజయ్‌ వర్మ (Vijay varma) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్’ (IC 814: The Kandahar Hijack)పై గత కొంతకాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే సిరీస్‌లో చూపించిన వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని.. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) కంటెంట్‌ హెడ్‌కు కేంద్రం నుంచి సమన్లు అందాయి. దీంతో కంటెంట్‌ విభాగ సారథి మోనికా షెర్గిల్‌ మంగళవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. కంటెంట్‌ విషయంలో తాము సమీక్ష చేపడతామని ఈ సందర్భంగా ఆమె కేంద్రానికి హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ‘‘హైజాకర్ల వాస్తవ పేర్లను స్పష్టంగా తెలియజేసేలా స్క్రీన్‌పై క్యాప్షన్లు లేదా రైడర్లు ఎందుకు ఇవ్వలేదు? హైజాకర్లను మానవత్వం ఉన్నవారిగా చూపిస్తూ.. మధ్యవర్తులను బలహీనపరులుగా, గందరగోళానికి గురవుతున్నవారిగా ఎందుకు చూపించారు?’’ అని కేంద్రం ప్రశ్నించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే కంటెంట్‌ను సమీక్షిస్తామని నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చినట్లు తెలిపాయి. భవిష్యత్తులో దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండే కంటెంట్‌ను తమ మాధ్యమంలో ప్రసారం చేస్తామని చెప్పినట్లు తెలిపాయి. చిన్నారులకు సంబంధించిన కంటెంట్‌ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ పేర్కొన్నట్లు సమాచారం.

* అవాంఛిత ఫోన్‌ కాల్స్ విషయంలో అన్‌ రిజిస్టర్డ్‌ టెలీ మార్కెటర్లపై ట్రాయ్‌ (TRAI) తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా 2.75 లక్షల మొబైల్‌ నంబర్లను టెలికాం కంపెనీలు బ్లాక్‌ చేశాయి. మరో 50 సంస్థలనూ నిషేధిత జాబితాలో చేర్చాయి. అన్‌రిజిస్టర్డ్‌ టెలీమార్కెటర్లపై చర్యలు తీసుకోవాలన్న ట్రాయ్‌ ఆదేశాల మేరకు టెల్కోలు ఈ చర్యలు చేపట్టాయి. ఈ మేరకు ట్రాయ్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది

* జావా యెజ్డీ మోటార్‌ సైకిల్స్‌ మంగళవారం కొత్త Jawa 42 FJ350ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.1,99,142 (దిల్లీ ఎక్స్‌-షోరూం). ఈ బైక్‌కు దాని వ్యవస్థాపకుడు ఫ్రాంటిసెక్‌ జానెసేక్‌ పేరు పెట్టారు. ఈ బైక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350లకు పోటీ ఇస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మోడల్‌ 334 సీసీ ఇంజిన్‌, ఆరు గేర్ల ట్రాన్స్‌మిషన్‌తో పాటు వివిధ ప్రత్యేకతలను కలిగి ఉంది. Jawa 42 FJ350 మోటార్‌ సైకిల్‌ స్టీల్‌ ఛాసిస్‌తో రానుంది. ఇది 41 ఎంఎం టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, ట్విన్‌ షాక్‌ అబ్జార్బర్స్‌, ఆఫ్‌సెట్‌ స్పీడోమీటర్‌తో పాటు మెరుగైన హ్యాండ్లింగ్‌ కోసం డబుల్‌ గ్రిల్‌ ఫ్రేమ్‌లను కలిగి ఉంది.

* సాధారణంగా తమ క్రెడిట్‌, డెబిట్ కార్డు వివరాలను ఎవరైనా అత్యంత గోప్యంగా ఉంచుతారు. అవన్నీ బయటకు తెలిస్తే ఖాతా ఖాళీ అవ్వడానికి క్షణం పట్టదు..! అలాంటిది అన్నీ తెలిసి ఓ కంపెనీ సహ వ్యవస్థాపకుడు తన డెబిట్ కార్డు వివరాల (Debit Card Details)ను ఏకంగా తన ‘ఎక్స్‌’ ఖాతాలోనే షేర్‌ చేశారు. అంతేనా.. దాన్ని వాడుకుని తమకు నచ్చింది కొనుక్కోండంటూ నెటిజన్లకు బంపరాఫర్‌ ఇచ్చారు. ఇంకేముంది.. కొనుగోళ్లకు నెటిజన్లు పోటెత్తారు..! ‘బోల్డ్‌కేర్‌ (Bold Care)’ అనే స్టార్టప్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ కృష్ణన్‌ సోమవారం తన ఎక్స్‌ ఖాతాలో ఈ పోస్ట్‌ చేశారు. బ్యాంకు డెబిట్‌ కార్డు నంబరు, ఎక్స్‌పెయిరీ తేదీ, సెక్యూరిటీ కోడ్‌ వంటి వివరాలను పంచుకున్నారు. అయితే దీనికో షరతు పెట్టారు. తన కార్డు వినియోగించుకుని యూజర్లు రూ.1000 వరకు మాత్రమే కొనుగోళ్లు చేయాలని చెప్పారు. ట్రాన్సాక్షన్‌ పూర్తి చేయడం కోసం తనకు వచ్చే ఓటీపీని కూడా షేర్‌ చేస్తానన్నారు. తొలుత దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆయన కార్డును ఉపయోగించి కొనుగోళ్లు చేశారు. వాటికి వచ్చిన ఓటీపీలను కూడా ఆయన ‘ఎక్స్‌’లోనే షేర్‌ చేయడంతో మరింత ఎక్కువ మంది ఈ ఆఫర్‌ను ఉపయోగించుకున్నారు. కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్‌ విపరీతంగా వైరల్‌ అయ్యింది. కేవలం 5 గంటల్లోనే దాదాపు 200లకు పైగా ఓటీపీలను ఆయన పంచుకున్నారు. అత్యధికంగా జొమాటో, స్విగ్గి, బ్లింకిట్‌, అమెజాన్‌ వంటి వాటిల్లో నుంచి నెటిజన్లు కొనుగోళ్లు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z