Business

బ్యాంకుల్లో తగ్గిపోతున్న డిపాజిట్లు-BusinessNews-Sep 07 2024

బ్యాంకుల్లో తగ్గిపోతున్న డిపాజిట్లు-BusinessNews-Sep 07 2024

* డిపాజిట్లు ఆకట్టుకోవడంలో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవైపు రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇదే తరుణంలో డిపాజిట్‌ చేసేవారు తరిగిపోతున్నారు. దీంతో బ్యాంకింగ్‌ రంగం తీవ్ర సంక్షోభం నెదుర్కొంటున్నది. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్‌ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో బ్యాంకింగ్‌ డిపాజిట్లలో 11.7 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఇదే సమయంలో రుణాల్లో వృద్ధి 15 శాతంగా ఉన్నదని పేర్కొంది. ఈ రెండింటి మధ్య అంతరం అంతకంతకు పెరుగుతుండటంపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వుబ్యాంక్‌లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ముఖ్యంగా డిపాజిట్లను ఆకట్టుకోవడానికి బ్యాంకింగ్‌లు ప్రత్యేక దృష్టి సారించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బహిరంగంగానే విమర్శించారు. ఆకర్షణీయమైన డిపాజిట్లను ప్రకటించాలని సూచించారు. ఈ నెలమొదట్లో ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో సమావేశమై ఈ విషయాన్ని సూచించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీల ర్యాలీకి భారీ బ్రేక్‌పడింది. అంతర్జాతీయ మార్కెట్లు సృష్టించిన అలజడి కారణంగా మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా శుక్రవారం సూచీలకు బ్లాక్‌డేగా నిలిచింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు సమయం గడుస్తున్నకొద్ది మరింత ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతున్నట్లు వచ్చిన సంకేతాలకు తోడు ఫెడ్‌ రిజర్వు వడ్డీరేట్లను తగ్గింపును వాయిదావేసే అవకాశం ఉన్నట్లు వచ్చిన వార్తలు మదుపరులపై ఆందోళనకు నెట్టింది. ఇంట్రాడేలో 1,200 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు 1,017 పాయింట్లు నష్టపోయి 82 వేల దిగువకు పడిపోయింది. వారాంతం ట్రేడింగ్‌ ముగిసే సరికి 81,183.93 వద్ద ముగిసింది. దీంతో సూచీ రెండువారాల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు అయింది. ఆగస్టు 23 తర్వాత సూచీలకు ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. మరో సూచీ నిఫ్టీ 292.94 పాయింట్లు(1.17 శాతం) నష్టపోయి 25 వేల దిగువకు 24,852.15 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలు వరుసగా నష్టపోవడం ఇది మూడో రోజు. ఐటీ, చమురు అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లలో జోరుగా క్రయవిక్రయాలు జరిగాయి. సోమవారం చారిత్రక గరిష్ఠ స్థాయి 82,725.28 పాయింట్లకు చేరుకున్న సూచీ ఆ మరుసటి రోజు నుంచి దిగువముఖంగా పయనించింది.

* బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ షేరు అత్యధికంగా 4.40 శాతం నష్టపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడం ఇందుకు కారణమని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ఒక్క శాతం వరకు నష్టపోయాయి.

* పెట్రోల్, డీజిల్‌ రిటైల్‌ ధరలను తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఈ ఏడాదిలో కనిష్ఠ స్థాయిలకు చేరుతుండడం ఇందుకు దోహదం చేయొచ్చని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. దేశంలో సాధారణ ఎన్నికలకు ముందు, ఈ ఏడాది మార్చిలో పెట్రోలు, డీజిల్‌ రిటైల్‌ ధరలను లీటరుకు రూ.2 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. జమ్ము-కశ్మీర్, హరియాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రస్తుత తరుణంలో మళ్లీ పెట్రో ధరల కోతకు అవకాశం ఉందన్నది అంచనా. ప్రస్తుతం అంతర్‌ మంత్రిత్వ శాఖల మధ్య ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

* అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అనిల్‌ అంబానీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్‌లోకి ప్రవేశించడం ద్వారా సోదరుడు ముఖేష్ అంబానీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్‌ను నిర్మించడానికి అయ్యే ఖర్చు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఏటా 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్‌ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తోంది. 10 గిగావాట్‌ హవర్స్‌ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్‌ హవర్స్‌కి విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక అని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ పేర్కొంది. దీనిపై కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ వార్తలు ఇప్పటికే ప్రభావం చూపాయి. రాయిటర్స్ కథనం తర్వాత, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమై ముందుకు సాగితే, ఇప్పటికే ఈవీ మార్కెట్‌లో పురోగతి సాధిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ప్రత్యక్ష పోటీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z