* బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి సంగారెడ్డి జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. బిహార్‌కు చెందిన గఫాఫర్(56) గతేడాది బీడీఎల్ బానూరులో ఐదేళ్ల బాలికకు కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి తాగించి.. అత్యాచారం చేసి చంపేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై నేరాభియోగానికి సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపించడంతో గఫాఫర్‌కు మరణ దండన విధిస్తూ జిల్లా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
* కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల మగ శిశువును మూటలో కట్టి కెనాల్ పక్కకు విసిరేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ పక్కన కొందరు ఓ పసికందును విసిరేశారు. అటువైపుగా వెళ్తున్న చొక్కారెడ్డి అనే రైతు పసికందు ఏడుపు విని దగ్గరకెళ్లి చూశాడు. కెనాల్ పక్కన ఓ మూటలో మగ శిశువు కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు. శిశువు జన్మించి మూడు రోజులు అవుతుందని, శిశువు శరీరంపై గాయాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. గుర్తు తెలియని మగ శిశువు లభ్యమైందని, ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్‌జీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
* తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కలకడ నుంచి చెన్నైకి టమాటోల లోడుతో వెళ్తోన్న కంటైనర్ లారీ అదుపుతప్పి.. తిరుపతి నుంచి పీలేరు వైపు వెళ్తోన్న కారు, బైకుపై పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కంటైనర్‌లో కింద ఉన్న కారులో ఎంత మంది ప్రయాణిస్తున్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
* అస్సాంలో కలకలం సృష్టించిన ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్ (stock trading scam)లో ఒక నటిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్(STF) నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను అదుపులోకి తీసుకుందని పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో తాజాగా వారి అరెస్టు చోటుచేసుకుంది. అస్సాం పోలీసులు ఇటీవల రూ.2 వేల కోట్ల కుంభకోణం గుట్టు రట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు సొమ్మును సమీకరించారు. ఈ కేసులో ఇప్పటికే విశాల్ ఫుకాన్‌ను అరెస్టు చేశారు. 60 రోజుల్లో పెట్టుబడులపై 30 శాతం రాబడి వస్తుందని విశాల్ నమ్మబలికాడు. నాలుగు నకిలీ సంస్థలను స్థాపించి, అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాడు. పలు ఆస్తుల్ని కూడబెట్టాడు. ఈ కుంభకోణంలో బోరా దంపతులతో పాటు మరికొందరిపైనా ఆరోపణలు వచ్చాయి. అతడి అరెస్టు తర్వాతే వీరిని పోలీసులు విచారణకు పిలిచారు. అయితే వీరు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసి, తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z