NRI-NRT

కమల vs ట్రంప్‌పై సమీక్ష-NewsRoundup-Sep 11 2024

కమల vs ట్రంప్‌పై సమీక్ష-NewsRoundup-Sep 11 2024

* అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తొలిసారి ముఖాముఖిగా తలపడిన ట్రంప్‌ (Donald Trump)-హారిస్‌ చర్చను యావత్‌ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. గతంలో బైడెన్‌-ట్రంప్‌ మధ్య జరిగిన సంవాదంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌దే పైచేయి అయినట్లు పేర్కొన్న అమెరికా మీడియా.. తాజా డిబేట్‌లో మాత్రం కమలా హారిస్‌ (Kamla Harris)కు ఎడ్జ్‌ ఇచ్చింది. హారిస్‌లో దృఢవిశ్వాసం, దూరదృష్టి కనిపించినట్లు అమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. డిబేట్‌ను నిర్వహించిన ఏబీసీ మీడియా.. ఇరువురు వాదనల్లో ఎంత వాస్తవం ఉందనే విషయంపై పూర్తి కథనాన్ని ప్రచురించింది.

ఏబీసీ మీడియా: కమలా హారిస్‌పై పైచేయి సాధించేందుకు ట్రంప్‌ అసంబద్ధ వాదనలు చేసినట్లు డిబేట్‌ను నిర్వహించిన ఏబీసీ మీడియా పేర్కొంది. ట్రంప్‌ విమర్శలకు దీటుగా స్పందించిన హారిస్‌.. సమయం వృథా చేయకుండా ప్రత్యర్థిపై విరుచుకుపడినట్లు తెలిపింది.

పొలిటికో: ఈ డిబేట్‌లో కమలా హారిస్‌దే విజయమని పొలిటికో అభిప్రాయపడింది. అది కూడా స్వల్ప తేడాతో కాదని.. భారీ విజయంగానే పేర్కొంది.

ది న్యూయార్క్‌ టైమ్స్‌: ట్రంప్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రాసిక్యూటర్‌గా తనకున్న అనుభవాన్ని కమలా హారిస్‌ ఉపయోగించుకున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. హారిస్‌పై ఆధిపత్యం సాధించేందుకు బదులు తనను సమర్థించుకునేందుకు ట్రంప్‌ ప్రయత్నం చేశారని చెప్పింది.

వాషింగ్టన్‌ పోస్ట్‌: ట్రంప్‌ వాదనలు వాస్తవాలకు దగ్గరగా లేవని, 2020 అధ్యక్ష ఎన్నికల నాటి వాదననే తెరమీదకు తీసుకువచ్చారని పేర్కొంది.

సీఎన్‌ఎన్‌: కమలా హారిస్‌ పూర్తి సన్నద్ధతతో వచ్చారని.. ఆమె ప్రతి సమాధానం ఆయనకు కోపం తెప్పించేలా ఉందని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. దీంతో ఒక్కోసారి ట్రంప్‌ సహనం కోల్పోయినట్లు కనిపించారని తెలిపింది.

ఫాక్స్‌ న్యూస్‌: డిబేట్‌లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఫాక్స్‌న్యూస్‌ పేర్కొంది.

* టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా.. పాక్ స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ అజామ్‌ (Babar Azam), షహీన్ అఫ్రిది తదితర ఆటగాళ్లు మరికొన్ని రోజుల్లో ఒకే జట్టు తరఫున ఆడే అవకాశముంది! గతంలో నిర్వహించిన ఆఫ్రో-ఆసియా కప్‌ను పునరుద్ధరించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్‌ భావిస్తుండమే ఇందుక్కారణం. 2005, 2007లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. వివిధ కారణాల వల్ల దీనిని నిలిపివేశారు. ఇందులో ఆసియా దేశాల క్రికెటర్లు ఒక జట్టుగా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి పోటీపడేవారు. వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఇంజామామ్‌ ఉల్ హక్‌, జహీర్ ఖాన్‌, షోయబ్ అక్తర్‌, అనిల్ కుంబ్లే, షహిద్‌ అఫ్రిది ఆసియా జట్టుకు ఆడారు. ఆఫ్రికా జట్టు తరఫున షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్, టాటెండా తైబు వంటి ఆటగాళ్లు ఆడారు.

* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు 11 రోజుల అనంతరం మళ్లీ సచివాలయంలో అడుగుపెట్టారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోనే పది రోజులుగా సీఎం బస చేశారు. ప్రస్తుతం వరద ముంపు నుంచి ఆ ప్రాతం కొద్దిగా కోలుకోవటం, బాధితులు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవడంతో పాటు అన్ని చోట్లా సాధారణ స్థితి నెలకొనడంతో ఇవాళ సచివాలయానికి వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి జిల్లాల పర్యటన ముగించుకొని నేరుగా సచివాలయానికి వచ్చిన సీఎం.. వరద సహాయక చర్యలపైనే అధికారులతో సమీక్షించారు. విజయవాడ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు కోరారు.

* ఏపీలో వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీ విద్యుత్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌, విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస సంయుక్తంగా రూ.10,61,18,694 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు అసోసియేషన్‌, ఐకాస నేతలు సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. విరాళం అందజేసిన విద్యుత్‌ ఉద్యోగులను సీఎం అభినందించారు.

* అమెరికన్‌ (USA) పాప్‌ సూపర్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌పై (Taylor Swift) ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మండిపడ్డారు. దేశ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ప్రత్యర్థి కమలా హారిస్‌కే (Kamala Harris) తాను ఓటు వేస్తానని టేలర్‌ ప్రకటించడమే అందుకు కారణమని తెలుస్తోంది. టేలర్‌ కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘నేను టేలర్‌ స్విఫ్ట్‌ అభిమానిని కాదు. కేవలం సందర్భం వచ్చిందని చెబుతున్నా. మీరు నిజంగా బైడెన్‌కు మద్దతు పలకలేరు. కానీ ఆమె ఎల్లప్పుడు డెమోక్రట్లను సమర్థిస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకోసం ఆమె భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ పాప్‌ స్టార్‌పై ట్రంప్‌ అక్కసు వెళ్లగక్కారు. కాగా.. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన కమలా హారిస్‌కు టేలర్‌ స్విఫ్ట్‌ మద్దతిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.

* అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది.

* విశాఖ జిల్లా భీమిలి బీచ్‌ వద్ద వైకాపా నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నేహారెడ్డి నిర్మించిన ప్రహరీగోడలో కొంత భాగాన్ని కూల్చామని జీవీఎంసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఖర్చులు ఎవరు భరించారని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది.

* తెలంగాణలో విద్యా వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది. మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై ఉపసంఘం చర్చించింది. కోచింగ్‌ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై కూడా చర్చ జరిగింది. కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు కావట్లేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోచింగ్‌ సెంటర్లలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

* ఏపీ, తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలుగురాష్ట్రాల్లో పర్యటించి వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించారు. బుధవారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాని కలిసి ఆ నివేదికను అందజేశారు. ఈ మేరకు శివరాజ్‌సింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. త్వరలోనే కేంద్ర బృందాలు వరద ప్రాంతాలను పరిశీలిస్తాయని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు.

* హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రామా చేస్తున్నారని, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను చంపేశారని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్‌ ప్రతిష్ట మసకబారిందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ‘‘రూ.800 కోట్ల ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారు. తొమ్మిది నెలల పాలనలోనే 2 నెలల పింఛన్లు మింగేశారు. పారిశుద్ధ్య నిర్వహణ పడకేయడంతో వ్యాధులు పెరిగాయి. ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చారు. రాష్ట్రంలో 50శాతానికి మించి రైతు రుణమాఫీ కాలేదు’’అని హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z