Devotional

తితిదే నుండి శుభవార్త

తితిదే నుండి శుభవార్త

కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించనున్నట్లు తితిదే ఈవో జె.శ్యామలరావు తెలిపారు. శుక్రవారం అన్నమయ్య భవనంలో తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘భక్తులకు ఆధార్‌ ప్రామాణికంగా సేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి ప్రాథమికంగా అనుమతి లభించింది. దీనిపై త్వరలోనే రాష్ట్రప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ వెలువడనుంది. తద్వారా దర్శనం, వసతి, శ్రీవారి సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను నియంత్రించవచ్చు. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు రూ.80 లక్షల విలువైన ‘గ్యాస్‌ క్రోమాటోగ్రాఫ్, హెచ్‌పీఎల్‌సీ’ పరికరాలను తితిదేకు ఉచితంగా అందించేందుకు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ముందుకు వచ్చింది. ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యత తనిఖీకి కమిటీ ఏర్పాటు చేశాం. తిరుమలలో పారిశుద్ధ్యం పెంపునకు అత్యాధునిక యంత్రాల వినియోగంపై ప్రత్యేకకమిటీని ఏర్పాటుచేశాం. తిరునామ ధారణను శుక్రవారం తిరుమలలో పునఃప్రారంభించాం’ అని ఈవో వివరించారు. శ్రీవారిని ఆగస్టులో 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.125.67 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 1.06 కోట్ల లడ్డూలు విక్రయించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z