DailyDose

బెజవాడ బస్‌స్టాండ్‌లో డ్రైవర్ల బాహాబాహీ-CrimeNews-Sep 10 2024

బెజవాడ బస్‌స్టాండ్‌లో డ్రైవర్ల బాహాబాహీ-CrimeNews-Sep 10 2024

* విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి. మాచవరం ప్రాంతంలోని జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. డేరంగుల వెంకటస్వామి వీధిలో జి.గోపికుమార్‌ అనే వ్యక్తి తన ఇంటి పక్కన కొండను ఆనుకుని ఉన్న చెట్టును నరికేందుకు నలుగురు కూలీలను మాట్లాడుకున్నారు. మంగళవారం ఉదయం చెట్టుకొమ్మలు నరుకుతున్న క్రమంలో బాగా తడిచిన కొండచరియలు విరిగి కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో విజ్జాడ రాము (55) మృతిచెందగా.. కామయ్య, హుస్సేన్‌ గాయపడ్డాయి. మాచవరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

* విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఫ్టాట్‌ఫాంపైకి బస్సులను చేర్చే విషయమై వివాదం చెలరేగింది. ఇది ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. బస్సులో ఉన్న డ్రైవర్‌పైకి మరో డ్రైవర్‌ దూసుకొచ్చాడు. జమ్మలమడుగు డిపో డ్రైవర్‌పై కల్యాణదుర్గం డిపో డ్రైవర్‌ దాడి చేశాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కాలితో తన్నాడు. దాడి సమయంలో బస్సు ఇంజిన్‌ ఆన్‌లో ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ నెల 6న ఘటన చోటుచేసుకోగా.. ఇద్దరు డ్రైవర్లు అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

* మెదక్‌ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం గోమారంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు.. మతిస్తిమితం కోల్పోయిన ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన సుమారు 40 ఏళ్లు ఉండే ఓ వ్యక్తి గోమారం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మతిస్తిమితం కోల్పోవడంతో హిందీ మాట్లాడుతూ గ్రామంలో తిరుగుతూ భిక్షాటన చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో దొంగతనం చేశాడనే నెపంతో గోమారం గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, మణికంఠగౌడ్‌లు మద్యం, గంజాయి మత్తులో అతనిపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు అతన్ని తాళ్లతో బైక్‌కు కట్టేసి ఊరంతా తిప్పడంతో అతని తీవ్రగాయాలయ్యాయని.. దీంతో అతను చనిపోయినట్లు గుర్తించారు. కొట్టొద్దని కాళ్లావేళ్లాపడినా కనికరించకుండా.. రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి అతడిపైకి బైకు ఎక్కించి అమానుషంగా ప్రవర్తించారు. బైకుకు కట్టి ఈడ్చుకుంటూ వెళ్లి ఓ చోట పడేశారు.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్టాండ్‌ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 6న నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు మాత్రం మరోలా చెబుతున్నారు. గ్రామంలో చిన్న దొంగతనం జరగడంతో కొత్తగా వచ్చిన వ్యక్తిని పట్టుకొని చితకబాది, అక్కడే పడేసి వెళ్లడంతో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. తిరుపతిరెడ్డి, మణికంఠగౌడ్‌లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

* వరంగల్‌లోని పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం ఆవరణలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రౌడీ రాణీ, మాజీ యూనియన్ లీడర్ రెచ్చిపోయింది. మామూళ్ల కోసం అమానవీయంగా ప్రవర్తించింది. అంతా చూస్తుండగానే బరితెగించి, ఓ ఔట్ సోర్సింగ్ కార్మికురాలిని గొలుసులతో కొట్టి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించింది. ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఆ ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయ లాంటిది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి. నిత్యం వందలాది మంది పేషెంట్లు, వాళ్ళ అటెండెన్స్ తో రద్దీగా ఉండే ఈ పేదల పెద్దాసుపత్రిలో కొంతమంది రాబందులు తిష్ట వేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో అమాయకులను రాబందుల్లా పీక్కు తింటున్నారు.. తాజాగా జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. రాజమ్మ అనే ఒక మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నాయకురాలు రౌడీ రాణీలా రెచ్చిపోయింది.. ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. ఉద్యోగం పెట్టిస్తే, నెల మామూళ్ళు ఇవ్వలేదని సుమలత అనే ఔట్ సోర్సింగ్ కార్మికురాలిపై అత్యంత దారుణంగా ప్రవర్తించింది. సెక్యూరిటీ సిబ్బందితోపాటు అక్కడ అంతా చూస్తుండగానే ఆమెపై విచక్షణారహితంగా గొలుసులతో దాడిచేసి అదే గొలుసు కట్టేసింది. గొలుసు తెంచుకున్న ఆమెను విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచింది. ఎంజీఎం సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఆ అబాగ్యురాలిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె బోరున విలపించచడంతో స్థానికులు ఆమెకు విముక్తి కల్పించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z