Devotional

ఈ వినాయకుడికి ₹400కోట్ల బీమా-NewsRoundup-Sep 07 2024

ఈ వినాయకుడికి ₹400కోట్ల బీమా-NewsRoundup-Sep 07 2024

* మాజీ ఐఏఎస్‌ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌ (Puja Khedkar)కు కేంద్రం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఆమెను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (IAS) నుంచి తొలగించింది. ఐఏఎస్‌ (ప్రొబేషన్‌) రూల్స్‌, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాయి. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

* భారత (India) భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్‌కు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపింది. ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరిట కార్గిల్‌ నుంచి యుద్ధభేరి (Kargil War) మోగించి శత్రుసేనలను తరిమికొట్టింది. ఇది జరిగి పాతికేళ్లయినా.. దాయాది సైన్యం మాత్రం యుద్ధంలో తమ ప్రమేయం లేదంటూ కొట్టిపారేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఆ దేశ సైన్యాధిపతే తమ పాత్రను అంగీకరించడంతో పాక్‌ (Pakistan) ‘ఓటమి’ గుట్టు అధికారికంగా రట్టయ్యింది..! పాకిస్థాన్‌లోని రావల్పిండిలో గల పాక్‌ ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో శుక్రవారం డిఫెన్స్‌ డే కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ ప్రసంగించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ కార్యక్రమంలో జనరల్‌ మునీర్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్‌, పాకిస్థాన్‌ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్‌ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది’’ అని అన్నారు. దీంతో కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ సైన్యం తమ పాత్రను అంగీకరించినట్లయ్యింది.

* నగరంలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వెళ్లే మార్గం ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా అధికారులతో కలెక్టర్‌ సృజన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలపై అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

* ఉక్రెయిన్‌ – రష్యా (Ukraine-Russia)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిత్యం క్షిపణి దాడులతో మాస్కో దళాలు కీవ్‌ను వణికిస్తుండగా.. డ్రోన్ల దండుతో ఉక్రెయిన్‌ గట్టిగా ప్రతిఘటిస్తోంది. తాజాగా రష్యా ఆక్రమిత ప్రదేశాల్లో డ్రాగన్‌ డ్రోన్ల (Drones)తో థర్మైట్‌ బాంబులను జారవిడుస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

* భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పడిన మూడు గండ్లను విజయవంతంగా పూడ్చగలిగామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే ఉన్నామన్నారు.

* ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో కొంతకాలంగా డ్రోన్‌ బాంబు దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాల మధ్య స్థానికంగా మరోసారి హింస చెలరేగింది. జిరిబామ్‌ జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. శనివారం తొలుత ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపగా.. ఇదికాస్త ఇరువర్గాల మధ్య కాల్పులకు దారితీసింది.

* అంధ్రప్రదేశ్‌ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ కృషి వల్ల ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులను నడపనుంది. ఈ నెలలో ఒకటి, వచ్చే నెలలో మూడు చొప్పున కొత్త సర్వీసులను ప్రారంభించనుంది. సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు విశాఖ- హైదరాబాద్‌ సర్వీసు ప్రారంభం కానుంది.

* నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్‌లను విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విజయవాడ కలెక్టరేట్‌లో కలిశారు. సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈక్రమంలో పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

* వినాయక చవితి (Vinayaka Chavithi) ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. దివి నుంచి దిగివచ్చే బొజ్జ గణపయ్య కోసం ఊరూరా, వాడవాడలా అందమైన మండపాలను ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కళకళలాడుతోంది. ఈ క్రమంలోనే వినాయక వేడుకల్లో ఏటా ప్రత్యేకంగా నిలుస్తున్న ముంబయిలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్‌ (GSB Seva Mandal) ‘మహాగణపతి’ ఈసారీ వార్తల్లో నిలిచింది. దేశంలోనే సంపన్న వినాయకుడి (Richest Ganpati)గా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా రూ.400 కోట్లతో బీమా చేయించారట. ఇక్కడి విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించడమే ఇందుక్కారణం.

* ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ‘‘ ఆర్‌అండ్‌బీకి రూ.2,164.5 కోట్లు, నీటివనరుల శాఖకు రూ.1568.5 కోట్లు, పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్‌శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయశాఖకు రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటిసరఫరాకు రూ.75.5 కోట్లు, ఉద్యానశాఖకు 39.9 కోట్లు, పశుసంవర్థకశాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ.2 కోట్లు’’ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు.

* పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన జీవాంజీ దీప్తిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు ప్రభుత్వం తరఫున రూ.కోటి, కోచ్‌కు రూ.10 లక్షలు నగదు బహుమతిగా ప్రకటించారు. దీప్తికి గ్రూప్‌-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇస్తామని పేర్కొన్నారు. పారిస్‌ పారాలింపిక్స్‌లో దీప్తి మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో కాంస్యం సాధించింది. పారాలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జీవాంజీ దీప్తి స్వగ్రామం వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. బిడ్డ విజయం వెనకాల తల్లిదండ్రుల కృషి అపారం. వీరిది నిరుపేద కుటుంబం. దీప్తికి మానసిక వైకల్యం. మేధోపరమైన బలహీనత ఉండడంతో పసితనంలో ఆమె కోసం తండ్రి యాదగిరి తల్లడిల్లారు. కూతురుకు ఫిట్స్‌ వస్తే విలవిలలాడిపోయేవారు. ఒక దశలో దీప్తి క్రీడల్లో రాణించేందుకు డబ్బులకు వెనకాడవద్దని యాదగిరి తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేశారు.

* రాజకీయ అనిశ్చితి నెలకొన్న బంగ్లాదేశ్‌ (Bangladesh)లో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. జాతీయగీతాన్ని (National Anthem) మార్చాలంటూ మాజీ సైనికాధికారులు కోరుతున్నారు. దీనిపై తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. దానిని మార్చే ప్రణాళిక ఏదీ లేదని వెల్లడించింది. ప్రస్తుత జాతీయ గీతం(National Anthem) స్వతంత్ర బంగ్లాదేశ్‌ గుర్తింపునకు తగినట్టుగా లేదని మాజీ సైనికాధికారులు కొందరు వ్యాఖ్యలు చేశారు. దాంతో దానిని మార్చాలన్న డిమాండ్లు వచ్చాయి. బంగ్లాదేశ్‌ జాతీయ గీతం కూడా విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్ రచనే. 1971లో భారత్‌ దానిని తమపై బలవంతంగా రుద్దిందని వారు వ్యాఖ్యానించారు. ఇది దేశ వలసవాదాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌ మంత్రి ఖలీద్‌ హుస్సేన్‌ స్పందించారు. ‘‘మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వివాదాలు సృష్టించే విధంగా ఏమీ చేయదు’’ అని వ్యాఖ్యానించారు.

* ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత నలిమెల భాస్కర్‌ 2024 కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా పురస్కారం ప్రదానం చేయనున్నారు. 1956 ఏప్రిల్‌ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో భాస్కర్‌ జన్మించారు. 2013 సంవత్సరానికి గాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. మలయాళ రచయిత పుణత్తిల్‌ కుంజబ్దుల్లా రచించిన ‘స్మారక శశిగల్‌’ నవలను నలిమెల భాస్కర్‌ ‘స్మారక శిలలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z