Business

Indian-Made Chip అనేది నా కల-BusinessNews-Sep 11 2024

Indian-Made Chip అనేది నా కల-BusinessNews-Sep 11 2024

* భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను యాపిల్‌ సంస్థ విస్తరిస్తోంది. దీంతో ఇక్కడి నుంచి యాపిల్‌ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య కాలంలో వీటి ఎగుమతుల విలువ 5 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఎగుమతి చేసిన విలువతో పోలిస్తే ఇది రెట్టింపు. యాపిల్‌ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్‌ 16.. భారత్‌లో తయారవుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. త్వరలోనే వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఐఫోన్‌ ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నడుమ నష్టాల్లో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,928.12 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 81,423.14 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 398 పాయింట్ల నష్టంతో 81,523 వద్ద ముగిసింది. నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 24,918 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, విప్రో, ఎస్‌బీఐ, హిందాల్కో, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌.. అదానీ పోర్ట్స్‌, కోల్ఇండియా, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 70.82 డాలర్లు వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,551.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారం మందగించడంతో భారత్‌లోని కార్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా విధులు నిర్వహిస్తున్న 200 మందిని తొలగించనుంది. మొత్తం 2000 మందికిపైగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌లలో దాదాపు 10శాతం మందిపై ఈ ప్రభావం పడనుంది. సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. యూజర్ల డిమాండ్‌ తగ్గడంతో శాంసంగ్‌ విక్రయాలు క్షీణించాయి. దీంతో స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారంలో శాంసంగ్‌ వాటా క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో కంపెనీ ఖర్చులను తగ్గించే పనిలో పడింది. అందులో భాగంగా లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, సపోర్ట్‌ ఫంక్షన్‌ విభాగంలోనే తొలగింపులు ఉండనున్నాయి. ఉద్యోగం కోల్పోయిన వారికి ఒప్పందం ప్రకారం మూడు నెలల వేతనం, ఇతరత్రా ప్యాకేజీలు ఇవ్వనున్నారు. అయితే ఈ ప్రకటనను కంపెనీ వెల్లడించకముందే ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాన్వేషణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

* కెన్యా ప్రభుత్వం, అదానీ గ్రూప్‌ మధ్య జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయ సుందరీకరణ, అభివృద్ధిపై జరగనున్న ఒప్పందాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. బిల్డ్‌ అండ్‌ ఆపరేట్‌ విధానంలో జరగనున్న ఈ ఒప్పందం కింద ఎయిర్‌పోర్టు 30 ఏళ్లపాటు అదానీ గ్రూప్‌ నిర్వహణలో ఉండనుంది. ఎయిర్‌ పోర్టులో అత్యాధునిక సౌకర్యాలు, అదనపు రన్‌వే, టెర్మినల్‌ను నిర్మించనున్నారు. కెన్యా ఎయిర్‌పోర్టు వర్కర్స్ యూనియన్‌ మాత్రం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది జరిగితే చాలా ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు.. ఒప్పందంలోని నియమ నిబంధనలు కెన్యాకు ప్రతికూలంగా ఉన్నాయని చెబుతోంది. వాస్తవానికి గత వారమే అదానీ గ్రూప్‌తో మిగిలిన చర్చలను విరమించుకోవాలని ఉద్యోగ సంఘం హెచ్చరించింది. లేకపోతే సమ్మెకు వెళతామని తేల్చి చెప్పింది.

* ప్రపంచవ్యాప్తంగా ప్రతి పరికరంలో ఇండియన్ మేడ్ చిప్ (Indian-Made Chip) ఉండాలనేది తమ కల అని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. భారత్‌లో చిప్‌లకు ఎప్పుడూ కొరత రాదని భరోసా ఇచ్చారు. దిల్లీలో ‘సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌’లో సెమికండక్టర్ల రంగానికి చెందిన కంపెనీల ప్రతినిధులు (semiconductor companies), నిపుణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ‘‘ప్రపంచంలో ప్రతి పరికరంలో భారత్‌లో తయారైన చిప్‌ ఉండాలన్నది మా కల. భారత్‌ను సెమీ కండక్టర్ (semiconductor) పవర్‌హౌస్‌కు మార్చేందుకు చేయాల్సిదంతా చేస్తాం. దేశంలో ప్రస్తుతం త్రీ డైమెన్షనల్ పవర్ ఉంది. ఆ మూడు.. సంస్కరణలకు అనుకూల ప్రభుత్వం, తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం, ఆశావహ మార్కెట్‌. టెక్నాలజీ రుచి ఏంటో తెలిసిన ఇలాంటి మార్కెట్‌ మరో చోట దొరకడం కష్టం’’ అని భారత్‌లో వృద్ధికి అనుకూలంగా ఉన్న వాతావరణం గురించి మోదీ వారికి వెల్లడించారు.

* భారత మార్కెట్లోకి ఎంజీ తన మూడో విద్యుత్తు కారు విండ్‌సోర్‌ (MG Windsor EV)ను విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ.9.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇప్పటికే మార్కెట్లో జెడ్‌ఎస్‌ ఈవీ, కోమెట్‌ ఈవీలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విండ్‌సోర్‌తోపాటు సరికొత్తగా బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (బీఏఏఎస్‌) ప్రోగ్రాంను ప్రారంభించింది. దీని కింద కిలోమీటర్‌కు రూ.3.5 చొప్పున చెల్లించి బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు. ఈ కారు బుకింగ్స్‌ అక్టోబర్‌ 3న ప్రారంభించి.. 12 నుంచి డెలివరీలను అందించనుంది. ఎంజీలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ వాటాలు కొన్న తర్వాత విడుదల చేసిన తొలి ఈవీ ఇదే. జెడ్‌ఎస్‌ ఈవీ, కోమెట్‌ ఈవీలకు భిన్నంగా మిడ్‌సైజ్‌ క్రాసోవర్‌ డిజైన్‌లో దీనిని తయారు చేశారు. ఈ కారులో పలు అత్యాధునిక ఫీచర్లతోపాటు.. ప్రయాణికులకు విశాలమైన స్పేస్‌ను అఫర్‌ చేసినట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విద్యుత్తు కార్లతో పోలిస్తే దీని డిజైన్‌ విభిన్నంగా ఉంది. ఇది లుక్స్‌లో ఉలుంగ్‌ క్లౌడ్‌ ఈవీ తరహాలో రూపొందింది. కాకపోతే భారత్‌లో అవసరమైన కొన్ని అప్‌డేట్స్‌ చేశారు.

* రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు రావడం చూస్తుంటాం. ఆ ఆహారానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్యం దృష్ట్యా భారత రైల్వేశాఖ (IRCTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో బేస్‌ కిచెన్లకు స్వస్తి చెబుతూ.. పూర్తిగా క్లౌడ్‌ కిచెన్ల (cloud kitchens) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బేస్‌ కిచెన్ల ద్వారా రైల్వేస్టేషన్లలో వండిన ఆహారాన్ని ప్యాక్‌ చేసి ప్రయాణికులకు అందించేవారు. అపరిశుభ్రత, ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులను ఐఆర్‌సీటీసీ అందుకుంది. ఇకపై అలా కాకుండా క్లౌడ్‌ కిచెన్లకు ఆ బాధ్యతను అప్పగించే యోచనలో ఉంది. నిపుణులు, కేటరింగ్‌ నిర్వహించే ఈ క్లౌడ్‌ కిచెన్లను ఏర్పాటుచేసే ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది. ఇప్పటికే ముంబయి మహా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు నెలరోజుల క్రితమే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

* అదనపు స్టోరేజీ అందించడం కోసం గూగుల్‌ వన్‌ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. క్లౌడ్‌ స్టోరేజీ విభాగంలో పోటీ నెలకొన్న తరుణంలో తక్కువ ధరకే ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. గూగుల్‌ వన్‌ లైట్‌ (Google One Lite Plan) పేరుతో తీసుకొచ్చిన ప్లాన్లలో అతి తక్కువ ధరకే 30జీబీ స్టోరేజీ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. గూగుల్ వన్‌ లైట్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.59. వార్షిక సభ్యత్వం పొందాలంటే ఏడాదికి రూ.589 చెల్లించాల్సిందే. అయితే ఈ ప్లాన్‌లో స్టోరేజీ మినహా ఇతర ఫీచర్లు ఉండవు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z