Business

మెర్సిడెస్ బెంజ్ ఈవీ రికార్డు మైలేజీ-BusinessNews-Sep 10 2024

మెర్సిడెస్ బెంజ్ ఈవీ రికార్డు మైలేజీ-BusinessNews-Sep 10 2024

* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50శాతానికి పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. తెలంగాణను ‘ఫ్యూచర్‌ స్టేట్‌’గా పిలుస్తున్నామన్నారు. బలమైనా పునాదులున్నా.. రాష్ట్రం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు. భారీ రుణభారం రూ.6.85లక్షల కోట్లకు చేరుకుందన్నారు.

* శాటిలైట్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు (Toll collection) దిశగా మరో ముందడుగు పడింది. ఎప్పటి నుంచో ఈ విధానాన్ని తీసుకొస్తామని ప్రకటిస్తూ వస్తున్న కేంద్ర రవాణా శాఖ.. తాజాగా దీన్ని నోటిఫై చేసింది. ఈ మేరకు జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను (2008) సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్తగా గ్లోబల్‌ నావిగేషన్ శాటిలైట్‌ సిస్టమ్‌ (GNSS) ఆధారిత టోల్‌ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఫాస్టాగ్‌, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్ రికగ్నిషన్‌ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానం అమలు కానుంది. నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌తో కూడిన ఆన్‌ బోర్డు యూనిట్‌ (OBU) కలిగిన వాహనాలు టోల్‌ ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు.. ప్రయాణించిన దూరానికి గానూ టోల్‌ ఫీజు ఆటోమేటిక్‌గా చెల్లింపు జరిగిపోతుంది. ఈ తరహా వాహనాలకు ప్రత్యేక లేన్‌లను అమర్చనున్నారు. నావిగేషన్ డివైజ్‌ లేని వాహనాలకు సాధారణ టోల్‌ ఛార్జీలే వర్తిస్తాయి. అలాగే, కొత్తగా 20 కిలోమీటర్ల వరకు జీరో టోల్‌ కారిడార్‌ను తీసుకొచ్చారు. అంటే జాతీయ రహదారిపై 20 కిలోమీటర్ల వరకు టోల్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపై ప్రయాణిస్తే దూరానికి తగ్గట్లు టోల్‌ చెల్లించాల్సి ఉంటుంది.

* ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY)పథకం ద్వారా వంట గ్యాస్‌పై ప్రజలు చేసే ఖర్చు భారీగా తగ్గిందని కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ (Hardeep Singh Puri) వెల్లడించారు. ఈ పథకం లబ్ధిదారులు ఒక్క రోజు వంట గ్యాస్‌ కోసం రూ.5 మాత్రమే ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఉజ్వల యోజన పథకం పరిధిలోకి రాని వ్యక్తులు మాత్రం రోజుకు దాదాపు రూ.12 ఖర్చు చేస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఎల్‌పీజీ(LPG) కనెక్షన్ల సంఖ్య 2014లో 14 కోట్లు ఉండేదని, ప్రస్తుతం 33 కోట్లకు చేరుకుందని మంత్రి అన్నారు. ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేయడం ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు బొగ్గు, కట్టెలు వంటి సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించారని, దీంతో వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతున్నాయని అన్నారు.

* ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 16 (iPhone 16) ఫోన్లను ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ (Apple) లాంచ్ చేసింది. ఈ సిరీస్‌తో నాలుగు మోడళ్లను ఆవిష్కరించింది. ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ఫ్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాయి. లేటెస్ట్‌ ఐఫోన్‌పై ఎప్పటిలానే శాంసంగ్‌ (Samsung) తనదైన శైలిలో విమర్శలు చేసింది. ఫోల్డబుల్‌ ఫోన్‌ను యాపిల్‌ తీసుకొస్తుందంటూ చాలా కాలంగా ప్రచారం కొనసాగుతోంది. కానీ, ఇప్పటికీ ఆ వెర్షన్‌ ఇంకా అందుబాటులోకి తీసుకు రాకపోవడాన్ని ఉద్దేశిస్తూ శాంసంగ్‌ పోస్టు పెట్టింది. ‘మడిచేందుకు వీలుగా ఉండే ఫోన్లు వస్తే మాకు తెలియజేయండి’ అంటూ రెండేళ్ల క్రితం చేసిన పోస్టును శాంసంగ్‌ మళ్లీ పోస్టు చేసింది. ‘ఇంకా ఎదురుచూస్తున్నాం’ అంటూ సెటైర్‌ విసిరింది. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

* సింగిల్ చార్జితో 949 కిలోమీటర్ల ప్రయాణం. ఇంకేముంది గతంలో ఉన్న రికార్డును తిరగరాసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంది మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా. ఆటోకార్‌ ఇండియా సహకారంతో మెర్సిడెస్‌ బెంజ్‌ బ్యాటరీ ఎలక్ట్రిక్‌ లగ్జరీ సెడాన్‌ వెహికిల్‌ అయిన ఈక్యూఎస్‌ 580 4మేటిక్‌ బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు ప్రయాణించి ఈ ఘనతను సాధించింది. ఒక వైపు భారీ వర్షాలు, రోడ్డు విస్తరణ పనులు.. మరోవైపు నగరాలు, పట్టణాల ట్రాఫిక్‌ను చేధించుకుంటూ ఏకధాటిగా ప్రయాణం సాగిందని మెర్సిడెస్‌ బెంజ్‌ తెలిపింది. ఈ ప్రయాణినికి ఉపయోగించిన కారు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్‌ 580 4మ్యాటిక్. ఇది 107.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సింగిల్ చార్జితో 916.74 కిమీ ప్రయాణించిన యూకేలో ‘ఫోర్డ్‌ మస్టాంగ్‌ మ్యాక్‌ ఈ’ కారు పేరిట ఈ గిన్నిస్‌ రికార్డు ఉంది. ఇప్పుడు ఈ రికార్డ్ మెర్సిడెస్ బెంజ్ సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ పొందిన సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణమైన ఆటోకార్ ఇండియా బృందానికి అభినందించారు.

* దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361.75 పాయింట్ల లాభంతో 81,921.29 వద్ద, నిఫ్టీ 104.70 పాయింట్ల లాభంతో 25,041.10 వద్ద నిలిచాయి. దివీస్ ల్యాబ్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, భారతి ఎయిర్‌టెల్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z