* అగ్నిమాపక సిబ్బంది మంటలను ఎలా ఆర్పుతారో చూడాలని.. వారితో సరసాలాడాలని ఓ మహిళ ఏకంగా రెండుసార్లు వ్యవసాయ భూమికి నిప్పుపెట్టింది. తీరా ఆమె వ్యవహారం బయటకు రావడంతో కోర్టు ఆమెకు జైలుశిక్ష విధించింది. గ్రీస్‌లోని ట్రిపోలీ పరిధిలోని కెరిసిటా అనే ప్రాంతంలో ఆగస్టు 24, 25 తేదీల్లో వరుసగా ఓ వ్యవసాయ భూమిలో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. అసలే కార్చిచ్చులతో ఇబ్బందిపడుతున్న దేశంలో ఇవి ప్రమాదకరంగా మారతాయని ఆందోళన చెందిన అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయగా వారికి ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఎలా ఆర్పుతారో చూడాలని అనుకొన్న 44 ఏళ్ల మహిళ ఒకరు ఈ వ్యవసాయ భూమికి నిప్పుపెట్టినట్లు తేలింది. అంతేకాదు.. వచ్చిన సిబ్బందితో సరసాలాడొచ్చని ఆశించింది. ఆమె మోటు సరసంతో అధికారులు అవాక్కయ్యారు. దర్యాప్తు అధికారులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆమెకు ఒక కార్చిచ్చు కేసులో 1,106 డాలర్ల అపరాధ రుసుం, దీంతోపాటు 36 నెలలపాటు జైలు శిక్ష విధించారు.
* వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ కోల్‌కతా(Kolkata)లో మరో దుశ్చర్య చోటుచేసుకుంది. నగరంలోని ఓ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఇద్దరు మహిళలపై వేధింపులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హోటల్‌లో జరిగిన పార్టీలో మంగళవారం రాత్రి 11.50 గంటల సమయంలో నిందితులు తనను, తన సోదరిని వేధించారని.. అనుచితంగా టచ్ చేసి బెదిరించారని ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను దిల్లీకి చెందిన అరుణ్ కుమార్ (60), కోల్‌కతాకు చెందిన రింకూ గుప్తా (43)గా గుర్తించారు. మహిళలపై దారుణాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘అపరాజిత బిల్లు’ను ఆమోదించిన రోజే ఈ దారుణం జరగడం గమనార్హం.
* బిస్కెట్ అంటే ఇష్టముండని చిన్నారులు ఉండరు. కానీ ఆ ఇష్టమే ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. మెషిన్‌లో ఉన్న బిస్కెట్‌ను చేయి చాచి తీసుకుంటున్న ఆ చిన్నారికి ముంచుకొస్తున్న ప్రమాదం కనిపించలేదు. బిస్కెట్ తీసుకునే లోపే మెషిన్ ఆ బాలుడిని లాక్కోవడంతో అందులోనే నలిగి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..థానే జిల్లాలోని ఆనంద్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పూజా కుమారి.. అంబరనాథ్ ప్రాంతంలో ఉన్న ఓ బిస్కెట్ కంపెనీలో కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె లంచ్ బాక్సులు ఇవ్వడానికి తన మూడేళ్ల కుమారుడు ఆయుష్ చౌహాన్‌ను వెంటబెట్టుకొని ఫ్యాక్టరీకి వెళ్లింది. ఆమె కార్మికులకు లంచ్ బాక్సులు ఇస్తున్న సమయంలో చిన్నారికి యంత్రంలోని పడిపోయిన బిస్కెట్ ముక్కలు కనిపించాయి. మెషిన్ వైపు పరిగెత్తి వాటిని తీసుకోవడానికి ప్రయత్నించగా.. దానికి ఉన్న బ్లేడ్‌కు మెడ చిక్కుకోవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కార్మికులు వెంటనే యంత్రాన్ని ఆఫ్ చేసి, ఆయుష్‌ను ఉల్హాస్‌నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. అప్పటి వరకు అల్లరి చేస్తూ తన చుట్టూ తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
* భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల వ్యవహారం మరింత ముదురు తోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) రంగంలోకి దిగింది. అమెరికా పౌరుడిగా చెప్పుకుంటూ, సీఐఏ ఏజెంట్ అని నమ్మించి వివిధ దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార నాయకులను మోసగించడం, తీవ్రమైన తప్పిదాలకు పాల్పడటం ఆరోపణల కేసులో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.నకిలీ సీఐఏ ఏజెంట్‌గా శ్రీవాస్తవ ఏకంగా ప్రెసిడెంట్ జో బిడెన్‌ను కలిశారని, డెమోక్రటిక్ పార్టీకి 10 లక్షల డాలర్ల పైగా విరాళం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడం అక్కడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ‘నకిలీ సీఐఏ ఏజెంట్’ స్కామ్‌లో శ్రీవాస్తవ, అనేక సంవత్సరాలుగా మోసపూరిత కార్యకలాపాలతో అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలను ఎఫ్‌బీఐ విచారిస్తోంది.ఘోరమైన అబద్ధాలతో వాషింగ్టన్ రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీను బురిడీ కొట్టించాడు. వ్యాపార వేత్తలను నమ్మించి, తనఫౌండేషన్‌కు భారీనిధులను దక్కించుకున్నాడు. అయితే ఇండియాలోని లక్నోకు చెందిన శ్రీవాస్తవ కాలేజీ డ్రాపౌట్ అని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా రిపోర్ట్ చేసింది.శ్రీవాస్తవ మోసపూరిత కార్యకలాపాలు అంతర్జాతీయ లావాదేవీలకు కూడా విస్తరించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సూడాన్, లిబియాతో సహా ఆఫ్రికాలోని నాయకులను తప్పుదారి పట్టించాడు . అమెరికా ప్రభుత్వ మద్దతు పొందేందుకు తప్పుడు వాగ్దానాలు చేశాడు. వాషింగ్టన్‌లో, అతను తన చర్యలను చట్టబద్ధం చేయడానికి ఉన్నత అధికారులతో సంబంధాలను మెయింటైన్ చేశాడు.మిస్టర్ జీగా పాపులర్ అయిన శ్రీవాస్తవ బాధితుల్లో నాటో మాజీ కమాండర్ జనరల్ వెస్లీ క్లార్క్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇంకా అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంక్, అనేక డెమొక్రాటిక్ నిధుల సేకరణ కమిటీలు, అనేకమంది సెనేటర్లు , కాంగ్రెస్ సభ్యులతో సహా అనేక ఉన్నత స్థాయి వ్యక్తులను మోసగించాడు. నేటర్ మార్క్ వార్నర్, ప్రతినిధి పాట్రిక్ ర్యాన్, జెనీవాకు చెందిన వస్తువుల వ్యాపారి, ఇంకా అనేక మంది ఆఫ్రికన్ నాయకులు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా శ్రీవాస్తవ మోసానికి గురి కావడం గమనార్హం. అంతేకాదు తనపై కథనాలను రాసిన మీడియాను కూడా పరువు నష్టం దావాతో బెదరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో కొందరు ఆయనకు దూరం కాగా, మరికొందరు సంబంధాలను తెంచుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z