సైనైడ్ కిల్లర్స్ గ్యాంగ్‌ను గుంటూరు జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వివరాలను గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీకి చెందిన ఎం.వెంకటేశ్వరి, ఆమె తల్లి రమణమ్మ.. చుట్టు పక్కల వారిని ఆప్యాయంగా పలకరిస్తూ నమ్మించి అప్పుగా డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తిరిగి ఇవ్వమన్నవారిని శీతల పానీయాలు, ఆహారం, మత్తు పానీయాలలో సైనైడ్ కలిపి చంపేస్తారు. ఇటీవల తల్లి, కుమార్తెలు ఉంటున్న ఇంటి సమీపంలో ఉండే మునగప్ప రజినీ ఈ ముఠాలో చేరింది. వీళ్లు అదే ప్రాంతంలో నివసిస్తున్న నాగూర్‌బీని జూన్ నెలలో బయటకు తీసుకొచ్చి చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బ్రీజర్‌లో సైనైడ్ కలిపి హతమార్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేశారు. నాగూర్‌బీకి, రజినీకి మధ్య ఆర్థిక లావాదేవీలతోనే ఈ హత్య జరిగినట్టు దర్యాప్తులో తేలింది. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. వెంకటేశ్వరి, రమణమ్మ కలిసి ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని సైనైడ్ ఇచ్చి హత్య చేసినట్టు విచారణలో వెల్లడైంది. మరో ముగ్గురు మహిళలను ఇదే తరహాలో సైనైడ్ కలిపి హత్య చేయడానికి ప్రయత్నించారు. చివరి క్షణంలో వారు ప్రాణాలతో బయటపడ్డారు అని ఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z