Movies

అతడు నన్ను సెక్స్ బానిసగా మార్చుకున్నాడు-NewsRoundup-Sep 05 2024

అతడు నన్ను సెక్స్ బానిసగా మార్చుకున్నాడు-NewsRoundup-Sep 05 2024

* విక్రమ్‌ (Vikram) హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని అందుకుంది. ఈనేపథ్యంలో ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌ గురించి మాట్లాడారు. స్టార్‌ హోదాను ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నానన్నారు. నటుడిగా ఉన్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. నటుడిగా ఎదిగిన సమయంలో తనకంటూ ఒక కారవాన్‌ కావాలని డిమాండ్‌ చేశానని తెలిపారు. ఆ సమయానికి అగ్ర నటుడు రజనీకాంత్‌కు కూడా వానిటీ వ్యాన్‌ లేదని చెప్పారు. ‘‘విక్రమ్‌గా సెట్‌లోకి అడుగుపెట్టగానే.. ఆ స్టార్‌ హోదాను ఫీలవుతా. రజనీకాంత్‌ సర్‌ వద్ద ఒక్క బాడీగార్డ్‌ ఉన్న సమయంలోనే నాకు ఐదుగురు గార్డ్స్‌ ఉండేవారు. కారవాన్‌ కావాలని డిమాండ్‌ చేసి తెప్పించుకున్నా. ఆ సమయానికి రజనీకాంత్‌ వద్ద కారవాన్‌ లేదు. నాకు వానిటీ వ్యాన్‌ కావాల్సిందేనని కచ్చితంగా చెప్పేసేవాడిని. ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు అభిమానులు చుట్టుముడితే ఏమాత్రం ఇబ్బందిపడను. ఎందుకంటే, వారు చూపించే ఆ అభిమానం, ప్రేమ కోసమే ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చా. నేను సింపుల్‌ లైఫ్‌ స్టైల్‌ను ఇష్టపడతా. అదేవిధంగా స్టార్‌ హోదాను ప్రేమిస్తా. ఫేమస్‌ అయ్యాక.. నిజమైన స్నేహితులను ఏర్పర్చుకోవడం సులభం కాదు. ముందు నుంచి మన లైఫ్‌లో ఎవరైతే ఉంటారో వాళ్లే మనకు అసలైన స్నేహితులు. సెట్‌ నుంచి తిరిగి ఇంటికి వెళితే నేను ఎవరికీ అందుబాటులో ఉండను. అక్కడ నా ప్రపంచం వేరు. అలాగే, ఒక్కసారి సెట్‌లోకి అడుగుపెడితే నేను విక్రమ్‌గా ఉంటా. ఇంట్లో వాళ్లు నాతో మాట్లాడాలన్నా నా అసిస్టెంట్‌కు కాల్‌ చేస్తారు’’ అని విక్రమ్‌ తెలిపారు. ‘అపరిచితుడు’తో తాను దేశవ్యాప్తంగా ఫేమ్‌ సొంతం చేసుకున్నానని ఆయన చెప్పారు.

* తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. తాజాగా విద్యుత్‌ శాఖ ఉద్యోగులు తమ ఒక రోజు మూలవేతనం విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్ని స్థాయిల ఉద్యోగులు, పింఛనర్ల ఒక రోజు మూలవేతనం రూ.15 కోట్లు సీఎం సహాయనిధికి అందించనున్నట్లు విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. తెలంగాణ ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగులు సైతం తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు సీఎం సహాయక నిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఎస్‌బీఐ సీజీఎం రూ.5 కోట్ల చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. అరబిందో ఫార్మా కంపెనీ కూడా రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది. సంస్థ ఎండీ కె.నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి సీఎంను కలిసి చెక్కును అందించారు. ఎన్‌సీసీ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణకు రూ.కోటి, ఏపీలో వరద బాధితులకు రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది.

* హేమ కమిటీ రిపోర్ట్ (hema committee report) మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న తరుణంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడిని ఉద్దేశించి నటి సౌమ్య కీలక ఆరోపణలు చేశారు. ఆ దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. కూతురని పిలుస్తూనే నీచంగా ప్రవర్తించాడని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘సినిమాల్లోకి అడుగుపెట్టాలని చిన్నప్పటినుంచే కలలు కన్నా. 18 ఏళ్ల వయసులో తెలిసిన వారి ద్వారా సినిమా అవకాశం వచ్చింది. దర్శకుడు నచ్చజెప్పడంతో ఇంట్లోవాళ్లు సుముఖత వ్యక్తంచేశారు. మొదటి మీటింగ్‌లోనే అతడి ప్రవర్తన నాకు నచ్చలేదు. కొంతకాలానికి అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వాళ్లావిడ పక్కన లేని సమయం చూసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాదాపు ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగింది’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు తననొక సెక్స్‌ బానిసగా చూశాడని.. తన బాధను ఎవరితోనూ చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ దర్శకుడు పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు. మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వేధింపుల కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందానికి మాత్రమే తాను వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

* జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి కోరారు. గత నెల 20న ప్రారంభమైన ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అక్టోబర్‌ 29న ముసాయిదా జాబితాను ప్రకటించి.. నవంబరు 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జనవరి 6న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,33,27,304 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల దరఖాస్తులు రాగా.. వాటిలో 2.45లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలకు శిక్షణ పూర్తయిందని, ఓటరు కార్డు, ఆధార్‌ లింక్‌ దాదాపు 60శాతం పూర్తయిందని తెలిపారు.

* అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్‌ ఓ నమూనా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్‌ కూడా స్వయంగా అనేక ‘సింగ్‌పూర్‌’లను సృష్టించాలనుకుంటోందన్నారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌తో చర్చలు జరిపారు. ఇది కేవలం ఇది భాగస్వామ్య దేశం కాదని.. అభివృద్ధి చెందుతోన్న దేశాలకు సింగపూర్‌ ఓ స్ఫూర్తి అని అభివర్ణించారు. ‘‘భారత్‌లో అనేక సింగపూర్‌లను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని సాధించేందుకు మనం సహకరించుకోవడం సంతోషంగా ఉంది. మంత్రుల స్థాయిలో నిర్వహించిన చర్చలు ఇందుకు ఓ మార్గనిర్దేశం అవుతాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధానిగా లారెన్స్‌ బాధ్యతలు చేపట్టిన తొలిసారి భేటీ అయ్యామని గుర్తుచేసిన మోదీ.. యువ నాయకత్వంలో సింగపూర్‌ మరింత పురోగతి సాధిస్తుందని ఆకాంక్షించారు.

* తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది. కమిటీ ఇచ్చే సమాచారం మేరకు సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొంది. అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కోసం సెంటర్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు, ఫిల్మ్‌ ఛాంబర్‌తోపాటు పలువురు నిర్మాతలు వ్యక్తిగతంగా విరాళాలు ప్రకటించారు. బాధితుల సహాయార్థం రెండు రాష్ట్రాలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చెరో రూ.25 లక్షలు, తెలుగు నిర్మాతల మండలి చెరో రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపాయి. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు నిర్మాత సురేశ్‌ బాబు (Daggubati Suresh Babu) రూ. కోటి, దిల్‌ రాజు (Dil Raju) ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.

* ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వైరల్‌ జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నారు. అయినా, వరద ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణపై పవన్‌ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్‌ క్లోరినేషన్‌ చేపట్టాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్‌కి వరద ముప్పుపై ఆరా తీశారు.

* తెలుగు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళల భద్రత, రక్షణను మరింత మెరుగుపరచడం కోసం వారి తరపున ప్రాతినిధ్యం వహించేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సినీ నటుడు, ‘మా’ (Movie Artists Association) అధ్యక్షుడు మంచు విష్ణు (Vishnu Manchu) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘మా’ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీశాఖ మంత్రులకు నాదొక విజ్ఞప్తి. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు రక్షణ, భద్రత మరింత మెరుగుపడేలా వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఓ కమిషన్‌ ఏర్పాటు చేేయండి. కెమెరా ముందు వెనుక ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలన్న దానికి మేము ప్రాధాన్యం ఇస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ‘మా’ ఎప్పుడూ కట్టుబడి ఉంది. భద్రత, సాధికారితకు ప్రతిరూపంలా నిలిపేందుకు తెలుగు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాం.

* రాష్ట్రంలో వరద నష్టంపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు మచిలీపట్నం ఎంపీ వి.బాలశౌరి తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు సర్వస్వం కోల్పోయారన్నారు. 2008లో బిహార్‌లో వరదలు వచ్చినప్పుడు ఎంపీలంతా స్పందించారని, రూ.10లక్షల చొప్పున నిధులు, నెల జీతం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీకి కూడా ఎంపీలంతా రూ.50లక్షల చొప్పున ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఎంపీలాడ్స్‌ నిధులపై ప్రధాని మోదీ, స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాసినట్టు చెప్పారు.

* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదన్నారు. కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా అనుమతి లేని బఫర్‌ జోన్‌లో ఉన్న ఇంట్లో సీఎం చంద్రబాబు ఉంటున్నారు. వరదలు రావడంతో బుడమేరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్‌.. ఇవ్వన్నీ కాదు.. కరకట్టపై ఉన్న బాబు నివాసం కూల్చేసి శభాష్‌ అనిపించుకో అని అన్నారు.

* టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పలు సంఘటనల్లో ఆమె వెంటనే రియాక్ట్‌ అవుతారు. సత్యవేడుకు చెందిన ఒక మహిళ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మీద తాజాగా పూనమ్‌ సంచలన ట్వీట్ చేశారు. ఆమె చేసిన కామెంట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. “పవర్ రేపిస్ట్”ని బయటపెట్టమని తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను అభినందిస్తున్నానంటూ పూనమ్‌ కౌర్‌ ఒక ట్వీట్‌ చేశారు. అతను అలా తన భార్యకు అండగా లేకుండా ఉండుంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యేవాడు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి సంఘటన ఎదురైతే అధికారంలో ఉన్నవారితో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా ఉండమని చెబుతారు.. కానీ, అతను తన భార్యను సపోర్ట్‌ చేస్తూ తప్పును బహిర్గతం చేశాడు.తన భార్య మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసేలా ఎంకరేజ్ చేసిన ఆ భర్తకు నా కృతజ్ఞతలు. అత్యాచారానికి గురైన మహిళ దైర్యంగా బయటికొచ్చి మాట్లాడిన ఆ మహిళను అభినందిస్తున్నాను.’ అని పూనమ్‌ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z