NRI-NRT

7వ తరగతి చదివే ఫ్రిస్కో కవలలు…AI కంపెనీలతో అదరగొడుతున్నారు

7వ తరగతి చదివే ఫ్రిస్కో కవలలు…AI కంపెనీలతో అదరగొడుతున్నారు

వారిద్దరూ కవలలు.. వయసు 14 ఏళ్లు.. పుట్టింది హైదరాబాద్‌ రామంతాపూర్‌.. తర్వాత అమ్మానాన్నలతో కలిసి అమెరికా వెళ్లారు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చిన్న వయసులోనే కృత్రిమమేధ (ఏఐ)లో ప్రావీణ్యం సంపాదించారు. ఏడో తరగతిలో ఉండగానే చెరో కంపెనీ ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. వారే సిద్ధార్థ్‌ నంద్యాల, సౌమ్య నంద్యాల. హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్‌ ఏఐ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు.

సిద్ధార్థ్‌కు ఏడేళ్ల వయసులోనే కోడింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. లింక్డిన్‌ లెర్నింగ్, యూట్యూబ్‌లో చూసి సీ, సీ++, పైథాన్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకున్నాడు. ఒరాకిల్, ఆర్మ్‌ నుంచి మిషిన్‌ లెర్నింగ్, ఏఐపై ప్రావీణ్యం సంపాదించాడు. ప్రపంచంలోనే అతిచిన్న వయసులో ఏఐలో సర్టిఫైడ్‌ అయ్యాడు. ఏడో తరగతిలోనే డల్లాస్‌ సమీపంలోని ప్రిస్కో నగరంలో ‘స్టెమ్‌ ఐటీ’ కంపెనీ స్థాపించాడు. పలు ఏఐ ఆధారిత ఉత్పత్తులను స్వయంగా ఆల్గరిథమ్‌లు రాస్తూ రూపొందిస్తున్నాడు. అందులో వృద్ధుల కోసం చేసిన ఫాల్‌ డిటెక్షన్‌ బ్యాండ్, ఏఐతో పనిచేసే ప్రోస్థటిక్‌ హ్యాండ్‌ ప్రాచుర్యం పొందాయి. ఫాల్‌ డిటెక్షన్‌ బ్యాండ్‌ ధరించిన వృద్ధులు ఇంట్లో పొరపాటున జారి పడిపోతే వారి కుటుంబసభ్యులకు అలర్ట్‌ వెళ్తుంది. హైదరాబాద్‌లోని టీవర్క్స్‌తో కలిసి దీనిపై పనిచేస్తున్నాడు. చేతులు లేనివారికి అమర్చేందుకు ఏఐ ప్రోస్థటిక్‌ హ్యాండ్‌ను తక్కువ ఖర్చుతో రూపొందించాడు. ఏఐ సదస్సులో శుక్రవారం దీన్ని ప్రదర్శించి వివరించనున్నాడు. డయాబెటిక్‌ రెటీనోపతిని గుర్తించేందుకు మిషిన్‌ లెర్నింగ్‌ ఏఐ ఆల్గరిథమ్‌లు తయారు చేశాడు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో దీన్ని ఉపయోగించేలా చర్చలు సాగుతున్నాయి. గత నెలలో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు డల్లాస్‌ వెళ్లినప్పుడు వారిని సిద్ధార్థ్‌ కలిశాడు.

సిద్ధార్థ్‌ కంటే 20 నిమిషాల ముందు పుట్టిన సౌమ్య ‘డ్రైవ్‌ఇట్‌’ అనే సంస్థను మొదలుపెట్టింది. అమెరికాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌కు 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో సౌమ్య ఏఐ ఆధారిత ‘డ్రైవ్‌ఇట్‌’ ఆలోచన చేసింది. లైసెన్స్‌ రెన్యువల్‌కు ఈ ప్లాట్‌ఫాం ద్వారా దరఖాస్తు చేసుకుంటే నెల లేదా వారంలో అపాయింట్‌మెంట్లు లభిస్తాయి. ఇప్పటివరకు 10 వేల మంది దీన్ని వినియోగించుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z